తాతయ్యకిది ఘనమైన నివాళి!
తాతయ్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తెరంగేట్రం చేసిన బన్నీ ఏ దశలోనూ నటుడిగా ఫెయిలవ్వలేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 'పుష్ప' సినిమాగానూ ఈ అవార్డు అందుకుని తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తొలి నటుడిగా ఖ్యాతికెక్కారు. 'పుష్ప' లో పుష్పరాజ్ పాత్రకి మాత్రమే దక్కిన గౌరవం ఇది. అతని నటన మెచ్చి వచ్చిన అవార్డు ఇది. 'గంగోత్రి' నుంచి 'పుష్ప' వరకూ బన్నీ జర్నీ ఎంతో ఆసక్తికరమైనది.
అంచలంచెలుగా ఎదిగిన నటుడు. వెనుక అల్లు అరవింద్ లాంటి బ్యాక్ బోన్ ఉన్నా! పరిశ్రమలో అదొక్కటే సరిపోదు. కేవలం ఎంట్రీ కార్డు మాత్రమే. ఆ తర్వాత ఎవరికి వారు ప్రతిభతో ఎదగాల్సిందే. బన్నీ అలా ఎదిగిన నటుడు. అందుకే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అవ్వగలిగాడు. మరి ఇదే అల్లు అర్జున్ గురించి స్వర్గీయ అల్లు రామలింగయ్య ఏమనుకున్నారో తెలుసా? అల్లు అర్జున్ ప్రవర్తన చూసి..చదువుల్లో సరిగ్గా మార్కులు రాకపోవడం చూసి ఎలా బ్రతుకుతాడు అనుకున్నారు.
ఆ కారణంగానే అర్జున్ చిన్న వయసులో ఉండగానే తనపేరిట తాతయ్య కొంత మొత్తాన్ని ఫిక్స్ డు డిపాజిట్ గా చేసారు. ఏరంగంలోనూ రాణించకపోతే చివరికి ఎఫ్ డీ మీద వచ్చే డబ్బుతోనైనా బ్రతికేస్తాడు? అన్నది ఆ తాతయ్య ధీమా. కానీ ఇప్పుడా తాతయ్య గర్వించే స్థాయికి ఎదిగాడు.
ఉత్తమ నటుడు గా జాతీయ అవార్డు తో ఆ తాతయ్యకే ఘనమైన నివాళీ అర్పించాడు. తాతయ్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తెరంగేట్రం చేసిన బన్నీ ఏ దశలోనూ నటుడిగా ఫెయిలవ్వలేదు.
చిన్న పాటి పరాజయాలు తప్ప! బన్నీ సినిమా అంటే మినిమం ఉంటుందనే అంచనాలతోనే రిలీజ్ అయ్యేవి. వెనుక మెగా ఫ్యామిలీ అనే బ్రాండ్ ఉన్నా..నాన్న అరవింద్ వెనుకున్నా! పరిశ్రమలో తనకు తానుగానే ఎదిగిన నటుడు. చిన్నప్పుడే సినిమాలంటే పిచ్చి అభిప్రాయం ఏర్పడింది.
తనలో ఆ అభిరుచిని గుర్తించింది మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఇంట్లో ఖాళీ సమయంలో బన్నీతో డాన్సులు చేయించేవారు. ఆయన మెలకువలు అనుసరించి గొప్ప డాన్సర్ అయ్యాడు. డాన్సుల పరంగా చూస్తే చిరంజీవి తర్వాత అంతటి పేరు బన్నీకే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.