అమరన్.. తెలుగులో క్రేజ్ మామూలుగా లేదుగా!

ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

Update: 2024-10-28 10:25 GMT

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోల్లో శివ కార్తికేయన్‌ ఒకరు. పలు డబ్బింగ్‌ చిత్రాలతో అలరించిన ఆయన ఇప్పుడు ''అమరన్‌'' సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఇప్పటికే 'అమరన్‌' చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు, సినిమాపై అంచనాలను కలిగించాయి. మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.. టీవీ షోలకు హాజరవుతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇవన్నీ ఈ సినిమాకి కావాల్సినంత బజ్ తెచ్చిపెట్టాయి.

టాలీవుడ్ లో సాయి పల్లవికి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'రెమో' 'వరుణ్ డాక్టర్' 'కాలేజ్ డాన్' 'మహావీరుడు' వంటి చిత్రాలతో శివకార్తికేయన్ కూడా మంచి విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కావడం.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉండటంతో.. తెలుగులోనూ ''అమరన్‌'' చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది.

ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి 'అమరన్‌' చిత్రాన్ని రూపొందించారు. దీని కోసం 'ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్' అనే పుస్తకాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ సినిమాలో ముకుంద్‌ పాత్రను శివ కార్తికేయన్‌ పోషించగా.. ఆయన భార్య ఇందు రెబెకా పాత్రలో సాయి పల్లవి నటించింది.

'అమరన్‌' పూర్తి స్థాయిలో యుద్ధం నేపథ్యంలో సాగే యాక్షన్‌ సినిమా కాదని, ఇదొక సైనికుడి జీవిత చరిత్ర అని చిత్ర బృందం చెబుతూ వస్తోంది. సైనికుల శిక్షణ ఎలా ఉంటుంది? వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు? వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. మేజర్ ముకుంద్‌ వరదరాజన్‌ తన ఫ్యామిలీతో గడిపిన రోజులతో పాటు సైన్యంలో ఆయన ప్రయాణాన్ని చూపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం కశ్మీర్‌లో జరిగింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని, కట్టుదిట్టమైన భద్రత మధ్య టెన్షన్ వాతారవరణంలో చిత్రీకరణ చేశారు.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి.. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రియల్ హీరో స్టోరీతో రాబోతున్న ''అమరన్‌'' మూవీ.. దీపావళి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News