బూతు గాయకుడి సినిమాకు భలే గిరాకీ!

పంజాబ్‌ కు చెందిన సింగర్‌ 'అమర్‌ సింగ్‌ చమ్కీలా' గురించి సౌత్‌ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు.

Update: 2024-04-13 13:30 GMT

ఈ మధ్య కాలంలో బయోపిక్‌ లకు మంచి స్పందన దక్కుతుంది. కాస్త కమర్షియల్‌ టచ్ ఉన్న బయోపిక్ లు సూపర్ డూపర్ హిట్‌ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా మరో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

పంజాబ్‌ కు చెందిన సింగర్‌ 'అమర్‌ సింగ్‌ చమ్కీలా' గురించి సౌత్‌ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ పంజాబ్ తో పాటు పలు ఉత్తరాది ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. తాజాగా ఆయన బయోపిక్ రావడంతో ఇప్పుడు అందరికీ కూడా సుపరిచితుడిగా మారాడు.

28 ఏళ్ల వయసుకే సింగర్ గా గుర్తింపు దక్కించుకుని, రెండు పెళ్లిళ్లు చేసుకుని, తన పాటల వల్ల విమర్శలు ఎదుర్కొని చివరకు అదే 28 ఏళ్ల వయసులో హత్య గావించబడ్డాడు. ఈయన జీవిత కథ లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. వాటిని 'అమర్ సింగ్‌ చమ్కీలా' అనే టైటిల్‌ తో సినిమా రూపొందించి, నేరుగా నెట్‌ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

చిన్న వయసులోనే సొంతంగా పాటలు రాసుకుంటూ పాడటం అమర్ సింగ్ మొదలు పెట్టాడు. అయితే ఆయన సాహిత్యం బూతుల మయం గా ఉండేదని, అలాంటి పాటల వల్ల యువత చెడి పోతుందని చాలా మంది విమర్శించే వారు. ఒక వైపు విమర్శలు పొందుతూనే మరో వైపు అంతకు పదిరెట్లు పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.

మొదటి భార్యకు తెలియకుండానే రెండో పెళ్లి చేసుకోవడం పెద్ద వివాదం అయింది. 1988 లో పంజాబ్‌ లోని మెహంసపూర్ గ్రామంలో ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో అమర్ సింగ్ మరియు ఆయన రెండో భార్య ను స్టేజ్ పై ఉండగానే కాల్చి చంపారు.

ఇప్పటి వరకు అమర్ సింగ్‌ ను కాల్చి చంపింది ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు. పోలీసులు సుదీర్ఘ ఎంక్వయిరీ చేసి వదిలేశారు. ఇలా అమర్‌సింగ్ జీవితంలో జరిగిన అన్ని విషయాలను ఈ సినిమాలో దర్శకుడు ఇంతియాజ్ అలీ చూపించాడు.

దిల్‌ జిత్‌ దోసాంజ్ టైటిల్‌ రోల్‌ లో నటించగా పరిణితి చోప్రా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. థియేటర్ లో విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అయ్యేవని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న అమర్ సింగ్ చమ్కీలా సినిమా టాక్ ఆఫ్‌ ది ఓటీటీ ఇండస్ట్రీగా మారింది.

Tags:    

Similar News