వివాదం : వీడియో ఫ్రూప్ బయట పెట్టిన హీరోయిన్
గదర్ ఏక్ ప్రేమ్‌కథ సినిమాకు సీక్వెల్‌గా 'గదర్ 2' సినిమా రూపొంది 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గదర్ ఏక్ ప్రేమ్‌కథ సినిమాకు సీక్వెల్‌గా 'గదర్ 2' సినిమా రూపొంది 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్నీ డియోల్ పని అయిపోయింది, ఆయన సినిమాలను ఎవరు చూస్తారని అనుకుంటున్న సమయంలో వచ్చిన 'గదర్ 2' సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్ల వసూళ్లు రాబట్టింది. సన్నీ డియోల్ క్రేజ్ తగ్గలేదని, మంచి కంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆ సినిమా నిరూపించింది. సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది... భారీ వసూళ్లు వచ్చాయి. సినిమా రన్ పూర్తి అయింది, ఓటీటీ స్ట్రీమింగ్ సైతం పూర్తి అయింది. ఈ సమయంలో హీరోయిన్ అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
గదర్ 2 సినిమా స్క్రిప్ట్ గురించి దర్శకుడు అనిల్ శర్మ చెప్పింది ఒకటి, చేసింది మరోటి, షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయన చాలా మార్పులు చేశారు. తనకు కావాల్సిన వారికి అనుకూలంగా సినిమాను మార్చే ప్రయత్నం చేశారని అమీషా పటేల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. క్లైమాక్స్‌లో మెయిన్ విలన్‌ను సకీనా చంపుతుందని అనిల్ శర్మ చెప్పాడు. కానీ సినిమాలో మాత్రం చరణ్ జీత్ తో విలన్‌ను చంపించాడు. అది ఆయన కావాలని మార్చాడు. దర్శకుడు తన వారి కోసం స్క్రిప్ట్ మార్చాడని అమీషా పటేల్ చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. అమీషా పటేల్ తనకు చెప్పినట్లుగా కాకుండా సినిమాను మరో విధంగా తీసి మోసం చేశాడని చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు అనిల్ శర్మ స్పందించాడు.
దర్శకుడు అనిల్ శర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... హీరో తన కొడుకును కాపాడుకోవడం కోసం పాకిస్తాన్‌కి భార్యతో కలిసి వెళ్తాడా అంటూ ఎద్దేవా చేశాడు. పాకిస్తాన్ ఏమైనా టూరింగ్ ప్లేస్‌గా ఆమె అనుకుంటున్నారా అంటూ, అక్కడికి ఎలా ఆమెను తీసుకు వెళ్తాడు హీరో అంటూ అనిల్ శర్మ ప్రశ్నించాడు. కొన్ని సార్లు సినిమా బాగా రావడం కోసం చిన్న చిన్న మార్పులు ఆన్ లొకేషన్ చేయాల్సి ఉంటుందని ఆయన తన మార్పులను సమర్ధించుకున్నాడు. అయితే స్క్రిప్ట్‌లో విలన్‌ను హీరోయిన్ చంపుతుంది అనే విషయాన్ని మాత్రం తాను ఎక్కడ మెన్షన్ చేయలేదని, ఆమె స్క్రిప్ట్ చదివి సినిమాను చేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఆయన అన్నాడు.
అనిల్ శర్మ విమర్శలపై అమీషా పటేల్ ఘాటుగా స్పందించింది. తనకు స్క్రిప్ట్ చెబుతున్న సమయంలో రికార్డ్ చేసిన ఒక వీడియోను ఆమె షేర్ చేసింది. అందులో అనిల్ శర్మ క్లైమాక్స్‌లో విలన్‌ను ఆమె చంపుతుందని చెప్పడంను ఆమె సాక్ష్యంగా చూపించింది. ఇప్పుడు మాత్రం తాను ఆ విధంగా చెప్పలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఎలా చెబుతారు, ఇంతటి సాక్ష్యంను కూడా మీరు తప్పుబడుతారా అంటూ ఆమె ప్రశ్నించింది. అమీషా పటేల్ వీడియో సాక్ష్యంకు దర్శకుడు అనిల్ శర్మ నుంచి వచ్చే స్పందన ఏంటా అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలై భారీ విజయం సాధించింది, రెండేళ్లు కావస్తున్న సమయంలో ఎందుకు ఈ వివాదం అని కొందరు ఇద్దరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో అనే ఆందోళనను కొందరు వ్యక్తం చేస్తున్నారు.