అమితాబ్: నేను చనిపోతే నా ఆస్తి ఎవరికి రాసిస్తానంటే?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన మరణం తర్వాత ఆస్తిని ఎవరికి రాసివ్వాలి? అనే సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారో వెల్లడించారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన మరణం తర్వాత ఆస్తిని ఎవరికి రాసివ్వాలి? అనే సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారో వెల్లడించారు. ఒక త్రోబ్యాక్ ఇంటర్వ్యూలో అమితాబ్ తన పిల్లలను పెంచడం గురించి మాట్లాడారు. వారిని సమానమైన విధానంలో పెంచే అవసరం గురించి అమితాబ్ మాట్లాడారు. తన ఆస్తిని తన పిల్లలు శ్వేతా బచ్చన్ నందా, అభిషేక్ బచ్చన్ లకు సమానంగా పంచుతానని వెల్లడించారు.
రెడిఫ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ-``నేను ఒక విషయంపై నిర్ణయం తీసుకున్నాను..నేను వారి మధ్య భేదం చూపను. నేను చనిపోయినప్పుడు, నా వద్ద ఉన్న ఆస్తి అంతా నా కుమార్తె- నా కొడుక్కి సమానంగా పంచుతాను. ఇద్దరి విషయంలో ఎటువంటి భేదం లేదు. జయ నేను చాలా కాలం క్రితం దీనిని నిర్ణయించుకున్నాం`` అని తెలిపారు. అమ్మాయి `పరాయా ధన్` అని అందరూ అంటుంటారు... ఆమె తన భర్త ఇంటికి వెళ్తుంది.. కానీ నా దృష్టిలో ఆమె మా కుమార్తె... అభిషేక్‌కి ఉన్న హక్కులే ఆమెకు ఉన్నాయి..`` అన్నారాయన. యాధృచ్ఛికంగా గతేడాది అమితాబ్ తన బంగ్లా `జల్సా`ను శ్వేతా బచ్చన్ నందాకు బహుమతిగా ఇచ్చాడు. అప్పట్లో దీని విలువ రూ.50 కోట్లు.
అదే సంభాషణలో అమితాబ్ తన కొడుకు అభిషేక్ బచ్చన్‌తో తన బంధం గురించి ఓపెనయ్యాడు. తనను స్నేహితుడిలా చూసుకుంటానని చెప్పాడు. అభిషేక్ పుట్టకముందే నేను చాలా నిర్ణయించుకున్నాను.. నాకు కొడుకు ఉంటే అతడు కొడుకు కంటే నా స్నేహితుడు అవుతాడని చెప్పారు. నా బూట్లు తను ధరించడం ప్రారంభించిన రోజు నా స్నేహితుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు నేను అతనిని స్నేహితుడిలా చూస్తున్నాను. నేను అతడిని కొడుకుగా చాలా అరుదుగా చూస్తాను. నేను ఒక తండ్రిగా అతని గురించి ఆందోళన చెందుతాను.. నేను అతడిని తండ్రిగా చూసుకుంటాను.. నేను ఒక తండ్రిగా అతడికి సలహా ఇస్తాను. మేం కలిసి మాట్లాడుకున్నప్పుడు స్నేహితులుగా మాట్లాడుకుంటాం అని అమితాబ్ చెప్పారు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ద్వారా అమితాబ్ బచ్చన్...అతడి కుటుంబం నాల్గవ ధనిక బాలీవుడ్ సంస్థానంగా పేరుపొందిన తర్వాత హెడ్ లైన్స్ లోకొచ్చారు. బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబం నికర ఆస్తి విలువ రూ. 1,600 కోట్లు ఉందని కథనాలొచ్చాయి. అమితాబ్ దీనిపై ఇంకా వ్యాఖ్యానించలేదు. ఈ జాబితాలోని టాప్ 5 అత్యంత సంపన్న బాలీవుడ్ కుటుంబాలలో అమితాబ్ కుటుంబం స్థానం పొందడంలో ఆశ్చర్యం లేదు. అమితాబ్, అతడి కుటుంబ సభ్యులు గత రెండు సంవత్సరాలుగా రకరకాల ఆస్తులను కొనుగోలు చేసినందుకు వార్తల్లో ఉన్నారు.