60 సార్లు చూసాను..అందుకే సీక్వెల్!
చేతిలో చిల్లి గవ్వలేకుండా పట్టణానికి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగిన విజయ్ అనే వ్యాపార వేత్త పాత్రలో అమితాబచ్చన్ నటన అందర్నీ కట్టి పడేసింది
బిగ్ బీ అమితాబచ్చన్ కెరీర్లో ఎన్నో ఐకానిక్ చిత్రాలున్నాయి. వాటిలో త్రిశూల్ ఒకటి. చేతిలో చిల్లి గవ్వలేకుండా పట్టణానికి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగిన విజయ్ అనే వ్యాపార వేత్త పాత్రలో అమితాబచ్చన్ నటన అందర్నీ కట్టి పడేసింది. ప్రేక్షకులకే కాదు బచ్చన్ తో పలు చిత్రాలు నిర్మించిన ఆనంద్ పండిట్ కి కూడా ఈ చిత్రం ఎంతగానో నచ్చిందిట. అందుకే ఆయనిప్పుడు ఈసినిమాకి సీక్వెల్ సన్నాహాలు చేస్తున్నారు.
`త్రిశూల్` ని ఇప్పటి వరకూ 60 సార్లు చూసి ఉంటాను. ఈసినిమా కథ నాలో ఎంతో స్పూర్తిని నింపింది. అందుకే గుజరాత్ నుంచి ముంబైకి వచ్చాను. ఎప్పటికైనా అమితాబ్ తో త్రిశూల్ సీక్వెల్ చేయాలన్నది నా కల` అని అన్నారు. ఈ సీక్వెల్కి ఆయనే స్వయంగా కథ కూడా సిద్దం చేస్తున్నారు. ఆయనే నిర్మిస్తారు. కానీ దర్శకుడిగా బాధ్యతలు మాత్రం తీసుకోరు. అతడి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. త్రిశూల్ చిత్రాన్ని యశ్ చోప్రా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సీక్వెల్ ఛాన్స్ ఎవరు? అందుకుంటారు? అన్నది చూడాలి. అలాగే ఇప్పుడా సినిమాకి సీక్వెల్ అంటే అమితాబ్ ఆ పాత్రకి సరిపోతారా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అమితాబ్ యువకుడిగా ఉన్న సమయంలో నటించిన చిత్రమిది. అప్పటికి ఆయన వయసు 30 ఏళ్ల లోపు ఉంటాయి. కష్టపడి పైకి వచ్చే పాత్రకి పర్పెక్ట్ గా సూటయ్యారు. ఇప్పుడు సీక్వెల్ అంటే ఆయన వయసును కూడా కథ మ్యాచ్ చేయాలి.
అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. లేదంటే? మరో పేరున్ననటుడితో చేయాల్సి ఉంటుంది. అయితే పండిట్ అమితాబ్ పేరును కలవరిస్తోన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. అప్పట్లో అమితాబ్ నటించిన `జంజీర్` చిత్రం సీక్వెల్ లో రామ్ చరణ్‌నటించిన సంగతి తెలిసిందే. తఫాన్ టైటిల్ తో దీన్ని తెలుగులో రిలీజ్ చేసారు. కానీ సినిమా పరాజయం చెందింది.