కేబీసీలో సంజూపై అమితాబ్ 80 వేల ప్రశ్న.. ప్రేక్షకులూ మహా పూర్..
దాదాపు 25 ఏళ్లుగా కొనసాగుతోంది కౌన్ బనేగా కరోడ్ పతి.. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏబీసీఎల్) పేరిట నిర్మాణ సంస్థ మొదలుపెట్టి తీవ్ర ఆర్థిక నష్టాల పాలైన అమితాబ్ ను ఒడ్డుకు చేర్చింది కేబీసీ.
భారత దేశంలో క్రికెట్ ను ఆరాధించేవాళ్లు ఎంతమంది ఉంటారు..? పోనీ క్రికెట్ ను అభిమానించే వాళ్లు ఎంతమంది ఉంటారు..? సరదాగా చూసేవాళ్లు ఇంకెంతమంది ఉంటారు? వీళ్లలో ఎవరూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు.. కనీసం హింట్ కూడా ఇవ్వలేకపోయారు.. చెప్పుకోవడానికి వింతగా అనిపించినా ఇది నిజం.. అందులోనూ ఎందరో అభిమానంగా చూసే.. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ షో కౌన్ బనేగా కరోడ్ పతిలో జరగడం మరింత విచిత్రంగా కనిపిస్తోంది. ఇంతకూ ఏం జరిగిందంటే..?
దాదాపు 25 ఏళ్లుగా కొనసాగుతోంది కౌన్ బనేగా కరోడ్ పతి.. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏబీసీఎల్) పేరిట నిర్మాణ సంస్థ మొదలుపెట్టి తీవ్ర ఆర్థిక నష్టాల పాలైన అమితాబ్ ను ఒడ్డుకు చేర్చింది కేబీసీ. దీనిని అమితాబ్ ఎన్నోసార్లు చెప్పారు కూడా. మరోవైపు ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 16 జరుగుతోంది. మధ్యలో వేరేవారు వ్యాఖ్యాతలుగా చేసినా.. ఇప్పుడు అమితాబ్ చైర్ లోకి వచ్చేశారు. తనకంటూ ప్రత్యేక ముద్ర ఉన్న ఆయన కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు.
సులువైన ప్రశ్న.. క్లిష్టమైన జవాబు
కేబీసీ తాజా ఎపిసోడ్ లో రామ్ కిషోర్ పండిట్ అనే వ్యక్తి పాల్గొంటున్నారు. ఆయనను అమితాబ్ రూ.80 వేల విలువైన ప్రశ్న అడిగారు. క్రికెట్ కు సంబంధించిన ఈ ప్రశ్న చాలా సులువైనది. కానీ.. పండిట్ కు అదే క్లిష్టమైంది. రెండు లైఫ్ లైన్ లు వాడుకున్నా సమాధానం చెప్పలేకపోయారు. దీంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఏమిటీ ఆ ప్రశ్న..
ఐపీఎల్-2024 సీజన్ లో కెప్టెన్ లుగా ఉన్న భారత ఆటగాళ్లలో ఇప్పటివరకు టెస్టు మ్యాచ్ ఆడనివారు ఎవరు? అనేది అమితాబ్ ప్రశ్న. దీనికి
ఆప్షన్ లుగా ఎ-శ్రేయస్ అయ్యర్, బి- హార్దిక్ పాండ్యా, సి-సంజూ శాంసన్, డి-రిషబ్ పంత్ అని ఇచ్చారు. అయితే, రామ్ కిషోర్ దీనికి నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. ఆడియన్స్ పోల్ ఉపయోగించుకున్నారు. కానీ, వారి నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. అమితాబ్ మరో లైఫ్ లైన్ ఫోన్ ఎ ఫ్రెండ్, డబుల్ డిప్ వాడుకోవాలని సూచించారు. రామ్ కిషోర్.. స్నేహితుడికి ఫోన్ చేసే ఆప్షన్ తీసుకున్నారు. అటునుంచి సమాధానం రాకపోవడంతో డబుల్ డిప్ లైఫ్ లైన్ ను వాడుకున్నారు. చివరకు శ్రేయస్ అయ్యర్ పేరును జవాబుగా చెప్పారు. కానీ, కంప్యూటర్ స్ర్కీన్ ఇది సరైన సమాధానం కాదని తేల్చింది. దీంతో రామ్ కిషోర్ రూ.80 వేలను కోల్పోయారు.
సమాధానం సంజూ..
రామ్ కిషోర్ రెండు లైఫ్ లైన్లు ఉపయోగించుకున్నా సరైన జవాబు ఇవ్వలేకపోయారు. అసలు సమాధానం సంజు శాంసన్ (సి). దీనిని బిగ్ బీ తర్వాత చెప్పారు. కాగా, ఐపీఎల్ లో శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్నాడు. కేబీసీలో అడిగిన ప్రశ్నలోని పంత్, పాండ్యా, అయ్యర్ ఇప్పటికే టెస్టులు ఆడారు. సంజూ టి20, వన్డేలకు ఎంపికవుతున్నాడు. టెస్టుల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.