మహేష్‌ బాబు సలహాతో 'సంక్రాంతికి వస్తున్నాం' కథ..!

2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.

Update: 2025-01-24 09:57 GMT

2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే రూ.250 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా లాంగ్‌ రన్‌లో రూ.300 కోట్లను క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా సక్సెస్‌ను దక్శకుడు అనిల్ రావిపూడి ఎంజాయ్ చేస్తున్నాడు. విడుదలకు ముందు ఏ స్థాయిలో సినిమాను ప్రమోట్‌ చేశాడో అదే స్థాయిలో సినిమా విడుదల తర్వాత కూడా ప్రమోషన్ చేస్తున్నాడు. పదుల కొద్ది ఇంటర్వ్యూలు ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మహేష్ బాబుతో అనిల్‌ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా రూపొందించిన విషయం తెల్సిందే. ఆ సన్నిహిత్యం ఇద్దరి మధ్య కొనసాగుతూనే ఉంది. ఆమధ్య రజనీకాంత్‌ నటించిన జైలర్‌ సినిమా విడుదలైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ఇలాంటి ఒక జోనర్‌లో ఎందుకు ట్రై చేయకూడదు అంటూ మహేష్ బాబు ఆ సమయంలో అనిల్ రావిపూడితో అన్నారట. మహేష్‌ బాబు అన్న మాటను సీరియస్‌గా తీసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం కథను రాసుకున్నాడు. జైలర్‌లో రజనీకాంత్‌ రిటైర్డ్‌ జైలర్‌ అయితే ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్‌ ఆఫీసర్ అనే విషయం తెల్సిందే.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మంచి వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇంతటి విజయాన్ని ఊహించలేదని అన్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందించాలనే ఉదేశంతో ఈ సినిమాను రూపొందించినట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఒక కిడ్నాప్ డ్రామాను కామెడీగా తీయాలని అనుకున్నాను. ఇద్దరు హీరోయిన్స్‌ మధ్య అయితే ఫ్యామిలీ మరింతగా ఆకర్షితం అవుతారని భావించి వెంకటేష్ కి భార్య, మాజీ ప్రియురాలి పాత్రలను పెట్టినట్లు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. సినిమాలో బుల్లిరాజు పాత్రకి మంచి స్పందన వచ్చిందని ఆ స్థాయి స్పందన ఊహించలేదని అన్నాడు.

అనిల్ రావిపూడి తదుపరి సినిమాను చిరంజీవితో చేయబోతున్నాడు. ఇప్పటికే స్టోరీ రెడీ అయ్యిందని, విశ్వంభర షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత అనిల్‌ రావిపూడితో చిరంజీవి సినిమా ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. అనిల్‌ రావిపూడి మరోసారి సంక్రాంతికి వచ్చి హిట్‌ కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్‌ పైనా స్పందించాడు. ఈ కథకు సీక్వెల్‌ తీసేందుకు మంచి స్కోప్‌ ఉంది. అందుకే కచ్చితంగా మరోసారి సంక్రాంతికి వస్తాం అని అనిల్ రావిపూడి హామీ ఇచ్చారు. వెంకటేష్‌ కి కెరీర్‌ బెస్ట్‌ వసూళ్లు నమోదు అవుతున్నాయి. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లకు బిగ్గెస్ట్‌ సక్సెస్‌లు దక్కాయి.

Tags:    

Similar News