ప‌టాస్ లేక‌పోతే నేను లేను

టాలీవుడ్ లో రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌య‌మెర‌గ‌ని డైరెక్ట‌ర్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు అనిల్ రావిపూడి.;

Update: 2025-04-09 09:43 GMT
Anil Ravipudi Says Pataas Is Still His Favorite Film

టాలీవుడ్ లో రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌య‌మెర‌గ‌ని డైరెక్ట‌ర్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు అనిల్ రావిపూడి. ప‌టాస్ తో మొద‌లుపెట్టి అనిల్ ఇప్ప‌టివ‌ర‌కు చేసిన ప్ర‌తీ సినిమా ఒక‌దాన్ని మించి ఒక‌టి హిట్టుగా నిలిచిన‌వే. రీసెంట్ గా వెంక‌టేష్ తో క‌లిసి అనిల్ చేసిన సంక్రాంతికి వ‌స్తున్నాం అటు వెంకీ కెరీర్లోనూ, ఇటు అనిల్ కెరీర్ లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే.

సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి సినిమా చేస్తున్నార‌నే విష‌యం తెలిసిందే. రీసెంట్ గా ఉగాది రోజునే ఆ సినిమాను పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లుపెట్టారు. చిరూ కామెడీ టైమింగ్ కు అనిల్ రావిపూడి లాంటి డైరెక్ట‌ర్ ప‌డితే చూడాల‌ని ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ ఆశ మెగా157తో తీర‌బోతుంది.

ఇదిలా ఉంటే అనిల్ రీసెంట్ గా క‌ళ్యాణ్ రామ్, విజ‌య‌శాంతి తో క‌లిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. క‌ళ్యాణ్ రామ్ న‌టించిన కొత్త సినిమా అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతీ ఏప్రిల్ 18న రిలీజ్ కానున్న నేప‌థ్యంలో క‌ళ్యాణ్ రామ్, విజ‌యశాంతి ఆ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో వారితో కలిసి అనిల్ కూడా పాల్గొన్నారు.

త‌న ఫ‌స్ట్ హీరో క‌ళ్యాణ్ రామ్, విజ‌య‌శాంతి రీఎంట్రీ సినిమాకు డైరెక్ట‌ర్ తానే అవ‌డంతో వారిద్ద‌రూ క‌లిసి చేస్తున్న అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి కూడా త‌న సినిమానే అని అందుకే ప్ర‌మోష‌న్స్ కు వ‌స్తున్నాన‌ని చెప్పారు అనిల్ రావిపూడి. ఇదిలా ఉంటే ఇంట‌ర్వ్యూలో భాగంగా ప‌టాస్ ఇష్ట‌మా, స‌రిలేరు నీకెవ్వ‌రు ఇష్ట‌మా అని యాంక‌ర్ సుమ అనిల్ ను అడిగింది.

సుమ ప్ర‌శ్న‌కు ఒక్క సెక‌ను కూడా ఆలోచించ‌కుండా అనిల్ వెంట‌నే ప‌టాస్ అని చెప్పారు. విజ‌య‌శాంతిని ప‌క్క‌న పెట్టుకుని ప‌టాస్ పేరు చెప్తున్నారా అని అడిగితే ఎవ‌రున్నా, ఏమ‌నుకున్నా త‌న‌కు ప‌టాసే ఇష్ట‌మ‌ని, ప‌టాస్ తో తాను డైరెక్ట‌ర్ అవ‌డం వ‌ల్లే స‌రిలేరు నీకెవ్వ‌రు చేశాన‌ని, భ‌విష్య‌త్తులో ప్ర‌పంచం మొత్తం గ‌ర్వించే సినిమా చేసినా స‌రే ప‌టాస్ సినిమానే త‌న‌కు గొప్ప అని ఆ సినిమా అంటే త‌న‌కు అంత ఇష్ట‌మ‌ని, ప‌టాస్ లేక‌పోతే నేను లేన‌ని అనిల్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News