'బిగ్' లీగ్‌లోకి అనిల్ రావిపూడి
ఈ చిత్రానికి పారితోషకం కూడా భారీగానే ఆఫర్ చేశారట. ఆ నంబర్ తెలిస్తే అనిల్ టాప్ లీగ్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడని అర్థమవుతుంది.
అనిల్ రావిపూడిని హిట్ మెషీన్ అంటారు టాలీవుడ్లో. ఇప్పటిదాకా అతడికి ఫెయిల్యూర్ అన్నదే లేదు. ఒక్క ‘ఎఫ్-3’ మాత్రమే ఒక మోస్తరుగా ఆడింది. మిగతావన్నీ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లే. అయినా సరే.. అనిల్ రావిపూడిని టాప్ లీగ్ దర్శకుడిగా పరిగణించేవారు కాదు. ఎక్కువగా మిడ్ రేంజ్ సినిమాలు చేయడం, కామెడీ మీదే ఫోకస్ చేయడం అందుకు ఒక కారణం కావచ్చు. ఐతే ప్రొడ్యూసర్లతో పాటు బయ్యర్లకు భారీ లాభాలు అందించడంలో చాలామంది స్టార్ డైరెక్టర్ల కంటే ముందుంటాడు అనిల్. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో అతను బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేశాడో తెలిసిందే. ఈ చిత్రంతో తన రేంజ్ మారినట్లే కనిపిస్తోంది. టాలీవుడ్లో తన డిమాండ్ అమాంతం పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి తనతో సినిమా ఓకే చేశాడు. ఈ చిత్రానికి పారితోషకం కూడా భారీగానే ఆఫర్ చేశారట. ఆ నంబర్ తెలిస్తే అనిల్ టాప్ లీగ్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడని అర్థమవుతుంది.
చిరు చిత్రానికి రూ.25 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నాడు అనిల్ రావిపూడి. వరుస హిట్లు ఇస్తున్నా అనిల్ మిగతా టాప్ లీగ్ డైరెక్టర్ల స్థాయిలో గుర్తింపు, పారితోషకం పొందలేకపోయాడు ఇన్నాళ్లూ. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో తన రేంజ్ మారిపోయింది. ఆ చిత్రానికి ముందు ఇచ్చిన పారితోషకానికి తోడు అదనంగా దిల్ రాజు కొంత ఇచ్చినట్లు సమాచారం. అది కలుపుకున్నా కూడా తర్వాతి చిత్రానికి అందుకోనున్న రెమ్యూనరేషన్‌తో పోలిస్తే తక్కువే. తెలుగులో పాతిక కోట్లు, అంతకుమించి పారితోషకం అందుకునే దర్శకులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. రాజమౌళి, సుకుమార్ లాభాల్లో వాటా రూపంలో చాలా పెద్ద మొత్తంలోనే పారితోషకం అందుకుంటున్నారు. తర్వాతి స్థాయి దర్శకులకు అనిల్.. చిరు చిత్రంతో దగ్గరగా వెళ్లిపోతున్నాడు. ఈ చిత్రాన్ని ‘భగవంత్ కేసరి’ నిర్మాత సాహు గారపాటి, చిరు తనయురాలు సుష్మిత కొణిదెల కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు దశలో ఉన్న ఈ సినిమా వేసవిలో సెట్స్ మీదికి వెళ్తుంది.