'యానిమల్'కి రెండు ఇంటర్వెల్స్ వేస్తారా?
రణబీర్ కపూర్ కథానాయకుడిగా సందీప్ వంగా రూపొందిస్తున్న యానిమల్ సుదీర్ఘ నిడివితో రెండు ఇంటర్వెల్స్ తో థియేటర్లలో ఆడనుందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి
రణబీర్ కపూర్ కథానాయకుడిగా సందీప్ వంగా రూపొందిస్తున్న యానిమల్ సుదీర్ఘ నిడివితో రెండు ఇంటర్వెల్స్ తో థియేటర్లలో ఆడనుందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి హిందీ సినిమా చరిత్రలో రెండు ఇంటర్వెల్స్ తో సినిమాలు రావడం అన్నది గత చరిత్ర. కొన్ని దశాబ్ధాల క్రితం ఇలా ప్లాన్ చేసేవారు. దర్శకులు సుదీర్ఘ నిడివితో సినిమాలు తీయడంతో రెండు ఇంటర్వెల్స్ అవసరం పడేవి. కానీ ఇటీవలి కాలంలో ఏ సినిమా నిడివి అయినా 2గం.ల 40 నిమిషాలు లేదా 3 గం.ల లోపు మాత్రమే. అందువల్ల రెండు ఇంటర్వెల్స్ అవసరం పడే సందర్భాలు ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు సందీప్ వంగా యానిమల్ కి 3గం.ల 18 నిమిషాల నిడివి వచ్చిందని దీని నుంచి ఏదీ కట్ చేయలేని పరిస్థితి ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి గొప్ప రెస్పాన్స్ వచ్చింది. మరోసారి అర్జున్ రెడ్డి తరహాలోనే గ్రిప్పింగ్ కంటెంట్ తో సందీప్ వంగా మ్యాజిక్ చేయబోతున్నాడని టీజర్ గ్లింప్స్ వెల్లడించింది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా యానిమల్ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రన్ టైమ్ లాక్ అయిందని, అయితే నిడివి తగ్గించేందుకు సందీప్ వంగా ససేమిరా అంటున్నారని తెలిసింది. అతడికి రణబీర్ మద్ధతు లభించడంతో టీసిరీస్ అధినేతలు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక రెండు ఇంటర్వెల్స్ తో యానిమల్ సినిమాని వేయడమే మిగిలిన అప్షన్.
అమీర్ ఖాన్ లగాన్, సల్మాన్ ఖాన్ హమ్ ఆప్కే హై కౌన్ సుదీర్ఘ రన్‌టైమ్ కలిగి ఉండడంతో రెండు విరామాలు ఉన్నాయి. యానిమల్ దాదాపు 200 నిమిషాల పాటు కూర్చోబెట్టగల గ్రిప్పింగ్ కథనంతో తెరకెక్కింది. అంత సేపు ఆడియెన్ ని కూర్చోబెట్టాలంటే మధ్యలో రెండు ఇంటర్వెల్స్ అవసరం అని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకూ చిత్రబృందం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్‌లపై చాలా ఆశలు ఉన్నాయి. మరి దర్శకుడు 'అర్జున్‌రెడ్డి' ఫీట్‌ని రిపీట్ చేస్తాడా లేక అంతకన్నా పెద్ద రేంజు అని నిరూపిస్తాడా అనేది వేచి చూడాలి.
బాలీవుడ్ లో రెండు ఇంటర్వెల్స్:
భారతీయ సినిమా షోమ్యాన్ రాజ్ కపూర్ నటించిన రెండు అత్యంత పాపులర్ చిత్రాలైన సంగం-మేరా నామ్ జోకర్ కల్ట్ క్లాసిక్‌లుగా అలరించాయి. హాలీవుడ్ క్లాసిక్, గాన్ విత్ ది విండ్ నుండి ప్రేరణ పొంది రూపొందించిన 'సంగం'లో రాజ్ కపూర్, వైజంతిమాల, రాజేంద్ర కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, ట్రయాంగిల్ ప్రేమ, ఇద్దరు ప్రాణ స్నేహితులు, సుందర్ (కపూర్) మరియు గోపాల్ (కుమార్), అదే అమ్మాయి రాధతో ప్రేమలో పడతారు, ఈ పాత్రను వైజంతిమాల పోషించింది. 1964లో విడుదలైన సంగం 3 గంటల 58 నిమిషాల నిడివితో రెండు విరామాలను కలిగి ఉన్న మొట్టమొదటి హిందీ చిత్రంగా నిలిచింది. నిడివి ఉన్నప్పటికీ, సినిమా విడుదల సమయంలో బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
రాజ్ కపూర్ మరొక కళాఖండం మేరా నామ్ జోకర్ .. సంగం విడుదలైన ఆరు సంవత్సరాల తర్వాత 1970లో విడుదలైంది. సంగం రెండు ఇంటర్వెల్‌లతో తొలి హిందీ చిత్రం కాగా, మేరా నామ్ జోకర్ కూడా అదే బాటలో రెండు ఇంటర్వెల్స్ తో విడుదలైంది. వాస్తవానికి, మేరా నామ్ జోకర్ 4 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉంది. కానీ సంగం మాదిరిగా కాకుండా, మేరా నామ్ జోకర్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. ఆ సమయంలో విమర్శకులను ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. మేరా నామ్ జోకర్ ఒక సర్కస్ ప్రదర్శకుడి జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం. కపూర్ తన స్వంత బాధలను భరించి ప్రేక్షకులను నవ్వించే పాత్రను పోషించాడు.
ఈ చిత్రం జీనా యహాన్ మర్నా యహాన్ అనే పాటతో ప్రారంభమవుతుంది. దీనిలో రాజ్ కపూర్ తన జీవితాన్ని తీర్చిదిద్దిన ముగ్గురు మహిళలను సర్కస్‌లో తన చివరి ప్రదర్శనను చూడటానికి ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత అతడు ప్రేక్షకులను తన జీవితంలోని వివిధ దశలలో ఎలా ప్రేమలో పడ్డాడో ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకువెళతాడు. అయితే కేవలం సర్కస్ జోకర్‌తో ప్రేమ కథలు ఎప్పుడూ బ్రేకప్ అవుతుంటాయి.
మేరా నామ్ జోకర్ విడుదల సమయంలో వాస్తవానికి 255 నిమిషాల నిడివి ఉంది. ఇది తరువాత రెండు వెర్షన్లు, ఇంటర్నేషనల్ కి ఒకటి ఇండియన్లకు మరొకటిగా విభజించారు. రెండు వేర్వేరు DVD విడుదలలు వరుసగా 233 నిమిషాలు .. 184 నిమిషాలతో విడుదలయ్యాయి.
ఈ చిత్రాలే కాకుండా సుదీర్ఘ నిడివితో నడిచే అనేక ఇతర చిత్రాలు ఉన్నాయి. ఈ జాబితాలో షోలే, లగాన్, LOC కార్గిల్, హమ్ సాథ్ సాథ్ హై, సలామ్-ఇ-ఇష్క్, గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ (GOW) ఉన్నాయి. ఈ చిత్రాలన్నింటికీ ఒకే విరామం ఉండగా, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, దాదాపు 5 గంటల నిడివి కారణంగా, GOW 1 & GOW 2 అనే రెండు వేర్వేరు భాగాలుగా కట్ చేసి విడుదల చేయవలసి వచ్చింది.