బాలయ్యకు కోసం ఈసారి అనిరుధ్?
బాలకృష్ణ కొత్త సినిమాకు అనిరుధ్ రావిచందర్ సంగీతం అందించనున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో రీసెంట్ గా వైరల్ అయిన ఒక మీమ్‌లో, "రజనీకాంత్‌కు బక్కోడు (అనిరుధ్) ఉంటే, బాలయ్యకు ఈ బండోడు (తమన్) ఉన్నాడు" అనే డైలాగ్ బాగా చక్కర్లు కొట్టింది. ఈ వ్యాఖ్యను తమన్ కూడా ఒక ఇంటర్వ్యూలో సరదాగా గుర్తు చేసుకోవడం విశేషం. కానీ ఇప్పుడు ఈ లైన్స్ చేంజ్ అవుతున్నట్లు అనిపిస్తోంది. బాలకృష్ణ కొత్త సినిమాకు అనిరుధ్ రావిచందర్ సంగీతం అందించనున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.
అనిరుధ్ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో మళ్లీ సందడి చేస్తోంది. 'అజ్ఞాతవాసి'తో తెలుగు తెరకు పరిచయమైనా, ఆ సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ 'జెర్సీ'తో ఆయన మళ్లీ టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నారు. ఇక ఎన్టీఆర్ ‘దేవర’తో పాన్ ఇండియా స్థాయిలో విజయం లభించింది. ఈ చిత్రంతో అనిరుధ్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇప్పుడు బాలకృష్ణ తదుపరి చిత్రానికి అనిరుధ్ సెట్టవుతున్నాడు అనేది ఒక కొత్త చర్చకు తెరతీసింది.
బాలయ్య ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక సినిమా ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు గోపీచంద్ మలినేనితో కలిసి మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'వీరసింహారెడ్డి' కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరు కలిసి ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ సంగీతం అందిస్తారన్న వార్త ఒక పక్క అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండగా, మరొక పక్క తమన్ స్థానానికి ఎసరు పెట్టె అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. అనిరుధ్ ఇటీవలి కాలంలో 'జైలర్' సినిమాతో మరొక లెవెల్ కు చేరుకున్నారు. ఈ చిత్రంలో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ రజనీకాంత్ అభిమానులను ఊర్రూతలూగించాయి. 'జైలర్ 2' అనౌన్స్‌మెంట్ వీడియోలో కూడా ఆయన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదే పవర్ ను ఇప్పుడు బాలయ్య సినిమాకు తీసుకు వస్తే తమన్ కు రాబోయే రోజుల్లో పెద్ద సవాల్‌గా మారనుంది. తమన్ స్టాండర్డ్స్‌ను అధిగమించి, బాలకృష్ణకు సరిపడే మాస్ ఎలిమెంట్స్‌ను అనిరుద్ అందించగలరా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త కాంబినేషన్‌తో అభిమానుల్లో ఎదురుచూపులు మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం అనిరుధ్ బలమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తారని అంచనా వేస్తున్నారు. గోపీచంద్ మలినేని శైలిలో యాక్షన్ డ్రామాకి అనిరుధ్ సంగీతం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. మొత్తానికి, బాలకృష్ణ, గోపీచంద్, అనిరుధ్ కాంబినేషన్ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్టర్‌గా మారే అవకాశాలున్నాయి. మరి అనిరుధ్ తన ప్రతిభతో ఈ ప్రాజెక్ట్‌కు ఏ రేంజ్ లో హైప్ తీసుకొస్తారో చూడాలి.