టాలీవుడ్ కబ్జా.. అతడు తప్ప ఆప్షనే లేదు!
ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గురించే ఇదంతా.
'కొలవెరి డి' సంచలనం 'అజ్ఞాతవాసి' లాంటి డిజాస్టర్ కి కూడా అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఇటీవల అంతగా పస లేని కథతో రూపొందించిన 'జైలర్'ని తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ చేసాడన్న ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల తెలుగు, తమిళం, హిందీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటున్న అతడు టాలీవుడ్ ని పూర్తిగా కబ్జా చేస్తున్నాడు. ప్రతిభతో అతడు చాలా ఎత్తుకు ఎదిగాడు. అతడు ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గురించే ఇదంతా.
రీసెంట్ బ్లాక్ బస్టర్ దేవరకు కూడా అనిరుధ్ అందించిన సంగీతం పెద్ద ప్లస్ కావడంతో ఇప్పుడు అతడిపైనే అందరి దృష్టి ఉంది. నాని- శ్రీకాంత్ ఒదెల మూవీకి అనిరుధ్ సంగీతం అందించాడు. మరోవైపు కింగ్ ఖాన్ షారూఖ్ అంతటి వాడు పిలిచి మరీ అవకాశాలు కల్పిస్తున్నాడు. గతంలో జవాన్ లాంటి రొటీన్ సినిమాని నిలబెట్టింది కూడా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అందువల్ల ఇప్పుడు 'కింగ్' సినిమాకి కూడా షారూఖ్ అవకాశం కల్పించారని తెలుస్తోంది.
అంతేకాదు.. అనిరుధ్ ప్రభావం ఎంతగా ఉంది? అంటే... తెలుగులో ఏ సినిమా చేయాలన్నా అగ్ర దర్శకనిర్మాతలు ముందుగా అనిరుధ్ పేరునే ప్రస్థావిస్తున్నారట. దేవీశ్రీ, థమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు మనకు ఉన్నా కానీ, తొలిగా అనిరుధ్ ని సంప్రదించాక అతడితో కుదరకపోతేనే ఇతర సంగీత దర్శకుల వైపు వెళుతున్నారని టాక్ వినిపిస్తోంది. నాని-శ్రీకాంత్ ఓదెల సినిమాకు దేవి శ్రీ సంగీతం ఇవ్వాల్సి ఉన్నా కానీ అనిరుధ్ టేకోవర్ చేసాడు. అలాగే నాని గత చిత్రం 'దసరా'కి సంతోష్ నారాయణ్ కానీ డిఎస్పీ కానీ మ్యూజిక్ ఇవ్వాల్సి ఉన్నా చివరికి అనిరుధ్ నే ఆఫర్ వరించింది. నానితో వరుస చిత్రాలకు పని చేసిన అనుభవం ఉంది గనుక అతడు నేచురల్ స్టార్ సినిమాలన్నీ తనవైపు లాగేస్తున్నాడని టాక్.
అయితే అనిరుధ్ వైపే నిర్మాతలు ఎందుకు టర్న్ అయ్యారు? అంటే.. అతడిలో మునుపటితో పోలిస్తే ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తోంది. అనవసరంగా భారీ పారితోషికాల పేరుతో నిర్మాతలను ఇబ్బంది పెట్టడం లేదు. కన్వినియెంట్ గా సంగీత ప్రక్రియను పూర్తి చేస్తున్నాడట. పైగా సక్సెస్ రేటు 500 శాతం ఉండటంతో అందరూ అతడిని లక్కీ ఛామ్ గా భావిస్తున్నారట. ఏది ఏమైనా ఒక యువ సంగీత దర్శకుడు ఈ స్థాయిని అందుకోవడం బావుంది కానీ, తెలుగు నుంచి దేవీశ్రీ ఒక్కడు తప్ప ఇంకెవరూ మళ్లీ అంత పెద్ద స్థాయికి ఎదగలేకపోవడం వల్ల కూడా అనిరుధ్ వైపే చూసేందుకు కారణమవుతుందని కూడా విశ్లేషిస్తున్నారు. అనిరుధ్ తదుపరి షారూఖ్ `కింగ్`కి పని చేస్తే అటుపై ఖాన్ ల త్రయానికి కూడా ఒక ఆప్షన్ గా మారిపోతాడు. అతడి స్థాయి చూస్తుంటే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషిస్తున్నారు.