ICU నుండి ANR చివరి ఆడియో సందేశం
నిన్నటి సాయంత్రం ప్రతిష్టాత్మక ANR జాతీయ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖుల ఉద్వేగభరితమైన క్షణాలను పరిశీలిస్తే చలించని వారు లేరు.
లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కాలం చేసినా, ఆయనను ప్రజలు ఎప్పటికీ తమ గుండెల్లోనే స్థిరంగా దాచుకున్నారు. తాను నటించిన సినిమాల రూపంలో ఆయన ఇంకా జీవించే ఉన్నారు. ఎప్పుడూ మన మధ్యనే ఉన్నారు. ఏఎన్నార్ లివ్స్ ఆన్.... ఇదే ప్రజల నినాదం. నిన్నటి సాయంత్రం ప్రతిష్టాత్మక ANR జాతీయ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖుల ఉద్వేగభరితమైన క్షణాలను పరిశీలిస్తే చలించని వారు లేరు.
మెగాస్టార్ చిరంజీవికి లెజెండ్ అమితాబ్ అవార్డును అందించడానికి ముందు వేదికపై ప్లే చేసిన ఒక ఆడియో అందరి కంటా తడి పెట్టించింది. అక్కినేని మరణానికి ముందు ఆస్పత్రి ఐసియు నుంచి పంపిన ఆడియో సందేశంలో ఇలా ఉంది. ''నాకోసం మీరంతా దేవుడిని ప్రార్థిస్తున్నారని నాకు తెలుసు. మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు. త్వరలోనే మీ ముందుకు వస్తాననే నమ్మకం ఉంది. ఇంతకాలం ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ నాకు మీరిచ్చిన ఆశీర్వాదం. మీ ప్రేమకు రుణపడి ఉంటాను.. ఇక సెలవ్'' అని ఏఎన్ఆర్ ఈ ఆడియోలో అన్నారు.
ఈ ఆడియో ప్లే అవుతున్న సమయంలో వేదిక వద్ద పిన్ డ్రాప్ సైలెన్స్ కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ, నాని సహా వేదిక వద్ద ఉన్న చాలామంది కళ్లలో చూఛాయగా కన్నీళ్లు కనిపించాయి. ఇది అరుదైన ఉద్విగ్న క్షణం. ఒక లెజెండరీ నటుడి నిష్క్రమణం అందరిలోను ఎమోషన్ ని రగిల్చింది. ఈ వేదికపై అక్కినేని ఆడియోతో పాటు, ఆయన అంతిమయాత్రకు సంబంధించిన విజువల్స్ ని ప్లే చేసారు. ఏఎన్నార్ జాతీయ అవార్డును అమితాబ్ చేతులమీదుగా మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పద్మ పురస్కారం కంటే గొప్ప పురస్కారాన్ని అందుకున్నానని, రచ్చ గెలిచి ఇంట గెలిచానని చిరు ఎమోషనల్ అయ్యారు.