కామెడీ: అడల్ట్ కంటెంట్ చూడొచ్చు కానీ పొగ తాగరాదు!
అడల్ట్ కంటెంట్ చూడొచ్చు కానీ పొగ తాగరాదా? అంటూ కొందరు ప్రశ్నించే పరిస్థితి ఉంది.
అవును.. ఓటీటీల్లో ఈ కామెడీ ఒక రేంజులో చర్చకు వచ్చింది. పొగ తాగడం ప్రమాదకరం.. క్యాన్సర్ కారకం! అంటూ థియేటర్లలో విజువల్ గా ప్రకటన వేసినట్టు ఓటీటీలో కూడా పొగాకు వ్యతిరేక ప్రకటనలు వెలువడడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అడల్ట్ కంటెంట్ ని, విశృంఖలతను విస్త్రతంగా ప్రమోట్ చేసే ఓటీటీ మాధ్యమాల్లో పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక ప్రచారం విడ్డూరంగా ఉందని విమర్శలొస్తున్నాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వాకాన్ని చాలా మంది కామెడీగా చూస్తున్నారు. కొత్త సవరణల ప్రకారం అన్ని చలనచిత్రాలు.. వాటి సంబంధ అనువర్తనాలు లేదా సీబీఎఫ్‌సీ ధృవీకరణతో సంబంధం లేకుండా స్ట్రీమింగ్ అయ్యే సినిమాల ప్రారంభంలో మధ్యలో కనీసం 30 సెకన్ల పాటు పొగాకు వ్యతిరేక ప్రకటనలను ప్రదర్శించాలి. కంటెంట్ స్ట్రీమింగ్ ప్రారంభించిన వెంటనే పొగాకు హానికరమైన ప్రభావాల గురించి ఆడియో విజువల్ డిస్‌క్లైమర్ తప్పనిసరిగా 20 సెకన్ల పాటు ప్లే చేయాలి. కానీ హద్దుమీరిన కంటెంట్ ని ప్రమోట్ చేసే ఓటీటీలకు ఇలాంటి నియమం అర్థంలేనిది అని కొట్టి పారేస్తున్నారు. ధూమపాన నిషేధం అనే విషయాన్ని ఓటీటీ ఆడియెన్ కి విడిగా చెప్పాలా? వారేమైనా వెర్రి బాగుల వాళ్లా? అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అడల్ట్ కంటెంట్ చూడొచ్చు కానీ పొగ తాగరాదా? అంటూ కొందరు ప్రశ్నించే పరిస్థితి ఉంది.
అదంతా సరే కానీ.. ఓటీటీ వేదికలుగా రక్తపాతం, హింసను తగ్గించే అవకాశం ఉందా లేదా? హద్దు మీరిన శృంగార కథల్ని, నగ్నత్వాన్ని ఆపేందుకు ఆస్కారం ఉందా లేదా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. స్కూల్, కాలేజ్ లకు వెళ్లే టీనేజీ పిల్లలు ఓటీటీల్లో శృంగార సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తున్నారు. హద్దుమీరిన క్రైమ్ డ్రామాల్ని చూసి తాము కూడా అలా చేయాలని స్ఫూర్తి పొందుతున్నారు. మరి దీనిని ఆపేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ చేపట్టిన చర్యలు ఎంతవరకూ వర్కవుట్ కానున్నాయో అర్థం కావడం లేదని విమర్శలొస్తున్నాయి.