శంకర్ ఐడియాలజీని తప్పుపట్టిన దర్శకుడు
'గేమ్ ఛేంజర్' మేకింగ్ గురించి దర్శకుడు శంకర్ చేసిన ప్రకటనను బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు అనురాగ్ కశ్యప్ విమర్శించారు.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఇష్టపడే ప్రేక్షకుల అభిరుచిని గుర్తు చేస్తూ.. 'గేమ్ ఛేంజర్' మేకింగ్ గురించి దర్శకుడు శంకర్ చేసిన ప్రకటనను బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు అనురాగ్ కశ్యప్ విమర్శించారు.
ఇంతకీ శంకర్ ఏమన్నారంటే...? ''ప్రేక్షకులు ఇటీవల రీల్స్ మాత్రమే చూస్తున్నారు. ఓపిగ్గా చూసేంత తీరిక ఆసక్తి వారికి లేదు. కాబట్టి 'గేమ్ ఛేంజర్' చేస్తున్నప్పుడు మేము దానిని దృష్టిలో ఉంచుకున్నాము. దీని అర్థం ఏమిటో ఇప్పుడే నాకు తెలియదు. ఏదీ చెప్పలేను! సినిమా చూసినప్పుడే అది తెలుస్తుంది''అని శంకర్ అన్నారు.
అయితే ప్రేక్షకులు ఏం చూడాలనుకుంటున్నారో దానిని అందించాలనే శంకర్ ఐడియాలజీని అనురాగ్ తప్పు పట్టారు. ప్రేక్షకుల కోసం సినిమాలు తీసిన మరుక్షణం ఫిలింమేకర్ పతనం మొదలవుతుందని అన్నారు. ప్రేక్షకులు కేటగిరీల వారీగా ఉన్నారు. ఆడియన్ అంటే ఎవరో ఒకరు కాదు. ప్రజా సముద్రం. ప్రతి కేటగిరీకి ప్రేక్షకులు ఉంటారు. వారి కోణంలో ఆలోచిస్తే క్షీణత ప్రారంభమవుతుందని అనురాగ్ విమర్శించారు. ఆసక్తికరంగా రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం లాంటి వెటరన్ దర్శకులు తాము ఏం తీయాలనుకుంటే దానిని మాత్రమే నమ్మి ముందుకు వెళతారు. సినిమాలు తీస్తారు. ఇదే విషయాన్ని అనురాగ్ కశ్యప్ అప్రయత్నంగా సమర్థించారు. కానీ శంకర్ మాత్రం ప్రేక్షకుల కోణంలో సినిమాలు తీయాలని అన్నారు.
శంకర్ దర్శకత్వం వహించిన తొలి తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సంక్రాంతి బరిలో పాన్ ఇండియన్ కేటగిరీలో విడుదలవుతోంది. రామ్ చరణ్ - కియరా అద్వానీ ఇందులో జంటగా నటించారు. అంజలి, ఎస్.జే సూర్య, శ్రీకాంత్. సముద్రఖని, జయరామ్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.
మరోవైపు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు. గత కొంతకాలంగా బాలీవుడ్ మేకింగ్ శైలిని విమర్శిస్తున్నారు. అతడు ఇటీవల దక్షిణాదిన నటిస్తున్నాడు. దర్శకుడిగా ఇక్కడ సినిమాలు తీయాలని ఆలోచిస్తున్నాడు. చివరిసారిగా మలయాళంలో `రైఫిల్ క్లబ్` అనే చిత్రంలో అతడు నటించాడు. తమిళంలోను అనురాగ్ నటించిన సంగతి తెలిసిందే. అతడు చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం కెన్నెడీ ఇంకా విడుదల కావాల్సి ఉంది.