సౌత్ సినిమాలే మా క్రియేటివిటీని చంపాయి
అందుకే తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించిన చాలా నేటివిటీ సినిమాలు తమిళంలో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
ఏదైనా సినిమాని ఆడియెన్ కి కనెక్ట్ చేయాలంటే నేటివిటీ టచ్ ఉండాలి. ఆ ప్రాంతంలో భాష వేషం యాస సంస్కృతి ప్రతిదీ ప్రజలకు కనెక్ట్ చేయాలి. అలా చేయడంలో తమిళ తంబీలు సుప్రసిద్ధులు. అందుకే తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించిన చాలా నేటివిటీ సినిమాలు తమిళంలో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత టాలీవుడ్ ని తక్కువ చేయలేం. పూరి జగన్నాథ్, సుకుమార్, రాజమౌళి, త్రివిక్రమ్ సహా చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో స్థానికత, ప్రాంతీయ భాష, వేషధారణ, స్థానిక యాసల్ని ఉపయోగించుకోవడంలో సమర్థులు అని నిరూపించారు.
వీరంతా తమ సినిమాలను ప్రజలకు కనెక్ట్ చేయగలిగారు. అయితే అలా చేయడంలో విఫలం కావడంతో ఇటీవల బెంగాలీ సినిమా చాలా ఇబ్బందుల్లో పడింది. అక్కడ అన్నీ చెత్త సినిమాలు విడుదలవుతుండడంతో పరిశ్రమను పూర్తిగా లైట్ తీస్కోవాల్సిన పరిస్థితి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అంటూ సౌత్ సినిమా గురించి, బాలీవుడ్, నార్త్ ఇండస్ట్రీ అంటూ హిందీ సినిమా గురించి లేదా మరాఠా సినిమా గురించి ప్రజలు ముచ్చటించుకున్నంతగా బెంగాలీ సినిమా గురించి ఇటీవల గుర్తు చేసుకోవడం లేదు.
ఇదే విషయమై అనురాగ్ కశ్యప్ ఇటీవల గుర్తు చేసే ప్రయత్నం చేసారు. బెంగాలీ ఇండస్ట్రీ చెత్తగా ఉందని అనురాగ్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారతీయ సినిమాకి మణిమకుటం లాంటి పరిశ్రమ.. ఇప్పుడు పూర్తిగా దిగాలైపోయింది. వరుసగా ఫ్లాపుల్ని ఎదుర్కొనడమే గాక, పరిశ్రమ రంగు రూపం పూర్తిగా మారిపోవడం కలవరపెడుతోంది. అయితే దీనికి కారణం సౌత్ సినిమాల్ని ఛీప్ గా రీమేక్ చేయడమేనని ప్రముఖ బెంగాలీ సినీప్రముఖుడు పరంభ్రత ఛటర్జీ అంగీకరించారు. అనురాగ్ కశ్యప్ కామెంట్ కి స్పందిస్తూ... స్థానిక సంస్కృతిని ప్రతిబింబించని సినిమాలను బెంగాలీలో తీస్తున్నాం. సౌత్ సినిమాల రీమేక్ లు వరుసగా ఫ్లాపులవుతున్నాయని ఆయన అన్నారు. దక్షిణాది సినిమాలను హిందీ టీవీల్లో జనం చూసేస్తున్నప్పుడు వాటిని రీమేక్ చేయాల్సిన అవసరమేమిటి? అని కూడా పరంభ్రత ప్రశ్నించారు. సౌత్ సినిమాలు క్రియేటివిటీని చంపాయని ఆయన ఆవేదన చెందారు.