అనుష్క మూవీ సూపర్ అప్‌డేట్
అనుష్క శెట్టి గత సంవత్సరం నవీన్ పొలిశెట్టితో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అనుష్క శెట్టి గత సంవత్సరం నవీన్ పొలిశెట్టితో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫలితం పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది. టాక్ పాజిటివ్ వచ్చినా వసూళ్లు మాత్రం నిరాశనే మిగిల్చాయి. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అనుష్క శెట్టి తన తదుపరి సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. 2024లో అనుష్క నుంచి ఒక్క సినిమా వచ్చే పరిస్థితి లేదు. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ఘాటీ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఇటీవలే ఏప్రిల్ 18, 2025 న ఘాటీని విడుదల చేస్తాం అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచింది. ముఖ్యంగా అనుష్క లుక్, ఆమె కొడవలి పట్టి విలన్ పీక కోస్తున్న విధానం చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. బాబోయ్ అనుష్కను ఇలా లేడీ యానిమల్ లుక్‌లో, అటువంటి పాత్రలో చూస్తామని అనుకోలేదని, కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ అంతా విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు.
వచ్చే నెలలో సినిమా క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ చేపట్టబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. క్రిష్ ఇప్పటికే క్లైమాక్స్ షూటింగ్ ఏర్పాట్లు చేశారని, అనుష్క సైతం క్లైమాక్స్ షూట్ కోసం గత రెండు వారాలుగా సిద్ధం అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. క్లైమాక్స్ షూట్ పూర్తి అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయబోతున్నారు. అనుష్క ఈ సినిమాకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా సౌత్‌లో అన్ని భాషల్లో విడుదల చేయడంతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
అనుష్క అంటే ఇప్పటికే వీరాభిమానం చూపించే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. కానీ అభిమానుల కోరిక తీర్చే విధంగా అనుష్క సినిమాలు చేయడం లేదు. ఆమె నుంచి బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు మరిన్ని వస్తాయి అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మలయాళంలో ఈమె ఒక సినిమాను చేస్తుంది. అది ఘాటీ సినిమా తర్వాత విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే 2025లో అనుష్క నుంచి రెండు సినిమాలు వస్తాయి. ఈ ఏడాది వచ్చిన గ్యాప్‌ను అనుష్క వచ్చే ఏడాదిలో రెండు సినిమాలతో రావడం వల్ల ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.