అనుష్క 'ఘాటీ'.. క్రిష్ మార్క్ మళ్లీ రిపీట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.

Update: 2024-10-01 11:26 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాల్లో యాక్ట్ చేసిన స్వీటీ.. ఇప్పుడు అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. ఆచితూచి ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. గత ఏడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్న అనుష్క.. ఇప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.

అందులో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో చేస్తున్న ఘాటీ ఒకటి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన వేదం మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో ఘాటీ సినిమాపై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా హైదరాబాద్ లో మేకర్స్ స్టార్ట్ చేసిన కొత్త షెడ్యూల్.. పూర్తి అయినట్లు తెలుస్తోంది. స్పెషల్ గా వేసిన సెట్ లో అనుష్కపై మేకర్స్ కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం.

ప్రస్తుతం శరవేగంగా ఘాటీ చిత్రీకరణ చేస్తున్న మేకర్స్.. ఒడిశాలో చివరి షూటింగ్ షెడ్యూల్ ను త్వరలో స్టార్ట్ చేయబోతున్నారట. దాంతో మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి.. విడుదలకు మేకర్స్ సిద్ధం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. దీని బట్టి చూస్తే.. ఘాటీ మూవీ ఫుల్ స్వింగ్ లో ఉందన్న మాట. జెట్ స్పీడ్ లో పనులు పూర్తి చేస్తున్నారు దర్శకుడు క్రిష్.

అయితే క్రిష్.. వర్క్ ఎంత స్పీడ్ గా ఉంటుందో ఇప్పటికే అందరికీ తెలుసు. సీనియర్ హీరో బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి మూవీని భారీ బడ్జెట్ తో.. తక్కువ టైమ్ లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ను అంతే విధంగా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఘాటీ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అనుష్కను ఇప్పటి వరకు ఎన్నడూ చూడని రోల్ లో సినిమాలో చూపించబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ లుక్ కూడా అందుకు తగ్గట్లే ఉంది.

రివెంజ్ డ్రామాగా ఘాటీ మూవీ తెరకెక్కుతుందని ఇండస్ట్రీలో టాక్. నేరస్థురాలిగా మారిన ఓ బాధితురాలి కథను సినిమా రూపంలో తీసుకొస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. అయితే సినిమా సెట్స్ పైకి వెళ్లిన వెంటనే.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కులు దక్కించుకుంది. థియేటర్లలో రిలీజ్ అయ్యాకే ఓటీటీలోకి రానుంది. మరి ఘాటీ మూవీ థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News