ఐదేళ్లకు లాఖియా అలా ప్లాన్ చేసాడా?
బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లాఖియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా `జంజీర్` చిత్రాన్ని రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లాఖియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా `జంజీర్` చిత్రాన్ని రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో `తుఫాన్` టైటిల్ తో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా అట్టర్ ప్లాప్ అయింది. చరణ్ కి అదే బాలీవుడ్ డెబ్యూ చిత్రం కూడా. ఎన్నో ఆశలతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టినా తొలి సినిమా బెడిసి కొట్టింది. దీంతో చరణ్ మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేయలేదు.
అయితే డైరెక్టర్ గా మంచి పేరున్నా? అపూర్వ లాఖియా ఐదేళ్లగా సినిమాలకు దూరంగా ఉన్నారు. 2020లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన `క్రాక్ డౌన్` రిలీజ్ అయింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలు డైరెక్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అపూర్వా లాఖియా కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. విశాల్ హీరోగా ఓ సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడుట. ఇటీవలే లాఖియా విశాల్ కి ఓ మాస్ ఇమేజ్ ఉన్న స్టోరీని వినిపించాడుట.
అయితే ఇది రొటీన్ యాక్షన్ చిత్రాలకు భిన్నంగా ఉండే కథ అని సమాచారం. స్టోరీ నచ్చడంతో విశాల్ కూడా అంగీకరించినట్లు సమాచారం. విశాల్ కూడా ఇటీవలే `మదగజ రాజా` సినిమా విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇది 12 ఏళ్ల క్రితం నాటి సినిమా అయినా మాస్ కంటెంట్ తో ఉన్న చిత్రం కావడంతో తమిళ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. ప్రస్తుతం విశాల్ హీరోగా `డిటెక్టివ్ 2` తెరకెక్కుతుంది. ఈ సినిమాకి విశాల్ డైరెక్టర్ కూడా.
తానే నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రమిది. ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఆ మధ్య అనారోగ్యానికి గురవ్వడంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఆరోగ్యం కోలుకోవడంతో మళ్లీ బిజీ అవుతున్నాడు. అపూర్వ లాఖియా చిత్రం కూడా ఇదే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.