నిఖిల్ సినిమాకు షోలు క్యాన్సిల్!
నిఖిల్ నుంచి స్పీడ్ బ్రేక్ లాంటి మరో మూవీ వచ్చింది. అదే.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.
‘కార్తికేయ-2’తో ఏకంగా వంద కోట్ల క్లబులోకి చేరి తన రేంజిని ఎంతగానో పెంచుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ. అంతకుముందే స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి మంచి హిట్లు తన ఖాతాలో ఉన్నప్పటికీ ‘కార్తికేయ-2’తో ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసినట్లు కనిపించాడు. పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ రావడంతో మిడ్ రేంజిలో ఉన్న పెద్ద స్టార్లలో ఒకడైపోతాడనిపించింది.
కానీ ఆ తర్వాత అతడి నుంచి సరైన సినిమాలు రాకపోవడంతో కెరీర్ తిరోగమనంలో పయనిస్తోంది. ‘18 పేజెస్’ ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంటే.. ‘స్పై’ సినిమా పెద్ద డిజాస్టర్ అయి పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం చూపింది. ఐతే స్వయంభు, ఇండియా హౌస్ లాంటి ఎగ్జైటింగ్ మూవీస్ చేతిలో ఉండడంతో మళ్లీ నిఖిల్ గాడిన పడతాడనే అనుకున్నారు. కానీ అవి రావడానికి ముందు నిఖిల్ నుంచి స్పీడ్ బ్రేక్ లాంటి మరో మూవీ వచ్చింది. అదే.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.
ఎప్పుడో కరోనా టైంలో మొదలై చాలా ఆలస్యంగా పూర్తయి, సడెన్‌గా రిలీజ్‌కు రెడీ అయిన సినిమా ఇది. ‘స్వామి రారా’ దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేశాడు. ఈ కలయిక నుంచి ఎంతమాత్రం ఆశించే సినిమా కాదిది. రిలీజ్‌కు ముందు ఈ సినిమాకు అసలే బజ్ లేదు. పైగా సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి మరీ దారుణమైన ఫలితం తప్పలేదు. వంద కోట్ల వసూళ్లు చేసిన హీరో సినిమాకు తొలి వీకెండ్లో కూడా మినిమం ఆక్యుపెన్సీలు లేకపోవడం.. షోలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి రావడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సోమవారం అయితే పెద్ద ఎత్తున ఈ సినిమాకు షోలు క్యాన్సిల్ అయ్యాయి. మినిమం ఆక్యుపెన్సీలు కూాడా లేకపోవడంతో షోలు రద్దు చేయక తప్పలేదు. నిఖిల్ బాధ్యతగా రిలీజ్‌కు ముందు ఈ సినిమాను ప్రమోట్ చేశాడు కానీ.. రిలీజ్ తర్వాత పరిస్థితి అర్థమై సైలెంట్ అయిపోయాడు. ఇలాంటి సినిమాల విషయంలో స్కిప్ బటన్ నొక్కేయాలని హీరోలు భావిస్తారు. ఐతే జనం దీని గురించి ఎక్కువ చర్చించకపోవడం నిఖిల్‌కు మంచిదే. ఈ ఎఫెక్ట్ తర్వాతి చిత్రాల మీద ఉండదనే అతను ఆశిస్తున్నాడు.