చరణ్‌ - బుచ్చిబాబు మూవీ మ్యూజిక్‌ చాలా ఖరీదు గురూ..!

దాదాపు రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసి ఎట్టకేలకు రామ్‌ చరణ్‌తో సినిమా షూటింగ్‌ను బుచ్చిబాబు మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

Update: 2025-02-22 06:20 GMT

రామ్‌ చరణ్ గత చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో మెగా ఫ్యాన్స్ అంతా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. మొదటి సినిమా ఉప్పెనతో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్ సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. సుకుమార్‌ శిష్యుడు అయిన బుచ్చిబాబు గురువుకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తాడు అని ఉప్పెన సినిమా చూసిన సమయంలోనే క్లారిటీ వచ్చింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసి ఎట్టకేలకు రామ్‌ చరణ్‌తో సినిమా షూటింగ్‌ను బుచ్చిబాబు మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని బుచ్చిబాబు ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే చాలా ఎక్కువ సమయం ఆయన ఈ సినిమా కోసం తీసుకున్నాడు. కనుక ఇప్పుడు ఏమాత్రం సమయం వృదా చేయకుండా వరుస షెడ్యూల్స్‌తో ఆగస్టు వరకు షూటింగ్‌ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే రెహమాన్‌తో తనకు కావాల్సిన పాటలను ట్యూన్‌ చేయించుకున్నాడు. బుచ్చిబాబు ఈ సినిమా కోసం రెహమాన్‌తో ఎందుకు వర్క్‌ చేయాలి అనుకున్నాడు అనే విషయం సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది అంటూ మేకర్స్‌తో పాటు, సినిమా కోసం వర్క్‌ చేసే వారు అంటున్నారు.

ఈమధ్య కాలంలో తెలుగులో రెహమాన్‌ సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ మ్యూజిక్‌ కంపోజర్స్‌ నాలుగు నుంచి అయిదు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. కానీ రెహమాన్‌ దాదాపు డబుల్‌ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ - బుచ్చిబాబు సినిమా కోసం రెహమాన్‌ ఏకంగా రూ.8 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బుచ్చిబాబు స్పెషల్‌ రిక్వెస్ట్‌తో పాటు, రామ్‌ చరణ్ సినిమా కావడంతో రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు కమిట్ అయ్యారు అని తెలుస్తోంది.

రెహమాన్‌తో పెట్టుకుంటే సినిమా ఆలస్యం అవుతుందని అంటారు. బుచ్చిబాబు అందుకే ముందస్తుగా మూడు నాలుగు పాటలను రెడీ చేయించుకున్నాడు. త్వరలోనే వాటి రికార్డింగ్‌ పూర్తి చేసి షూటింగ్‌ సైతం పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఎప్పటికప్పుడు బీజీఎం సైతం వస్తూనే ఉంది. రెహమాన్‌ కారణంగా సినిమా ఆలస్యం అయ్యే పరిస్థితి లేకుండా బుచ్చిబాబు ముందస్తు వ్యూహం తో ఉన్నాడు. భారీ పారితోషికం ఇచ్చి ఈ సినిమాకు రెహమాన్‌తో సంగీతాన్ని చేయించాల్సిన అవసరం ఏంటి అనేది సినిమా విడుదల అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను రివీల్‌ చేయడంతో పాటు టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌ ట్రీట్‌ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఆ టీజర్‌తోనే రెహమాన్‌ పవర్‌ మరోసారి తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తూ ఉండగా కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో నటించనున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News