మీకు అలా అనిపిస్తే నన్ను ప్రోత్సహించకండి
తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది.
కన్నడంతో పాటు పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు, స్టార్ డమ్ దక్కించుకున్న యాక్షన్ హీరో అర్జున్ ఇంటి నుంచి వరుసగా వారసులు వస్తూనే ఉన్నారు. అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా 'మార్టిన్' సినిమాతో ప్రేక్షకలు ముందుకు రాబోతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా మేకింగ్ జరిగిందని, చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అంటూ అర్జున్ సినిమా ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. దసరా కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది.
తాజాగా తెలుగు వర్షన్ ప్రమోషన్ లో భాగంగా అర్జున్ తో కలిసి ధ్రువ సర్జా హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంలో సినిమా కోసం తాను పడ్డ కష్టం గురించి వివరించారు. అంతే కాకుండా సినిమా లో కచ్చితంగా ప్రేక్షకులు నచ్చే ఎలిమెంట్స్ ఉంటాయని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా తన సినిమాను అందరికి చేరే విధంగా ప్రమోషన్ చేయాలని మీడియా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతే కాకుండా ఈ సినిమాలో తన నటన నచ్చకుంటే, తనకు ప్రతిభ లేదని మీరు భావిస్తే తదుపరి సినిమాల నుంచి తనను ప్రోత్సహించ వద్దు, తన సినిమాలను చూడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ధ్రువ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాతో తన ప్రతిభను నిరూపించుకుంటానని, రెండున్నరేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడటం ద్వారా అద్భుతంగా సినిమా వచ్చిందని ధ్రువ అన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరిని మెప్పించే విధంగా సినిమా ఉంటుందని అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని అర్జున్ సైతం చెప్పుకొచ్చాడు. మీడియా సమావేశంలో భాగంగా అర్జున్ మాట్లాడుతూ.. నిర్మాత రామానాయుడు గారు నాకు చాలా క్లోజ్. ఆయన నిర్మాణ సంస్థలో చాలా సినిమాలు చేసే అవకాశం దక్కింది. ప్రతిభావంతుడు అయిన దర్శకుడు గోపాల్ గారితో నేను సినిమాను చేశాను.
దసరాకు చాలా సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. ప్రతి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తారనే నమ్మకం ఉంది. అన్ని సినిమాలతో పాటు మా సినిమానూ ప్రేక్షకులు ఆధరిస్తారు అనే నమ్మకం మాకు ఉంది. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తారు. కనుక మార్టిన్ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉంది. ఈ సినిమాకు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించగా వైభవి హీరోయిన్ గా నటించింది. గతంలో పొగరు సినిమాతో ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. మరి మార్టిన్ ఎలా ఉంటుందో చూడాలి.