క్లైమాక్స్ గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్!

అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతిలో క‌ళ్యాణ్ రామ్ కొడుకుగా క‌నిపించ‌గా, అత‌నికి తండ్రి పాత్ర‌లో విజ‌యశాంతి న‌టించింది.;

Update: 2025-04-14 14:40 GMT
క్లైమాక్స్ గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్!

డెవిల్ సినిమా త‌ర్వాత నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న సినిమా అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి. ప్ర‌దీప్ చిలుకూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ముందు పెద్ద‌గా అంచ‌నాలేమీ లేవు కానీ ఎప్పుడైతే సినిమా నుంచి టీజ‌ర్ వ‌చ్చిందో అప్పుడు సినిమాకు కావాల్సినంత బ‌జ్ వ‌చ్చింది. ఈ మూవీలో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టించారు.

అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతిలో క‌ళ్యాణ్ రామ్ కొడుకుగా క‌నిపించ‌గా, అత‌నికి తండ్రి పాత్ర‌లో విజ‌యశాంతి న‌టించింది. మూవీలో వీరిద్ద‌రి మ‌ధ్య ఎమోష‌న్ బాగా వ‌ర్క‌వుట్ అయిందంటున్నారు. రీసెంట్ గా రిలీజైన ట్రైల‌ర్ లో కూడా ఈ విష‌యం అర్థ‌మైంది. ట్రైల‌ర్ రిలీజ్ తర్వాత అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి సినిమాపై అంచ‌నాలు బాగా పెరిగాయి.

ఏప్రిల్ 18న సినిమా రిలీజ్ కానున్న సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ను వేగ‌వంతం చేసింది. ప్ర‌మోష‌న్స్ లో క‌ళ్యాణ్ రామ్, విజ‌య‌శాంతి చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇస్తున్న ఇంట‌ర్వ్యూల్లో సినిమా క్లైమాక్స్ గురించి క‌ళ్యాణ్ రామ్ చాలా గొప్ప‌గా చెప్తున్నాడు. ఇలాంటి త‌ర‌హా క్లైమాక్స్ తెలుగు సినిమాలో ఇప్ప‌టివ‌ర‌కు రాలేద‌ని ఊరిస్తున్నాడు.

క‌ళ్యాణ్ రామ్ ఒక్క‌డే కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టు గా వ‌చ్చిన ఎన్టీఆర్ కూడా క్లైమాక్స్ గురించి అదే చెప్పాడు. సినిమాలోని ఆఖ‌రి 20 నిమిషాల సీన్స్ చూసి క‌న్నీళ్లు పెట్టుకోని ప్రేక్ష‌కుడు ఉండ‌డ‌ని ఎంతో ధీమాగా చెప్పాడు ఎన్టీఆర్. క్లైమాక్స్ గురించి నంద‌మూరి బ్ర‌ద‌ర్స్ చెప్తున్న మాట‌లు విని సినిమా విషాదంతో ముగుస్తుందా అని అనుమాన ప‌డుతున్నారు కొంద‌రు.

ఈ విష‌యంపై రీసెంట్ గా డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ రెస్పాండ్ అయ్యాడు. క్లైమాక్స్ చూసి క‌న్నీళ్లు ఆగ‌వు అంటే అంద‌రూ సినిమా విషాదంతో ముగుస్తుంద‌నుకున్నారు కానీ తాము చెప్తుంది అది కాద‌ని, ఎమోష‌న్స్ అలా ఉంటాయ‌ని, ఆల్రెడీ సినిమాను ఎన్టీఆర్, విజ‌య‌శాంతి చూశార‌ని, వారిద్ద‌రూ సినిమాలోని ఎమోష‌న్ కు క‌నెక్ట్ అయ్యార‌ని, రేపు ఆడియ‌న్స్ కూడా సినిమా చూసి ఆ ఎమోష‌న్ కు క‌నెక్ట్ అవుతార‌ని డైరెక్ట‌ర్ క్లారిటీ ఇచ్చాడు.

Tags:    

Similar News