'అర్జున్ చక్రవర్తి - అన్​సంగ్ ఛాంపియన్​'.. ఇంట్రెస్టింగ్​ ఫస్ట్ లుక్​

నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ.. "అర్జున్ చక్రవర్తి అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, సవాళ్లను అధిగమించి, మనందరికీ స్ఫూర్తినిచ్చే వ్యక్తులకి నివాళి.

Update: 2023-10-27 11:29 GMT

వెండితెరపైకి మరో స్పోర్ట్స్​ డ్రామా బయోపిక్​ వచ్చేందుకు సిద్ధమైంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న.. 'అర్జున్ చక్రవర్తి - జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్' చిత్రం గురించే ప్రస్తుతం అంతా మాట్లాడుకుంటున్నారు. 1980లలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన కబడ్డీ ఆటగాడి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్​ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


ఫస్ట్ లుక్‌లో అర్జున్ చక్రవర్తి(పాత్ర పోషిస్తోంది విజయ రామరాజు) స్టేడియం మధ్యలో చేతిలో పతకంతో, ముఖంలో అనుకున్నది సాధించానన్న ఆనందంతో కనిపించారు. ఇంకా పోస్టర్​లో 'భారత కబడ్డీపై అర్జున్ చక్రవర్తి ప్రభావం, 1980లలో భారత క్రికెట్‌పై కపిల్ దేవ్ ప్రభావం స్థాయిలో ఉంటుంది' అంటూ రాసిన అక్షరాలు సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్ళాయి. అలాగే అర్జున్ స్ఫూర్తిదాయకమైన కథ గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ చిత్రంలో నటుడు విజయ రామరాజు, సిజా రోజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్, దయానంద్ రెడ్డి, అజయ్ ఘోష్, దుర్గేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీని గుబ్బల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక క్రీడాకారుడి జీవితంలోని కష్టాలను, విజయాలను సహజంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ సాగే చిత్రమని మూవీటీమ్ చెబుతోంది.

ఇకపోతే ఈ సినిమా కోసం అత్యున్నత సాంకేతిక బృందం పని చేస్తోంది. విఘ్నేష్ బాస్కరన్ సంగీతం సమకూరుస్తున్నారు. జగదీష్ చీకాటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. సుమిత్ పటేల్ ఆర్ట్ డైరెక్షన్, ప్రదీప్ నందన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ.. "అర్జున్ చక్రవర్తి అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, సవాళ్లను అధిగమించి, మనందరికీ స్ఫూర్తినిచ్చే వ్యక్తులకి నివాళి. వారి పోరాటతత్వం, సంకల్పం, కలల సాధన గురించి తెలిపే కథ. ఈ చిత్రం ద్వారా మేము మానవ సంకల్ప శక్తిని ప్రదర్శించాలనుకుంటున్నా" అని తెలిపారు. దర్శకుడు విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. "స్ఫూర్తిదాయకమైన చిత్రానికి దర్శకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. అర్జున్ చక్రవర్తి కథకు జీవం పోసే ప్రయాణం అపురూపమైనది. అర్జున్ చక్రవర్తి పాత్రను విజయ్ రామరాజు నిజంగా అద్భుతంగా పోషించారు" అని పేర్కొన్నారు.

Tags:    

Similar News