2023 పాన్ ఇండియా స్టార్ క్లీన్ స్వీప్?

Update: 2022-08-23 10:41 GMT
బాహుబలి సిరీస్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సెన్సేషన్ అయ్యాడు. 'బాహుబలి' 2017లో విడుద‌లైంది. అప్పటి నుంచి ప్రభాస్ ప్రాంతీయ నటుడే కాదు. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దేశ విదేశాల్లో అత‌డికి అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పటి వరకు ఏ నటుడూ అందుకోలేని కీర్తి శిఖరాలను ప్రభాస్ చేరుకున్నాడు. ఏ భారతీయ నటుడితో పోల్చినా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగులు తెచ్చే స్టార్ గా స‌త్తా చాటాడు. ఖాన్ ల‌ను క‌పూర్ ల‌ను సైతం అత‌డు రేసులో వెన‌క్కి నెట్టాడు.

సాహో-రాధే శ్యామ్ పరాజయాలుగా మిగిలినా అసాధార‌ణ ఓపెనింగులు తేవ‌డంలో విఫ‌లం కాలేదు.  బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ఈ రెండు సినిమాలు సక్సెస్ కాలేదు. హిందీ ఆడియెన్ లో అపారమైన ప్రజాదరణ తో 'సాహూ' అతడి విలువ‌ను పెంచడం ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ విష‌యం. తెలుగు రాష్ట్రాల్లో సాహో పేలవంగా ఆడింది. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారుగా బ‌డ్జెట స్థాయిలో వసూలు చేసింది. అదృష్టవశాత్తూ హిందీ బెల్ట్ లో అసాధార‌ణ‌ ఓపెనింగ్స్ కారణంగా నిర్మాతలు - పంపిణీదారులకు ఇది నాన్-లాస్ వెంచర్ గా నిలిచింది. 'సాహో'లో ప్రభాస్ నటనకు ప్రశంసలు లభించినా కానీ దర్శకుడు సుజీత్ ప్రభాస్ అత‌డి స్టార్ డమ్ కు తగ్గ సినిమాను అందించలేకపోయాడు. ఆ త‌ర్వాత కూడా ప్ర‌భాస్ అనుభవం లేని దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తో ప్రేమ కథా చిత్రం 'రాధే శ్యామ్'లో నటించి సాహ‌సం చేశాడు. ప్ర‌తికూల సమీక్షలతో ఈ చిత్రం బాక్సాఫీస్ వైఫల్యంగా నిలిచింది. నిర్మాతలు 100 కోట్ల నష్టాన్ని చవిచూసిన సినిమాగా ప్రభాస్ కి చెత్త ట్రాక్ రికార్డ్ ను అందించింది.

భారతదేశంలోనే అతిపెద్ద స్టార్ డ‌మ్ తో దూసుకొచ్చిన ప్ర‌భాస్ పై విపరీతమైన హైప్ వ‌ల్ల‌ ఓపెనింగ్స్ కి ఢోఖా లేదు. అయితే మూవీలో కంటెంట్ లేక‌పోవ‌డం మైన‌స్ గా మారుతోంది. అందుకే ఆ రెండు చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాల విష‌యంలో దర్శకుల వైఫ‌ల్యం స్ప‌ష్ఠంగా క‌నిపించింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ప్ర‌భాస్ కీర్తి బాగా పెరిగింది. అతడికి ఉన్న అతి భారీ మాస్ వైబ్ ని ఎన్ క్యాష్ చేసుకోవ‌డానికి ఆదర్శవంతమైన చిత్రనిర్మాతలు అవసరాన్ని కూడా ఇండ‌స్ట్రీ  గుర్తించింది. ప్ర‌భాస్ ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌లు.. హాస్యంతో కూడుకున్న‌ పాత్రలు ఇకపై విస్తృత స్థాయిలో ప్రజలకు ఆకర్షణీయమైన‌విగా లేవని కూడా ప్రూవైంది.  ప్ర‌భాస్ లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌తో భారీ యాక్ష‌న్ పాత్ర‌ల‌తో వ‌స్తేనే ఆశించిన రేంజుకు సినిమా వెళుతుంది. అయితే సాహో- రాధే శ్యామ్ పరాజయాల తర్వాత అతని పాపులారిటీ కొంచెం కూడా దెబ్బతినకపోవడం చాలా ఆశ్చర్యం క‌లిగించింది. జ‌యాప‌జ‌యాల‌తో ఇప్పుడు అత‌డికి ప‌ని లేదు. ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ తో మ్యాకోమ్యాన్ ప్ర‌భాస్ ఘ‌న‌మైన రీఎంట్రీని ఇవ్వ‌గ‌ల‌డు. ప్రభాస్ అతని బృందం అందుకు త‌గ్గ‌ట్టే అన్నివిధాలా ప్రిపేర్డ్ గా ప్ర‌తిదీ ప్లాన్ చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

2023 ని క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయం ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌దాని వెంట ఒక‌టిగా మూడు సినిమాలు విడుద‌ల‌కు రానున్నాయి. తానాజీ 3డి  దర్శకుడు ఓం రౌత్ 'ఆదిపురుష్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అలాగే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తో 'స‌లార్' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.  టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది.

ఈ మూడు సినిమాల‌పైనా భారీ అంచ‌నాలున్నాయి. ఇవ‌న్నీ పాన్ ఇండియా కేట‌గిరీలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్నాయి. 2023 సంక్రాంతి బ‌రిలో ఆదిపురుష్ విడుద‌ల‌వుతుంద‌ని భావిస్తున్నారు. అయితే ఓం రౌత్ ఇప్పటి వరకు ఆదిపురుష్ 3డి రిలీజ్ తేదీ గురించి అప్ డేట్ ను అందించలేదు. భారీ యాక్ష‌న్ చిత్రం స‌లార్ అధికారిక విడుదల తేదీ 2023 సెప్టెంబర్ 28 అని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. 2023 చివరి త్రైమాసికంలో ప్రాజెక్ట్-కె కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలన్నీ భారీ బ‌డ్జెట్ చిత్రాలే కావ‌డం విశేషం. ఒక్కో ప్రాజెక్ట్ కు 300-500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్నాయి. మొత్తంగా 2023లో ప్రభాస్ న‌టించిన‌ మూడు పాన్ ఇండియా చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాన్-ఇండియన్ నటుడి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచ‌ల‌నాలు న‌మోదు చేయ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు.

బాహుబలి: ది కన్ క్లూజన్ ఐదేళ్ల క్రితం విడుదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫాలోవర్లు అతని పునరాగమనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు ఫ్లాప్ ల త‌ర‌వాత ప్ర‌భాస్ కంబ్యాక్ అద్భుతంగా ఉండ‌నుంద‌ని తాజా లైన‌ప్ చెబుతోంది. రెబల్ స్టార్ 2023లో మళ్లీ పుంజుకుంటాడని అంతా ఆశిస్తున్నారు. 2023 ని క్లీన్ స్వీప్ చేసే స‌త్తా ప్ర‌భాస్ కి ఉంద‌ని న‌మ్ముతున్నారు. మునుముందు ఈ సినిమాల టీజ‌ర్లు ట్రైల‌ర్లతో అగ్గి రాజుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News