అమెరికా గన్ కల్చర్ పై సినిమా, డైరెక్టర్ మనోడే!

Update: 2023-05-07 10:55 GMT
అమెరికా అంటే అగ్రరాజ్యంగా ఎలా గుర్తుకు వస్తుందో.. అక్కడ తుపాకీ కల్చర్, దాని వల్ల జరిగే మారణహోమాలు, ప్రాణాలు కోల్పోయే అభం శుభం తెలియని అమాయక ప్రజలు లాంటివి కూడా గుర్తుకు వస్తాయి. అగ్ర రాజ్యంలోని ఈ గన్ కల్చర్ పై ప్రపంచదేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. అక్కడ మాత్రం తుపాకుల మోత, అమాయకుల ఆర్తనాదాలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి.

అమెరికా తుపాకీ కల్చర్ నేపథ్యంలో భారతీయ అమెరికన్ రచయిత, నిర్మాత, దర్శకుడు రోహిత్ కర్న్ బాత్రా ఈ సినిమా తీస్తున్నారు. ఈయన గతంలో ఎమ్మీకి నామినేట్ అయ్యాడు కూడా. ఈ తుపాకీ కల్చర్ తో బాధపడే అమాయకుల ఇతివృత్తంగా ఈ చిత్రం ఉండబోతుంది.

మిత్రులైన ఇద్దరు పిట్స్ బర్గ్ పోలీసులు వారి అసైన్మెంట్ లో భాగంగా గృహ హింసను ఎదుర్కొంటున్న ఓ ఇంటికి వెళ్తారు. అక్కడే జరిగే సంఘటనల నేపథ్యంలో మెడోస్ అనే పోలీసు అధికారి తన మిత్రుడైన కెవిన్ కూపర్ ను తుపాకీతో కాల్చి చంపుతాడు. అనుకోని ఈ ఘటనతో మెడోస్ తీవ్రంగా కలత చెందుతాడు. పోలీసు ఉద్యోగాన్ని కూడా వదులుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు.

కెవిన్ కూపర్ మృతికి కారణమైన తనను క్షమించాలని అడగడానికి మెడోస్ తన భార్య వద్దకు వెళ్తాడు. అప్పుడు వారి ఇద్దరి మధ్య ఏర్పడిన సంబంధం నేపథ్యంలో మిగతా కథ ఉంటుంది. ఈ చిత్రాన్ని గై జె లౌతాన్ నిర్మిస్తున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బయ్యర్లకు ఈ మూవీని పరిచయం చేయనున్నారు.

ఈ సినిమాకు 'ది గన్ ఆన్ సెకండ్ స్ట్రీట్' అనే టైటిల్ పెట్టారు. ఇందులో పాపీ డెలివింగ్నే కీలక పాత్రలో నటిస్తుండగా.. మిగతా నటీనటుల ఎంపిక జరుగుతోంది. నేషనల్ జియోగ్రాఫిక్ యొక్క జెనుయిస్ పికాసోలో ఆంటోనియో బాండెరాస్ సరసన డెలివింగ్నే కనిపించింది. ప్రొడ్యుసర్ గై జె లౌతాన్ అంతకు ముందు 'ది లవర్స్' అనే సినిమాను నిర్మించాడు. ఈ మూవీ 2013లో ఇండియాలో చిత్రీకరణ జరుపుకుంది. ఇందులో బిపాసా బసు కీలక పాత్రలో  నటించింది.

Similar News