మూవీ రివ్యూ : ఆకాశం నీ హద్దురా

Update: 2020-11-12 11:31 GMT
చిత్రం : ఆకాశం నీ హద్దురా
నటీనటులు: సూర్య-అపర్ణ బాలమురళి-పరేష్ రావల్-మోహన్ బాబు-ఊర్వశి-కరుణాస్, కాళి- అచ్యుత్ కుమార్- వివేక్ ప్రసన్న తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి
కథ: సుధ కొంగర
స్క్రీన్ ప్లే: సుధ కొంగర-షాలిని-ఆలిఫ్-గణేశ
మాటలు: రాకేందుమౌళి
నిర్మాత: సూర్య
దర్శకత్వం: సుధ కొంగర

దక్షిణాదిన థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసిన నేరుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైన అతి పెద్ద సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. సూర్య కథానాయకుడిగా తెలుగమ్మాయి, ‘గురు’ ఫేమ్ అయిన సుధ కొంగర రూపొందించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ రోజే అమేజాన్ ప్రైం ద్వారా విడుదలైన ఈ చిత్రం.. ఆ అంచనాల్ని ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ: చంద్రమహేష్ (సూర్య) ఒక పల్లెటూరి కుర్రాడు. తాను అనుకున్నది ఏదైనా సరే పట్టు విడువకుండా పోరాడి సాధించుకునే తత్వం ఉన్న అతను.. ఓ విషయంలో తండ్రితో గొడవపడి ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం సాధిస్తాడు. ఐతే తండ్రి చావుబతుకుల్లో ఉన్న సమయంలో చేతిలో సరిపడా డబ్బుల్లేక విమానంలో ప్రయాణించలేకపోయిన చంద్రమహేష్.. తండ్రి కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోతాడు. ఆ చేదు అనుభవం తర్వాత సామాన్యులకు అతి తక్కువ ధరకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించాలని అతను లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఐతే సామాన్యుడైన అతను కన్న ఈ భారీ కల నెరవేర్చుకునే ప్రయత్నంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. వీటన్నింటినీ అధిగమించి అతను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: మన మధ్య జీవించి ఉన్న ఒక వ్యక్తి కథతో సినిమా తీస్తున్నారంటే సహజంగా అంత ఆసక్తి కలగదు. ఎందుకంటే రెండు రెండున్నర గంటల సినిమాగా తీసేంత డ్రామా నిజ జీవిత కథల్లో ఉండటం అరుదు. స్వేచ్ఛ తీసుకుని డ్రామా కోసం మరీ ఎక్కువ కల్పన జోడిస్తే ఆ బయోపిక్ కు అసలు అర్థమే ఉండదు. కాబట్టి వాస్తవ కథలోనూ సినిమా స్థాయికి సరపడా విషయం ఉండాలి. కల్పన జోడిస్తే అది శ్రుతి మించకూడదు. ఈ రెండు విషయాల్లో సమతూకం కుదరడం అంత తేలికైన విషయం కాదు. ‘గురు’ సినిమాతో ఆకట్టుకున్న దర్శకురాలు సుధ కొంగర ‘ఆకాశం నీ హద్దురా’లో ఆ సమతూకాన్ని సాధించగలిగింది. ఎయిర్ డెక్కన్ ఎయిర్ లైన్స్ తో భారత విమాన యాన రంగంలో సంచలనాలకు తెర తీసిన గోపీనాథ్ జీవిత కథను అర్థవంతంగా, ఉద్వేగ భరితంగా తెరపై చూపించి ప్రేక్షకుల్లో కదలిక తీసుకు రాగలిగింది. వాస్తవ గాథ కావడం వల్ల దానికున్న పరిమితులు అక్కడక్కడా ఇబ్బంది పెట్టినా.. సుధ-సూర్య కలిసి నిజాయితీగా.. శ్రద్ధగా చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల మనసు దోస్తుంది. సూర్య నుంచి గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ చిత్రంగా ‘ఆకాశం నీ హద్దురా’ నిలుస్తుంది.

‘పెద్ద కల కను.. ఆ కలను నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా విశ్రమించకు’ అనే స్ఫూర్తిదాయక సందేశం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. ఒక మామూలు పల్లెటూరి కుర్రాడు.. తన లాంటి సామాన్యులు రైలు టికెట్ ధరతో విమానంలో ప్రయాణించేలా చేయాలన్న అసాధారణ కలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఐతే ఇదో కల్పిత గాథ అయితే.. హీరోతో ఎన్ని విన్యాసాలైనా చేయించొచ్చు. ఎలా కావాలనుకుంటే అలా కథను తిప్పేసి హీరోను విజేతగా నిలబెట్టేయొచ్చు. కానీ నిజంగా ఒక సామాన్యుడు సున్నా నుంచి మొదలుపెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం అంటే మాటలు కాదు. ఆ ప్రయాణాన్ని సాధ్యమైనంతగా ఆసక్తికర రీతిలో తెరపై ప్రెజెంట్ చేసింది సుధ. ఈ ప్రయాణం ఎంతో కఠినంగా సాగి ఉంటుందని అర్థం చేసుకోగలం. అలా అని అన్నీ కష్టాలే చూపించి.. ఆ కష్టాల సుడిగుండంలో ప్రేక్షకుల్ని నెడితే తట్టుకోవడం కష్టం. ఇక్కడ ప్రేక్షకులకు ఊరటనివ్వడానికి నడిపించిన హీరో హీరోయిన్ల ట్రాక్ సినిమాలో ఒక మేజర్ హైలైట్. కామెడీ కావచ్చు.. రొమాన్స్ కావచ్చు.. గొడవ కావచ్చు.. బాధ కావచ్చు.. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం అలా కళ్లప్పగించి చూసేలా చేయడంలో దర్శకురాలి ప్రతిభను మెచ్చుకోవాలి. హీరో హీరోయిన్ల మధ్య ‘కెమిస్ట్రీ’ అంటే ఏంటో చూపిస్తూ సూర్య-అపర్ణ తమ సన్నివేశాల్ని పండించిన తీరు వావ్ అనిపిస్తుంది.

మన జీవితాలకు అన్వయించుకునేలా వాస్తవికంగా సాగే ఈ కథ చాలా చోట్ల మనలోని భావోద్వేగాల్ని తట్టి లేపుతుంది.అద్భుతంగా తీర్చిదిద్దిన హీరో పాత్రలో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. అతడి సంతోషాల్లో, బాధల్లో, అనేక రకాల భావోద్వేగాల్లో.. అన్నింట్లోనూ మనం కూడా భాగం అయిపోతాం. ఆ పాత్రను తన రైటింగ్ టీంతో కలిసి సుధ తీర్చిదిద్దిన తీరు ఒకెత్తయితే.. దాన్ని సూర్య పండించిన తీరు మరో ఎత్తు. వాస్తవంగా గోపీనాథ్ జీవితంలో ఏం జరిగింది, ఆ పాత్రకు ఎంత మేర కల్పన జోడించారు అన్నది పక్కన పెడితే.. తెరమీద ఈ పాత్రను చూస్తున్నపుడు మాత్రం దానికి ఆరంభంలోనే కనెక్టయిపోయి దాంతో పాటు ప్రేక్షకులు ప్రయాణం చేసేలా చేయగలిగింది సూర్య-సుధ జోడీ. ఐతే ఈ పాత్రతో పాటు కథలోనూ వచ్చే మలుపులన్నీ దాదాపుగా ప్రథమార్ధానికే పరిమితం అయిపోయాయి. ఇక్కడి వరకు కథ పరుగులు పెడుతుంది. హీరో తన కల దిశగా అడుగులు వేయడానికి ముందు రకరకాల సన్నివేశాలు చూస్తాం. కొన్ని ట్విస్టులూ ఉంటాయి. అక్కడక్కడా కొంచెం రొమాంటిక్ టచ్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రథమార్ధంలో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టదు. అందులో కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి.

కానీ ద్వితీయార్ధంలో మాత్రం కథను ముందుకు తీసుకెళ్లడంలో ‘కష్టాలు’ తప్పలేదు. చివరికి ఏం జరుగుతందనే విషయంలో ముందే ఒక ఐడియా వచ్చేయగా.. మధ్యలో హీరోకు ఎదురయ్యే రకరకాల అడ్డంకులు ఒక దశ దాటాక అసహనానికి గురిచేస్తాయి. కథ రీత్యా అవి అనివార్యం అయినా.. ‘రిపిటీటివ్’ ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ ముంగిట ఉన్నట్లు ట్విస్టు ఏమీ లేకుండా ఒకే తరహాలో సాగిపోయే సన్నివేశాలు.. రొటీన్ విలనీ.. సినిమా ఇంకెప్పుడు ముగుస్తుందనే భావనకు తీసుకొస్తాయి. దీనికి తోడు హీరో కథ పరంగా కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. నిజంగా హీరోకు వ్యతిరేకంగా ఇన్ని కుట్రలు జరిగాయా.. మొత్తం అప్పు తెచ్చి పెట్టిన 50 లక్షలూ నష్టపోయిన హీరో మళ్లీ అంత సులువుగా ఎలా ఎయిర్ లైన్స్ మొదలుపెడతాడు.. 15 వేల రూపాయలు కూడా చేతిలో లేని వాడు నాలుగు కోట్ల పెట్టుబడి ఎలా సమీకరిస్తాడు.. అంత డ్యామేజ్ జరిగాక ఎలా కోలుకుంటాడు.. హీరో ఐడియానే వేస్ట్ అనే బిగ్ షాట్లు అతడి ఎయిర్ లైన్స్ కొనేయడానికి ఎందుకు ఎగబడతారు అన్న ప్రశ్నలకు లాజికల్ ఆన్సర్లు కనిపించవు. ఐతే మిగతా సినిమా అంతా సిన్సియర్ గా సాగడం.. ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలను ఉద్వేగభరితంగా తీర్చిదిద్దడంతో ఆ తప్పులను మన్నించేయొచ్చు అనిపిస్తుంది. ముగింపు సమయానికి మాత్రం ఒక ఉద్వేగాన్ని కలిగించి.. ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని ఇస్తుంది ‘ఆకాశం నీ హద్దురా’.

నటీనటులు: సూర్య ఎంత మంచి నటుడో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. వాటిలో ఇకపై ‘ఆకాశం నీ హద్దురా’ ముందు వరుసలో నిలిచే ఉదాహరణ అవుతుంది. సూర్య కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఒకటిగా నిలుస్తుంది ఈ చిత్రం. ఒకటా రెండా.. సూర్య నటుడిగా విజృంభించిన సన్నివేశాలు ఎన్నో. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలను పండించడంలో సూర్యకున్న బలాన్ని ఈ సినిమా చాలాచోట్ల చూపించింది. చావు బతుకుల మధ్య ఉన్న తన తండ్రిని చూడటం కోసం విమానం ఎక్కేందుకు వెళ్లి సరిపడా డబ్బులు లేక తల్లడిల్లిపోయే సన్నివేశంలో సూర్య నటనకు సెల్యూట్ చేయాల్సిందే. థియేటర్లలో అయితే ఆ సన్నివేశానికి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టేసేవాళ్లు. పతాక సన్నివేశాల్లోనూ సూర్య నటన అద్భుతం. కళ్లతో నటించడం అంటే ఏంటో ఇందులో సూర్య ఇందులో చాలా చోట్ల చూపించాడు. ఆ విషయంలో ఈ సినిమాను ఒక పాఠంలాగా బోధించవచ్చు. సూర్య లాంటి మేటి నటుడికి అపర్ణ అనే యంగ్ హీరోయిన్ నటనలో దీటుగా నిలబడటం ఆశ్చర్యపరుస్తుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్.. సూర్యతో కెమిస్ట్రీ వావ్ అనిపిస్తాయి. మొదట్లో సూర్య ముందు చిన్నమ్మాయిలా కనిపించినా తర్వాత అలవాటు పడిపోతాం. ఈ మధ్య కాలంలో సూర్యతో ఇంతగా కెమిస్ట్రీ పండించిన అమ్మాయి మరొకరు కనిపించరు. పరేష్ రావల్ విలన్ పాత్రను అలవోకగా చేసుకుపోయారు. ఐతే ఆయన పాత్ర నుంచి ఇంకా ఏదో ఆశిస్తాం. మోహన్ బాబు అతిథి పాత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. చివరి రెండు సన్నివేశాల్లో ఆయన పాత్ర ఒక హై ఇస్తుంది. ఆ పాత్రను ఇంకా పొడిగించి ఉండాల్సిందన్న భావన కలుగుతుంది. హీరో తల్లిగా ఊర్వశి బాగా చేసింది. తండ్రిగా చేసిన నటుడూ ఆకట్టుకున్నాడు. హీరో స్నేహితుల పాత్రల్లో చేసిన వాళ్లూ మెప్పించారు.

సాంకేతిక వర్గం: జి.వి.ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం ‘ఆకాశం నీ హద్దురా’కు అతి పెద్ద బలాల్లో ఒకటి. నేపథ్య సంగీతం ద్వారా కూడా కథను చెప్పే ప్రయత్నం చేశాడతను. ఎమోషనల్ సన్నివేశాలను అతను నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేసిన తీరు తన ప్రత్యేకతను చాటుతుంది. పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా లేవు. నికేత్ బొమ్మి కెమెరా పనితనం సినిమాకు మరో ఎసెట్. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల విషయంలో సూర్య ఎక్కడా రాజీ పడలేదు. ఇక దర్శకురాలు సుధ కొంగర.. ఎంచుకున్నది వాస్తవ కథే అయినా దాన్ని స్క్రీన్ మీదికి తీసుకురావడంలో చేసిన కృషి తెరపై కనిపిస్తుంది. ప్రథమార్ధం వరకు కథను చాలా ఆసక్తికరంగా చెప్పిదామె. సుధ నరేషన్లోనే ఒక మంచి ఫీల్ కనిపిస్తుంది. కథలో ఉన్న పరిమితులకు తోడు స్క్రీన్ ప్లేలో బిగి తగ్గడం.. లాజికల్ గా అనిపించని సన్నివేశాలతో సుధ ద్వితీయార్ధంలో కొన్ని చోట్ల తన ముద్రను చూపించలేకపోయింది. కానీ చివర్లో మళ్లీ పుంజుకుంది. దర్శకురాలిగా ఆమెకు ఓవరాల్ గా మంచి మార్కులు పడతాయి.

చివరగా: ఆకాశం నీ హద్దురా.. ఎమోషనల్ ‘ఎయిర్ జర్నీ’

రేటింగ్-3/5



Tags:    

Similar News