మూవీ రివ్యూ : అభినేత్రి

Update: 2016-10-08 06:51 GMT
చిత్రం: ‘అభినేత్రి’

నటీనటులు: తమన్నా - ప్రభుదేవా - సోనూ సూద్ - సప్తగిరి - హేమ - మురళీ శర్మ తదితరులు
సంగీతం: సాజిద్ - వాజిద్/విశాల్ మిశ్రా
ఛాయాగ్రహణం: మనుష్ నందన్
మాటలు: కోన వెంకట్
నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ
స్క్రీన్ ప్లే: ఎ.ఎల్ విజయ్ - పాల్ ఆరోన్
కథ - దర్శకత్వం: ఎ.ఎల్.విజయ్

తమన్నా - ప్రభుదేవా - సోనూ సూద్.. భలే ఆసక్తి రేకెత్తించిన కాంబినేషన్. ఈ ముగ్గురినీ ప్రధాన పాత్రల్లో పెట్టి తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ మూడు భాషల్లో రూపొందించిన సినిమా ‘అభినేత్రి’. తెలుగులో ప్రముఖ రచయిత కోన వెంకట్ అందించాడు. దసరా కానుకగా విడుదలైన ఈ హార్రర్ కామెడీ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కృష్ణ (ప్రభుదేవా) ఓ మారుమూల పల్లెటూరి నుంచి ముంబయికి వెళ్లి ఉద్యోగం సంపాదించి సెటిలైన కుర్రాడు. అతడికి ఇంగ్లిష్ గ్రామర్ మిస్టేకుల్లేకుండా మాట్లాడే మోడర్న్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక. అతను ఆ ప్రయత్నంలో ఉండగా.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన బామ్మ కోసం చదువురాని పల్లెటూరి అమ్మాయి అయిన దేవి (తమన్నా)ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమెను తీసుకుని ముంబయికి చేరుకుంటాడతను. ఐతే వీళ్లిద్దరూ కలిసి ఓ కొత్త ఇంట్లో దిగాక అనూహ్య పరిణామాలు జరుగుతాయి. దేవి పూర్తిగా మారిపోతుంది. చాలా మోడర్న్ గా తయారై సినిమా హీరోయిన్ గా అవకాశం కూడా సంపాదిస్తుంది. పెద్ద హీరో అయిన రాజ్ కరణ్ (సోనూ సూద్) ఆమెను చూసి ఇష్టపడతాడు. తనతో సినిమా కూడా చేస్తాడు. ఇంతకీ దేవిలో ఆ మార్పు ఎందుకొస్తుంది.. ఆమె ఉండే ఇంట్లో ఏం జరిగింది అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

హార్రర్ సినిమాలంటే ఒకప్పుడు హార్రర్ సినిమాలే. వాటిని చూసి జనాలు జడుసుకునేవాళ్లు. ఆ తర్వాత హార్రర్ కు కామెడీ జోడించి నవ్వించడం మొదలుపెట్టారు దర్శకులు. ఈ ఫార్ములా కొన్నేళ్ల పాటు బాగానే నడిచింది. కానీ ఈ మధ్య ఈ జానర్లో వస్తున్న సినిమాలన్నీ ఒకే తరహాలో సాగుతూ మొహం మొత్తేస్తున్నాయి. ఒకప్పుడు హార్రర్ సినిమాలు చూసి భయంతో జడుసుకునే జనాలు.. హార్రర్ కామెడీల్లో రొటీన్ ఫార్ములాను చూసి జడుసుకునే పరిస్థితి వచ్చింది. హీరో హీరోయిన్లు.. వాళ్ల వెంట ఇద్దరు ముగ్గురు కమెడియన్లు కలిసి ఓ ఇంట్లో అడుగుపెట్టడం.. హీరోయిన్ కు దయ్యం పట్టడం.. అది హీరోను.. కమెడియన్లను ఉతికారేయడం.. ఇదే హార్రర్ కామెడీల ఫార్ములా అయిపోయింది.

‘అభినేత్రి’ విషయానికి వస్తే.. ఇందులోనూ హీరో హీరోయిన్ ఓ ఇంట్లో అడుగుపెడతాడు. హీరో వెంట ఓ కమెడియన్ కూడా ఉంటాడు. హీరోయిన కు దయ్యం కూడా పడుతుంది. కాకపోతే ఆ దయ్యంతో వీళ్లను కొట్టించి కామెడీ పుట్టించాలని ప్రయత్నించనందుకు ముందు దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ను అభినందించాలి. అలాగే అనవసరంగా ప్రేక్షకుల్ని భయపెట్టాలని కూడా విజయ్ ప్రయత్నించలేదు. పెద్దగా మలుపులేమీ లేకుండా.. ప్రేక్షకులకు పరీక్షలేమీ పెట్టకుండా మామూలుగా కథనే ప్లెజెంట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. కథ పరంగా ‘అభినేత్రి’లో గొప్ప విశేషాలేమీ లేవు. కాకపోతే హడావుడి లేకుండా సింపుల్ గా సాగిపోయే కథనం.. నటీనటుల చక్కటి అభినయం.. సాంకేతిక విలువలు సినిమాకు బలంగా మారి.. పర్వాలేదనిపించే ప్యాకేజ్ లాగా తయారైంది ‘అభినేత్రి’.

కథాకథనాల్లో అంత బలం లేకపోయినా.. మంచి ఆర్టిస్టుల్ని.. సాంకేతిక నిపుణుల్ని పెట్టుకుని.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండేలా చూసుకుంటే సినిమా గ్రాఫ్ ఎలా పెరుగుతుందో చెప్పడానికి ‘అభినేత్రి’ని రుజువుగా చెప్పొచ్చు. ప్రభుదేవాను నటుడిగా ఎంత మిస్సవుతన్నామో ‘అభినేత్రి’ చూస్తే అర్థమవుతుంది. తనకు మాత్రమే సాధ్యమైన కామెడీ టైమింగ్.. బాడీలాంగ్వేజ్ తో తెరపైన కనిపించిన ప్రతిసారీ ఎంటర్టైన్ చేశాడు ప్రభుదేవా. ఇక తమన్నా ఇటు అభినయంతో.. అటు అందంతో కట్టిపడేసింది. ఆమె ఇంత అందంగా మరే సినిమాలోనూ కనిపించలేదంటే ఆశ్చర్యం లేదు. ఇక సప్తగిరి కూడా తన వంతుగా వినోదం పంచడం.. చక్కటి సాంకేతిక విలువలు కూడా తోడవడం వల్ల కథనం చాలా వరకు ప్లెజెంట్ గా సాగిపోతుంది.

కథ పరంగా ‘అభినేత్రి’ విషయంలో కొత్తదనం ఏమీ లేదు. బాలీవుడ్ మూవీ ‘ఓం శాంతి ఓం’ నుంచి తెలుగు-తమిళంలో వచ్చిన అనేక హార్రర్ కామెడీల ఛాయలు కనిపిస్తాయి. కథనం కూడా చాలా వరకు ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లు సాగిపోతుంది. ఎక్కడా హై పాయింట్స్.. థ్రిల్లింగ్ మూమెంట్స్ లేవు. దయ్యం చుట్టూ సాగే సినిమానే అయినా ఎక్కడా కూడా భయపెట్టడానికి ప్రయత్నించలేదు దర్శకుడు. ప్రధానంగా కామెడీ మీదే సినిమాను నడిపించాడు. అలాగని కామెడీ కూడా పేలిపోయే స్థాయిలో ఏమీ లేదు. కానీ ఉన్నంతలో ఎంటర్టైన్ చేస్తూ సాగిపోతుంది.

సినిమా అంటే పిచ్చి ఉన్న అమ్మాయి తన కోరిక నెరవేరకుండా చనిపోయి.. తాను ఉన్న ఇంట్లోకి వచ్చిన అమ్మాయి శరీరంలోకి వచ్చి తన కోరిక నెరవేర్చుకోవడమే ‘అభినేత్రి’ కథ. ఈ కథ.. దీని చుట్టూ అల్లుకున్న కథనం చూస్తే అంత ఎగ్జైటింగ్ గా మాత్రం లేదు. ఇలాంటి కథాకథనాలతో మూడు భాషల్లో సినిమా తీసేంత సీన్ కూడా లేదు. కాకపోతే ఎంచుకున్న ఆర్టిస్టులు మూడు భాషల వాళ్లకూ కనెక్టయ్యేవాళ్లే కావడం.. ఇందులోని మినిమం గ్యారెంటీ వినోదం అన్ని రకాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా ఉండటం ‘అభినేత్రి’కి బలం అయింది. పెద్దగా అంచనాలేమీ పెట్టుకోకుండా వెళ్తే ‘అభినేత్రి’ ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేసి పంపిస్తుంది.

నటీనటులు:

ముందే చెప్పుకున్నట్లు ప్రభుదేవా పాత్ర.. అతడి నటనే సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఎదుటివాడి మీద కోపం వచ్చినపుడు అతణ్ని మనసులోనే చితగొట్టేసినట్లు ఊహించుకోవడం అన్నది కొత్త పాయింటేమీ కాదు. కానీ అదే ఊహను ప్రభుదేవా కోణంలో చూస్తే కడుపుబ్బ నవ్వుకుంటాం. చాలా మామూలు సన్నివేశాలు కూడా ప్రభుదేవా కారణంగా ఎంగేజ్ చేస్తాయి. ప్రభుదేవా నుంచి ఆశించే స్థాయిలో ఇందులో అతడి డ్యాన్సులు లేవు కానీ.. ఉన్నంతలో పర్వాలేదు. హీరోయిన్ తమన్నాతోనే కాక.. కమెడియన్ సప్తగిరితోనూ ప్రభుదేవాకు చక్కటి కెమిస్ట్రీ కుదిరింది. తమన్నాకు ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. ఆమె అన్ని రకాలుగూ ఆకట్టుకుంది. ఇటు అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా.. అటు హీరోయిన్ గా చక్కటి నటన కనబరిచింది. ఆమె గ్లామర్ షో కుర్రాళ్లకు విందే. డ్యాన్సుల్లో ప్రభుదేవాకు దీటుగా అదరగొట్టింది. సోనూ సూద్ కూడా పాత్రకు తగ్గట్లుగా చక్కగా నటించాడు. సప్తగిరి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో మంచి వినోదం పంచాడు. మురళీ శర్మ కూడా బాగా చేశాడు.

సాంకేతికవర్గం:

ప్రొడక్షన్ వాల్యూస్ ‘అభినేత్రి’కి బలంగా నిలిచాయి. మనుష్ నందన్ ఛాయాగ్రహణం చాలా ఆహ్లాదంగా సాగిపోయింది. పాటల కోసం ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. అవి పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. కోన వెంకట్ డైలాగులు బాగున్నాయి. వన్ లైనర్స్ బాగా పేలాయి. మామూలుగా చేసే కమర్షియల్ సినిమాల్లో మాదిరి కాకుండా ఇందులో సన్నివేశాలకు తగ్గట్లుగా మాటలు రాశాడు కోన. ఇక దర్శకుడు ఎ.ఎల్.విజయ్.. నేలవిడిచి సాము చేయలేదు. ఒక మామూలు కథను ఓ మోస్తరు కథనంతో చెప్పే ప్రయత్నం చేశాడు. పైకి లేపి కింద పడేసే తరహాలో కాకుండా.. సింపుల్ గా మీడియం ఫ్లోలో సినిమాను నడిపించాడు. విజయ్ తీసిన మంచి సినిమాలకు.. ఫ్లాప్ సినిమాలకు మధ్యన ‘అభినేత్రి’ నిలుస్తుంది.

చివరగా: అభినేత్రి.. అలరిస్తుంది ఓ మోస్తరుగా!!

రేటింగ్- 2.75/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News