టాలీవుడ్ విల‌న్ బుక్క‌యిపోయాడు!

Update: 2019-01-26 08:30 GMT
ముంబై మెట్రో ప‌రిధిలో మున్సిప‌ల్ అధికారులు ఫేజ్ 3 ప్ర‌పంచానికి చుక్క‌లు చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఖ‌రీదైన పోష్ ఏరియాల్లో విల్లాల నిర్మాణం,  క‌మ‌ర్షియ‌ల్ బిల్డింగుల నిర్మాణం చేప‌డుతున్న సెల‌బ్రిటీలంద‌రికీ రూల్స్ స‌రిగా పాటించ‌లేదంటూ నోటీసులు పంపిస్తూ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, జ‌రీన్ ఖాన్  .. ఒక‌రేమిటి డ‌జ‌ను పైగానే ముంబై సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే బీఎంసీ నుంచి ప‌లు సంద‌ర్భాల్లో నోటీసులు అందుకున్నారు. ర‌క‌ర‌కాల వివాదాల్లో ఆస్తి త‌గాదాలు ర‌చ్చ‌కెక్కాయి.

అదంతా అటుంచితే తాజాగా టాలీవుడ్ విల‌న్ సోనూసూద్ కి ముంబై బీఎంసీ నుంచి నోటీసులు అందాయి. ఐదంత‌స్తుల భ‌వంతిలో అనుమ‌తి లేకుండా అత‌డు హోట‌ల్ ర‌న్ చేస్తున్నాడ‌న్న‌ది మున్సిపాలిటీ ఆరోప‌ణ‌. అవ‌స‌ర‌మ‌య్యే అనుమ‌తులు పొంద‌లేద‌ని, దీనివల్ల ప్ర‌మాదాలు త‌లెత్త‌నున్నాయ‌ని బీఎంసీ వాదిస్తోంది. ముంబై జుహూ ఏరియాలో ఖ‌రీదైన 6 స్టోరి హోట‌ల్ ని సోనూ సూద్ ర‌న్ చేస్తున్నాడు. రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్ మొత్తాన్ని అత‌డు హోటల్ గా మార్చేశాడ‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దీంతో సివిక్ వ‌యోలేష‌న్ పేరుతో బీఎంసీ నోటీసులు పంపించింది. ఇప్ప‌టికే ఈ హోట‌ల్ స‌మాచారం ఆన్ లైన్ లో ఉంది. `హోట‌ల్ శ‌క్తి సాగ‌ర్` పేరుతో ఆన్ లైన్ లో రూమ్ బుకింగ్ ఆఫ‌ర్స్ ఇస్తోంది. అయితే ఈ భ‌వంతిలో ఇన్ సైడ్ ఒక్కటీ స‌రిగా లేదు. ఫైర్ సేఫ్టీ నుంచి బాల్క‌నీ, రోడ్ వైడెనింగ్ స‌మస్య ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లున్నాయి. అయినా రూల్స్ కి వ్య‌తిరేకంగా ఇలా భ‌వంతిని మార్చేశారంటూ అధికారులు వాదిస్తున్నారు.

అయితే బీఎంసీ ఆరోప‌ణల‌ను సోనూ సూద్ ఓ ప్ర‌క‌ట‌న‌లో ఖండించాడు. ``నేను అన్ని రూల్స్ ఫాలో అవుతున్నా. ఎన్ వోసీ స‌ర్టిఫికెట్లు తెచ్చుకున్నా. అవ‌స‌రం మేర షాపుల విస్త‌ర‌ణ‌కు లైసెన్స్ తెచ్చుకున్నా. అందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ల‌ను బీఎంసీ వాళ్ల‌కు స‌బ్ మిట్ చేశాను. ఆ భ‌వంతికి స‌మీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ని బీఎంసీ తొల‌గించి మాకు సాయ‌ప‌డింది. కావాలంటే ఆధారాలు చూపిస్తాను`` అంటూ సోనూ సూద్ త‌న‌వైపు నుంచి వెర్ష‌న్‌ ని వినిపించాడు. అయితే పూర్తి స్థాయిలో అనుమ‌తులు రాకుండానే హోటల్ ర‌న్ చేస్తున్నాడ‌నేది బీఎంసీ అధికారుల వాద‌న‌. మ‌రి ఈ వివాదం ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.
Tags:    

Similar News