కామెంట్: దెబ్బకి అందరికీ చుక్కలేనా?

Update: 2018-01-17 18:29 GMT
పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి రిజల్ట్ సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే భారీ నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలవనుందనే సంగతి తేలిపోయింది. అయితే.. ఇంతటి భారీ నష్టాలకు కారణం ఏంటనే సంగతిపై కూడా ఇప్పుడు అంతర్మథనం చాలామందిలో జరిగిపోతోంది.

పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలను పరిశీలిస్తే.. అవేమీ కనీస మాత్రం సక్సెస్ లు కూడా కావు. అలాగే త్రివిక్రమ్ గత రెండు సినిమాలు సన్నాఫ్ సత్యమూర్తి.. అఆలు హిట్ పాస్ అనిపించుకున్నాయంతే. కానీ పవన్-త్రివిక్రమ్ కాంబోపై ఉన్న నమ్మకంతో.. బయ్యర్లు-డిస్ట్రిబ్యూటర్లు భారీగా డబ్బులు కుమ్మరించేశారు. బాహుబలి తొలి భాగానికి మించి రేట్లు ఇచ్చి మరీ కొన్నారంటే.. అజ్ఞాతవాసిపై అందరి అంచనాలు అర్ధమవుతాయి.

ఇప్పుడు సినిమా కంటే ఎక్కువగా దెబ్బతిన్నది ఈ నమ్మకమే అని చెప్పవచ్చు. ఇక్కడ హీరో-డైరెక్టర్ సేఫ్ అయిపోవచ్చు. అలాగే నాన్ రికవరీ అగ్రిమెంట్ చేసుకుని ఉంటే నిర్మాత కూడా సైడ్ కావచ్చు. కానీ గుడ్డిగా ఈ స్థాయిలో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయడం అనేది ఎంతటి తప్పో తెలియచేసేందుకు సాక్ష్యంగా అజ్ఞాతవాసి నిలుస్తోంది.

నిజానికి ఒక్క అజ్ఞాతవాసినే అనాల్సిన పనేమీ లేదు. ఆ మాటకొస్తే.. ఇలాంటి భారీ డిజాస్టర్లు చాలానే ఉంటాయి. పెట్టుబడిలో సగం కూడా రాబట్టలేకపోవడాన్ని పాయింట్ చేసుకోవాలి. మహేష్ బాబు నటించిన స్పైడర్ కూడా అజ్ఞాతవాసికి ఇంచుమించు సరిసమంగానే ఉంటుంది. నాగార్జున మూవీ ఓం నమో వెంకటేశాయ కూడా కనీస మాత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది. రజినీకాంత్ పై పెట్టుబడి ఇప్పటికి చాలాసార్లే మునిగింది టాలీవుడ్. ఇతర హీరోల కెరీర్ లో కూడా ఇలాంటి చిత్రాలు ఉంటాయి. కానీ అమౌంట్ పరంగా అజ్ఞాతవాసి లాస్ ఎక్కువ కావడంతోనే.. చర్చంతా ఆ సినిమా చుట్టూ తిరుగుతోంది.

గతంలో ఓ మూవీ ఫస్ట్ కాపీ చూసుకున్నాక డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు అలాంటి ఛాన్సే లేదు. ఆ మాటకొస్తే అన్ని పనులు పూర్తి చేసుకుని డైరెక్టర్ కూడా ఆఖరి నిమిషంలోనే చూసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అయినా సరే ఇంతేసి రేట్లు పెట్టడానికి.. వారిపై పెట్టుకున్న నమ్మకాలే అసలు కారణం.

స్పైడర్.. అజ్ఞాతవాసి ఇచ్చిన షాక్ ల పుణ్యమా అని.. ఇకపై కాంబినేషన్లను నమ్ముకుని ఉన్నదంతా ఊడ్చేసి మరీ సినిమాలను కొనేందుకు జనాలు ముందుకు రాకపోవచ్చు. పర్మనెంట్ గా కాకపోయినా.. కొంతకాలం అయినా ఈ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం త్వరలో రిలీజ్ కానున్న చిత్రాలపై కనిపించడం ఖాయం.

రజినీకాంత్ మూవీ 2.ఓ పై 80కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారనే టాక్ ఉంది. ఇది నిజమే అయితే.. సినిమా తేడా వస్తే సంగతేంటి అనిపించక మానదు. మరోవైపు.. ఇప్పుడిప్పుడే బిజినెస్ లను పూర్తి చేసుకుంటున్న రామ్ చరణ్ మూవీ రంగస్థలం.. మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను.. అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య చిత్రాలకు.. ఓవర్సీస్ లోనే కాదు.. లోకల్ గా కూడా ఆశించిన స్ధాయిలో రేట్లు దక్కకపోవచ్చని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News