అమెరికాలో అర్జున్ రెడ్డి వెరైటీ రికార్డు

Update: 2017-08-28 11:43 GMT
గత శుక్రవారం విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ అంచనాల్ని మించిపోతోంది. ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమాకు కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. దాదాపుగా అన్ని చోట్లా హౌస్ ఫుల్స్‌తో నడిచిందీ సినిమా. సిటీల్లో అయితే థియేటర్లు ప్యాక్ అయిపోయాయి. తొలి రోజే రూ.4.5 కోట్ల షేర్ రాబట్టిన ‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ వీకెండ్లో రూ.10 కోట్ల దాకా షేర్ రాబట్టినట్లు అంచనా. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. అమెరికాలో ఈ సినిమా దూకుడు మరింతగా కనిపిస్తోంది. వీకెండ్ అయ్యేసరికే మిలియన్ మార్కుకు చేరువగా వచ్చేసింది ‘అర్జున్ రెడ్డి’. ఆదివారం రాత్రికి ఈ చిత్రం 9.5 లక్షల డాలర్లు కలెక్ట్ చేసింది.

విశేషం ఏంటంటే.. యుఎస్‌ లో రిలీజైన ‘ఎ’ రేటెడ్ తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘అర్జున్ రెడ్డి’ ఇప్పటికే రికార్డు నెలకొల్పింది. ఇప్పటిదాకా ఈ జాబితాలో ‘బిజినెస్ మ్యాన్’ 7 లక్షల డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ‘అర్జున్ రెడ్డి’ శనివారమే ఆ మార్కును దాటేసింది. ఇండియాలో ‘అర్జున్ రెడ్డి’ చాలా కట్స్ తో రిలీజైంది. కానీ అమెరికాలో ఏ కట్స్ లేకుండా ఉన్నదున్నట్లే రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫుల్ రన్లో 2 మిలియన్ మార్కును అందుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. సోమవారం కూడా కలెక్షన్లు స్టడీగానే ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ శుక్రవారం రాబోయే ‘పైసా వసూల్’ మాస్ మసాలా సినిమా కాబట్టి యుఎస్ తెలుగు ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లుగా ఉన్న ‘అర్జున్ రెడ్డి’కి రెండో వారంలోనూ జోరు చూపించే అవకాశముంది.
Tags:    

Similar News