మా ఎనర్జీ వేరే లెవెల్ కి వెళ్లిపోయిందబ్బా!

Update: 2022-01-06 09:45 GMT
టాలీవుడ్ కి సూపర్ స్టార్ కృష్ణ మనవడు .. మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కానున్నాడనే వార్త చాలా కాలంగా వినిపిస్తూ వచ్చింది. బలమైన కుటుంబ నేపథ్యం ఉండటం వలన ఆయన హీరోగా సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు కూడా అవాంతరాలను ఎదుర్కొంది .. అనుకున్నదానికంటే ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ సంక్రాంతి బరిలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకూ బరిలో 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' వంటి సినిమాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఆ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే అవకాశాలు లేకపోవడంతో వెనక్కి తగ్గాయి. దాంతో చిన్న సినిమాలన్నీ మరింత ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో థియేటర్ల దిశగా పరుగులు తీస్తున్నాయి. అలాంటి సినిమాల రేసులోకి అశోక్ గల్లా 'హీరో' సినిమా కూడా చేరిపోయింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై హీరో అశోక్ గల్లా మాట్లాడాడు.

"అందరికీ నమస్కారం .. ముఖ్యంగా మీడియా వాళ్లకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాను సంక్రాంతి విడుదల చేయడం సాధ్యపడుతుందని తెలిసిన దగ్గర నుంచి మా ఎనర్జీ వేరే లెవెల్ కి వెళ్లిపోయింది. రీసెంట్ గా వదిలిన సాంగ్ కి మహేశ్ బాబుగారి ఫ్యాన్స్ నుంచి కృష్ణ తాతగారి ఫ్యాన్స్ నుంచి .. జనరల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచంలో ఏదేదో జరుగుతోంది .. ఈ సమయంలో రావడం కరెక్టా కాదా అనుకునే సమయంలో ఇంత పెద్ద రెస్పాన్స్ తో ఎనర్జీ ఇచ్చినప్పుడు వెనకడుగు వేయకూడదు అనిపించింది.

ఇంతకుముందు మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా, ఒక ఫ్యామిలీ మాదిరిగా మేమంతా కలిసి ఆడుతూ పాడుతూ కలిసి చేసిన సినిమా ఇది. మేము ఎంత ఎంజాయ్ చేశామో .. రేపు అంత ఎంజాయ్ చేస్తూ ఆడియన్స్ ఈ సినిమా చూసి బయటికి వస్తే, మా ప్రయత్నం ఫలించినట్టే అవుతుందని అనుకుంటున్నాను" అంటూ ముగించాడు. గల్లా పద్మావతి నిర్మించిన ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఇంతకుమందు ఆయన నుంచి 'భలేమంచి రోజు' .. 'దేవదాస్' .. 'శమంతకమణి' వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News