వెయ్యి రూపాయల కోసం వెయిట్ చేసిన 'బాహుబలి' రచయిత!

Update: 2022-01-31 04:01 GMT
రచయితగా విజయేంద్రప్రసాద్ కి మంచి పేరు ఉంది. కథాకథనాలను అదించడంలో ఆయన సిద్ధహస్తుడు. చాలా కాలంగా చిత్రపరిశ్రమలో ఉంటూ ఆయన ఎన్నో సినిమాలకి కథలను అందిస్తూ వచ్చారు. అయితే రాజమౌళి దర్శకుడిగా మారిన తరువాత .. ఆ సినిమాలు సంచలన విజయాలను నమోదు చేయడం మొదలుపెట్టిన తరువాత, విజయేంద్ర ప్రసాద్ కి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఒక వైపున బాలీవుడ్ .. మరో వైపున కోలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ఆయన కథల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చింది.
rajmouli.
సాంఘిక చిత్రాలకు మాత్రమే కాదు .. 'బాహుబలి' తరహా జానపద ఛాయలు కలిగిన కథలను అందించడంలోను, 'మణికర్ణిక' వంటి చారిత్రక నేపథ్యం కలిగిన కథలను అందించడంలోను .. 'బజరంగి భాయీజాన్' వంటి సందేశాత్మక కథలతో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు.  ఆయన కథను అందించిన 'ఆర్ ఆర్ ఆర్' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది. అలాంటి విజయేంద్ర ప్రసాద్ గారు తాజాగా ఒక వేదికపై యండమూరి వీరేంద్రనాథ్ గారిని అభినందించడం విశేషం.

సాధారణంగా ఒక రచయిత .. తనని తాను తగ్గించుకుంటూ, మరో రచయితను అభినందించడమనేది అరుదుగా జరుగుతుంది. యండమూరి వీరేంద్రనాథ్ గురించి ఒక సందర్భంలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. "వీరేంద్రనాథ్ గారు రచయితగా దశాబ్ద కాలానికి పైగా ఏలేశారు. ఆయన కోసం పెద్ద దర్శక నిర్మాతలు వెయిట్ చేయడం గురించి నాకు తెలుసు. అప్పట్లో ఆయన ఒక్కొక్కరికి రెండు .. మూడు గంటలు మాత్రమే సమయాన్ని కేటాయించడం నేను చూశాను. ఆయన అంత బిజీగా ఉండేవారు.

అదే సమయంలో నేను రచయితగా నిలబడటానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాను. ఎవరైనా దర్శక నిర్మాతలు పిలిచి .. ఏదైనా పని చేయించుకుని .. వెయ్యో రెండు వేలో ఇస్తే బతకొచ్చని ఎదురుచూసే రోజులవి. అలాంటి పరిస్థితుల్లో యండమూరిగారి టాలెంట్ చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసేది. ఎప్పటికైనా అలా రాయగలనా? అనుకునేవాడిని. ఆయన సినిమాలకి రాయడం మానేయడం సినిమా ఫీల్డ్ దురదృష్టం .. అది నాకు అదృష్టంగా మారి నేను రాయడానికి అవకాశం దొరికింది. వీరేంద్రనాథ్ గారు కంటిన్యూ చేస్తే విజయేంద్ర ప్రసాద్ కి సినిమా ఫీల్డ్ లో ఛాన్స్ లేదు.
వీరేంద్రనాథ్ గారు రచయితగా ఎదిగినట్టే డైరెక్టర్ గా కూడా ఎదగాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.          


Tags:    

Similar News