మూవీ రివ్యూ : 'భామా కలాపం'

Update: 2022-02-11 16:51 GMT
చిత్రం : 'భామా కలాపం'
నటీనటులు: ప్రియమణి-జాన్ విజయ్-శాంతి రావు-శరణ్య ప్రదీప్-కంచెరపాలెం కిషోర్ తదితరులు
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
నేపథ్య సంగీతం: మార్క్ కె.రాబిన్
మాటలు: జయకృష్ణ
నిర్మాతలు: బాపినీడు-సుధీర్
రచన-దర్శకత్వం: అభిమన్యు

ఈ మధ్య ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకర్షించిన సినిమాల్లో 'భామాకలాపం' ఒకటి. ప్రియమణి ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు అభిమన్యు రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ ఈ రోజే ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అనుప‌మ (ప్రియ‌మ‌ణి) ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి ఇల్లాలు. భ‌ర్త‌.. కొడుకుతో క‌లిసి ఒక అపార్ట్ మెంట్లో  ఉండే ఆమెకు ప‌క్క వాళ్ల సంగ‌తులంటే మ‌హా ఆస‌క్తి. ఓవైపు త‌న పేరిట యూట్యూబ్ లో వంట‌ల ఛానెల్ న‌డుపుతూ.. ఇంకోవైపు అపార్ట్ మెంట్లో అంద‌రి విష‌యాల్లో జోక్యం చేసుకుంటూ వివాదాలు కొని తెచ్చుకుంటున్న ఆమె ఒక ఫ్లాట్లో ఇద్ద‌రు దంప‌తులు గొడ‌వ ప‌డుతుండ‌టం చూసి వాళ్ల సంగ‌తేంటో తేల్చాల‌నుకుంటుంది. కానీ ఆమె వెళ్లేస‌రికి భ‌ర్త హ‌త్య చేయ‌బ‌డి ఉంటాడు. ఆ ఇంటికి వ‌చ్చిన కొత్త వ్య‌క్తికి అనుప‌మ వాళ్ల ప్రాణాల మీదికి వ‌స్తుంది. ఈ ప‌రిణామాల‌న్నింటికీ కార‌ణం.. కోల్‌క‌తాలోని ఒక మ్యూజియం నుంచి దొంగిలించిన రూ.200 కోట్ల విలువైన గుడ్డు అని వెల్ల‌డవుతుంది. ఆ గుడ్డు క‌థేంటి.. దానికి అనుప‌మ అపార్ట్ మెంట్లో జ‌రిగిన హ‌త్య‌కు సంబంధ‌మేంటి.. ఈ గొడ‌వ‌లో చిక్కుకున్న అనుప‌మ జీవితం ఎలా మ‌లుపు తిరిగింది అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ఈ మ‌ధ్య కాలంలో పెద్ద పెద్ద సినిమాల్ని మించి భామా క‌ళ్యాణం ట్రైల‌ర్ ఆస‌క్తి రేకెత్తించిన మాట వాస్త‌వం. ట్రైల‌ర్ చూస్తే ఆ క‌థ‌.. దాని నేప‌థ్యం.. ప్రియ‌మ‌ణి చేసిన మ‌ధ్య త‌ర‌గ‌తి ఇల్లాలి పాత్ర అంత ఆస‌క్తిక‌రంగా అనిపించాయి మ‌రి. ఒక అపార్ట్ మెంట్.. అందులో యూబ్యూట్ లో వంట‌ల ఛానెల్ న‌డిపే మ‌ధ్య త‌ర‌గ‌తి ఇల్లాలు.. మ్యూజియంలో దొంగ‌తనానికి గురైన 200 కోట్ల గుడ్డు.. దీని వెనుక ఒక గ్యాంగు.. ఒక హ‌త్య‌.. ఇలా అదిరిపోయే క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ చూడ‌బోతున్న ఫీలింగ్ క‌లిగింది. ఐతే ఈ సెట‌ప్ అంతా చాలా బాగున్న‌ప్ప‌టికీ.. ఈ క‌థ‌ను ఎలా న‌రేట్ చేయాల‌న్న విష‌యంలో త‌లెత్తిన క‌న్ఫ్యూజ‌న్ భామా క‌లాపంకు ప్ర‌తికూలంగా మారింది. కొన్నిచోట్లేమో ఇది చాలా సీరియ‌స్ థ్రిల్ల‌ర్ లాగా అనిపిస్తుంది. కాస్త ఉత్కంఠ‌ను ఫీలై ఆ మూడ్ లోకి వెళ్లే లోపు ఒక సిల్లీ సీన్ తో మొత్తం వ్య‌వ‌హారాన్ని కామెడీ చేసి ప‌డేస్తారు. పోనీ కామెడీ మూడ్ తోనే సినిమా చూద్దాం అనుకుంటే మ‌ళ్లీ ఎక్క‌డలేని సీరియ‌స్నెస్ తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది. మొత్తానికి క్రైమ్ కామెడీగా తీద్దామ‌నుకుని ఈ రెండు ర‌సాలూ అత‌క‌క‌.. ఎటూ కాని సినిమాగా త‌యారైపోయింది భామా క‌లాపం. మంచి సెట‌ప్ కుదిరినా.. అక్క‌డ‌క్క‌డా కొన్ని ఆక‌ర్ష‌ణీయ అంశాలున్నా.. ఓవ‌రాల్ గా అనుకున్న స్థాయిలో మాత్రం మెప్పించ‌లేక‌పోయిందీ చిత్రం.

భామాక‌లాపం సినిమాకు క‌థా వ‌స్తువే అతి పెద్ద స‌మ‌స్య‌. రూ.200 కోట్ల విలువైన ఒక వ‌స్తువు అన్న‌పుడు దాన్ని కొంచెం అపురూపంగా చూపించ‌డం.. దాన్ని ప్రేక్ష‌కులు సీరియ‌స్ గా తీసుకునేలా చేయ‌డం చాలా ముఖ్య‌మైన విష‌యం. అది ఎందుకు అంత విలువైందో.. దాని వెనుక క‌థేంటో దృశ్య‌రూపూంలో చూపించాలి. దాని ప్ర‌త్యేక‌త‌లు చెప్పాలి.

మ్యూజియంలో ఉన్న ఆ వ‌స్తువును దొంగిలించే క్ర‌మాన్ని కాస్త ఉత్కంఠ రేకెత్తించేలా చూపించాలి. ఇదేమీ లేకుండా.. ఇద్ద‌రు చిల్లర రౌడీలు కార్లో ఆ గుడ్డు గురించి కామెడీగా మాట్లాడుకుంటూ రావ‌డం.. ఆ డ్యాష్ బోర్డులో గుడ్డుంది తీయి.. దాని విలువ 200 కోట్ల‌ని చెప్ప‌డం.. అది చాలా కామెడీగా కార్లోంచి బ‌య‌ట‌ప‌డిపోవ‌డం.. స‌రిగ్గా గుడ్ల వ్యాన్ మీదే ప‌డి ఎగ్స్ గోడౌన్ కు వెళ్ల‌డం.. ఇదంతా చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇక్క‌డి నుంచి చివ‌రి దాకా ఆ గుడ్డు చుట్టూ న‌డిపించిన ప్ర‌తి స‌న్నివేశం కూడా సిల్లీగానే అనిపిస్తుంది. అందుకే ఈ గుడ్డు రెండొంద‌ల కోట్లా అని తెర మీద ఒక క్యారెక్ట‌ర్ కామెడీ చేసిన‌ట్లే ఉంటుంది ప్రేక్ష‌కుల ఫీలింగ్ కూడా. దీని వ‌ల్ల ఏ ద‌శ‌లోనూ భామాక‌లాపం సినిమాను సీరియ‌స్ గా తీసుకోలేని ప‌రిస్థితి త‌లెత్తుతుంది.

ఈ గుడ్డు క‌థ ఆరంభంలోనే ఇలా తేలిపోగా.. యూట్యూబ్ వంట‌ల‌క్క‌గా ప్రియ‌మ‌ణి పాత్ర ఆరంభంలో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఎంత‌సేపూ ప‌క్కింట్లో ఎదురింట్లో ఏం జ‌రుగుతోందో తెలుసుకోవాల‌ని చూసే ఆమె తాప‌త్ర‌యం ఆస‌క్తి రేకెత్తిస్తుంది. ఇలా లేని పోని వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చి అపార్ట్ మెంట్ జ‌నాల‌తో చీవాట్లు తినే తీరు ఫన్నీగా అనిపిస్తుంది. ఇలా స‌ర‌దాగా సాగిపోతున్న సినిమా కాస్తా.. ఉన్న‌ట్లుండి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వైపు తిరిగి సీరియ‌స్ గా మారుతుంది. అప్ప‌టికి ప్రేక్ష‌కులు హ‌ఠాత్ప‌రిణామానికి షాకైనా.. ఆ త‌ర్వాత వారి ఆస‌క్తిని నిల‌బెట్టేలా క‌థ‌నం సాగ‌లేదు.

అస‌హ‌జ‌మైన స‌న్నివేశాలతో భామా క‌లాపం గాడి త‌ప్పింది.ఒక అమాయ‌క ఇల్లాలు ఉన్న‌ట్లుండి హంత‌కురాలు అయిపోవ‌డం.. ఆమె ఆలోచ‌న‌ల‌న్నీ క్రిమిన‌ల్ లాగా అనిపించ‌డం ప్రేక్ష‌కుల‌కు జీర్ణం కాదు. ఒక ఆపార్ట్ మెంట్లో చాలా ఈజీగా మ‌నిషిని చంపేసి.. బాడీని తీసుకొచ్చి వంట ఇంట్లో దాచేసి.. ఆ త‌ర్వాత దాన్ని అటు ఇటు షిఫ్ట్ చేయ‌డం చూస్తే.. చిన్న పిల్ల‌లాటలా క‌నిపిస్తుంది తప్ప దేన్నీ సీరియ‌స్ గా తీసుకోలేం. ఓవైపు గుడ్డు క‌థ‌.. ఇంకోవైపు ఈ శవం వ్య‌వహారం.. దేనిక‌దే సిల్లీగా.. న‌మ్మ‌శక్యం కాని విధంగా న‌డుస్తూ క్ర‌మంగా ఆస‌క్తి స‌న్న‌గిల్లిపోయేలా చేస్తాయి.

ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయేలా భామాకలాపంలో ఎక్క‌డిక్క‌డ ట్విస్టులైతే ఉన్నాయి కానీ.. తెర‌పైన జ‌రిగేది వాస్త‌వికంగా అనిపించ‌క‌పోవ‌డంతోనే వ‌స్తుంది స‌మ‌స్య‌. పాత్ర‌ల ఔచిత్యం గురించి ఆలోచించ‌కుండా ఏద‌నిపిస్తే అది తీసేసిన‌ట్లు అనిపిస్తుంది. అపార్ట్మెంట్లో చూపించిన‌ హ‌త్య.. అనంత‌ర ప‌రిణామాలు ఏమాత్రం న‌మ్మ‌శ‌క్యంగా అనిపించ‌వు. ప్రియ‌మ‌ణి పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన తీరుకు.. ఆ త‌ర్వాత ఆమె చేసే ప‌నుల‌కు అస‌లు పొంత‌న ఉండ‌దు. ఒక ద‌శ దాటాక వ‌యొలెన్స్ బాగా ఎక్కువైపోయింది సినిమాలో.

200 కోట్ల గుడ్డు అని న‌మ్మ‌శ‌క్యం కాని వ‌స్తువు చుట్టూ క‌థ న‌డప‌డ‌మే కాక విల‌న్ని పెద్ద జోక‌ర్ లాగా చూపించి మొత్తం ఈ సెట‌ప్ నే కామెడీ చేసేశాడు ద‌ర్శ‌కుడు. అనుకోకుండా ఒక రోజులో విల‌న్ పాత్ర‌ను గుర్తుకు తెచ్చేలా తీర్చిదిద్దిన పాస్ట‌ర్ పాత్ర గంద‌ర‌గోళంగా అనిపిస్తుంది. నాన్ సీరియ‌స్ గా క‌థ‌ను న‌డిపించి.. హింస‌ను హ‌ద్దులు దాటించి.. చివ‌రికొచ్చేస‌రికి ప్ర‌వ‌చ‌నాలు చెప్ప‌డంతో అవేమీ ఎక్క‌వు. ప్రియ‌మ‌ణి న‌ట‌న‌.. కొన్ని ట్విస్టుల వ‌ర‌కు ఓకే అనిపించినా.. మిగ‌తా అంశాల్లో నిరాశ ప‌రిచే భామాక‌లాపం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేదు.


నటీనటులు:

ప్రియ‌మ‌ణిని మ‌ళ్లీ చాన్నాళ్ల‌కు ఇలా లీడ్ రోల్ లో.. అందులోనూ న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌లో చూడ‌టం త‌న అభిమానుల‌కు ఆనందాన్నిచ్చే విష‌య‌మే. అనుప‌మ పాత్ర‌కు ఆమె పర్ఫెక్ట్ అనిపించింది. వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లో పూర్తిగా న్యాయం చేసే ప్ర‌య‌త్నం చేసింది. కానీ ప్రియ‌మ‌ణి ప్రతిభ‌ను పూర్తిగా ఉప‌యోగించుకునే స్థాయిలో ఆ పాత్ర లేక‌పోయింది. ఆమె త‌ర్వాత ఎక్కువ ఆక‌ట్టుకునేది శ‌ర‌ణ్య ప్ర‌దీప్. ప‌నిమనిషిగా కొంత అమాయ‌క‌త్వం.. కొంత గ‌డుసుత‌నం క‌లిసిన పాత్ర‌లో ఆమె బాగా చేసింది. విల‌న్ గా చేసిన త‌మిళ న‌టుడు జాన్ విజ‌య్ చికాకు పెట్టాడు. అత‌ను మంచి న‌టుడే అయినా.. త‌న స్థాయికి త‌గ్గ పాత్ర‌ను ఇవ్వ‌లేదు. విల‌న్ని కాస్తా జోక‌ర్ ను చేసేయ‌డం మైన‌స్ అయింది. ప్రియ‌మ‌ణి భ‌ర్త పాత్ర‌లో చేసిన న‌టుడు ఓకే. పోలీస్ అధికారి పాత్ర‌లో శాంతి రావు బాగానే ఫిట్ అయింది. త‌న పాత్ర‌కు ఇచ్చిన ముగింపే బాగా లేదు. మిగతా ఆర్టిస్టులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

ఓటీటీ సినిమా అయినా సాంకేతికంగా భామా క‌లాపం ఉన్న‌త స్థాయిలోనే రూపొందింది. జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ లాంటి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దీనికి పాట‌లు అందించాడు. పాట‌ల‌కంత‌ ప్రాధాన్యం లేక‌పోయినా.. ఉన్నంత వ‌ర‌కు ప‌ర్వాలేదు. మార్క్ కె.రాబిన్ నేప‌థ్య సంగీతం మంచి ఊపుతో సాగింది. దీప‌క్ ఛాయాగ్ర‌హ‌ణం కూడా బాగుంది. విజువ‌ల్స్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి. రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ అభిమ‌న్యు కొన్ని చోట్ల ప్ర‌తిభ‌ను చాటుకున్నాడు. ఐతే క‌థ‌లో లాజిక్ కు అంద‌ని విష‌యాలు ఎక్కువ అయిపోవ‌డం.. ఈ క‌థ‌ను ఎలా న‌రేట్ చేయాలో తెలియ‌ని గంద‌ర‌గోళం అత‌డిలో క‌నిపించింది. ద‌ర్శ‌కుడిగా అత‌డికి యావ‌రేజ్ మార్కులు ప‌డ‌తాయి.

చివరగా: రుచి త‌గ్గిన వంట‌కం

రేటింగ్-2.5/5
Tags:    

Similar News