మళ్లీ కెమెరా ముందుకు భానుప్రియ సిస్టర్!

Update: 2021-12-06 13:30 GMT
ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు తగ్గితే తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లిపోవడమే. అలా వెళ్లాలనే నిర్ణయానికి వచ్చిన తరువాత ఒకసారి ట్రై చేస్తే పోలా అనుకుంటే, ఎదురుగా కనిపించేది టీవీ సీరియల్స్ మాత్రమే. పైగా ఒకప్పుడు ఇన్ని చానల్స్ లేవు .. ఇన్ని సీరియల్స్ లేవు. ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీని వదిలిపెడితే మళ్లీ ఎవరూ పట్టించుకునేవారు కాదు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వెబ్ సిరీస్ లు అందుబాటులోని వచ్చేశాయి. టీవీ సీరియల్స్ చేయడానికి కాస్త మొహమాటపడిన సినిమా ఆర్టిస్టులు, వెబ్ సిరీస్ లు చేయడానికి పోటీపడుతున్నారు.

ఇక కేవలం ఓటీటీ కోసమే కొన్ని సినిమాలు రూపొందుతుండటం ఆర్టిస్టులకు మరింతగా కలిసొచ్చే అంశం. కొన్ని వెబ్ సిరీస్ ల వారు సీనియర్ ఆర్టిస్టులను వెతికి పట్టుకుని మరీ రంగంలోకి దింపుతున్నారు. అలా భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ కూడా రంగంలోకి దిగిపోయింది. శాంతిప్రియ ఎవరనేది ఈ జనరేషన్ కి తెలియదు.

80వ దశకం చివరిలో శాంతిప్రియ తెలుగు తెరకి పరిచయమైంది. తెలుగులో 'సితార' సినిమాతో భానుప్రియకి తొలి హిట్ ఇచ్చిన వంశీ, ఆమె చెల్లెలు శాంతిప్రియకి 'మహర్షి' సినిమాతో తొలి హిట్ ఇచ్చాడు.

అప్పట్లో ఆమె దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'విశ్వామిత్ర' అనే ధారావాహికలోను నటించింది. ఈ సీరియల్లో ఆమె 'శకుంతల' పాత్రను పోషించింది. ఈ సీరియల్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

ఆ తరువాత తెలుగుతో పాటు కొన్ని తమిళ .. హిందీ సినిమాలు కూడా చేసింది. ఆ సమయంలోనే ఆమె బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ రే ను వివాహం చేసుకుంది. ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన తరువాత, సిద్ధార్థ్ రే అనారోగ్య కారణాల వలన 2004లో చనిపోయాడు. దాంతో ఆమె వాళ్ల ఆలనా పాలన చూస్తూ ఉండిపోయింది.

మళ్లీ ఇంతకాలానికి శాంతిప్రియ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో చేయడానికి అంగీకరించింది. సునీల్ శెట్టి ప్రధాన పాత్రధారిగా 'ధారావి బ్యాంక్' అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. జీ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి సమిత్ కక్కడ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ లో శాంతిప్రియ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలను సోనాలి కులకర్ణి .. వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్నారు. మొత్తానికి 27 ఏళ్ల గ్యాప్ తరువాత శాంతిప్రియ కెమెరా ముందుకు వస్తోందన్న మాట.


Tags:    

Similar News