భీమ్లా నాయక్ ట్రైలర్ తుఫాను ఎప్పుడంటే..?

Update: 2022-02-19 12:30 GMT
పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ''భీమ్లా నాయక్'' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 25న భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.

ఫిబ్రవరి 21న 'భీమ్లా నాయక్' ట్రైలర్ తుఫాను రాబోతుందని.. డ్యూటీ మరియు పవర్ యొక్క అంతిమ ముఖాముఖిని చూడబోతున్నారని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్ ని ఆవిష్కరించారు. పవన్ కళ్యాణ్ బైక్ మీద వస్తుండగా.. జనాలు ఆయనకు దండం పెట్టడాన్ని ఇందులో చూడొచ్చు.

సోమవారం హైదరాబాద్‌ యూసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌ లో గ్రాండ్‌ గా నిర్వహించనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేసే అవకాశం ఉంది. 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ - సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు.

'భీమ్లా నాయక్' సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందులో పవన్ తో పాటుగా రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషించారు. ఇది మలయాళ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ కు రీమేక్‌ గా రూపొందింది. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు - స్ర్కీన్‌ ప్లే అందించారు.

ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. పవన్ సరసన నిత్యా మీనన్.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. సముద్రఖని - బ్రహ్మానందం - రావు రమేష్ - మురళీశర్మ - రఘుబాబు - నర్రా శ్రీను - కాదంబరి కిరణ్ - చిట్టి - పమ్మి సాయి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలు ఏర్పడేలా చేసాయి. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో రాబోయే ట్రైలర్‌ కోసం ఇప్పుడు అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు. పవన్ - రానా మధ్య వార్ ఎలా ఉంటుందో శాంపిల్ గా చూడాలని అనుకుంటున్నారు.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. 'భీమ్లా నాయక్' సినిమా తెలుగుతో పాటుగా హిందీలోనూ రిలీజ్ కానుంది.
Tags:    

Similar News