టాప్ స్టోరి: టాలీవుడ్ పై మ‌న‌సు ప‌డ్డారు!

Update: 2019-03-17 01:30 GMT
లెజెండ్.. క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ ఆ రోజుల్లో తెలుగు సినిమాల‌కు హిందీ హీరోల్ని ఎంపిక చేసుకున్న సంద‌ర్భం ఉంది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌ర్వ‌ధామ‌న్ డి.బెన‌ర్జీని ఆయ‌న టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేశారు. 1986లో తెర‌కెక్కించిన `సిరివెన్నెల‌` చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించారు. అలాగే కె.విశ్వనాథ్ తెర‌కెక్కించిన `స‌ప్త‌ప‌ది` హిందీ రీమేక్ లో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి  క‌థానాయ‌కుడిగా న‌టించారు. ఆ సినిమాలో శ్రీ‌దేవి క‌థానాయిక‌. ఆయ‌న‌కు ముందు, ఆయ‌న త‌ర్వాతా బాలీవుడ్ స్టార్ల‌కు తెలుగు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చిన సంద‌ర్భాలున్నాయి. అంటే తొలి నుంచి బాలీవుడ్ స్టార్ల‌తో మ‌న ద‌ర్శ‌కనిర్మాత‌ల అనుబంధం ఎంతో గొప్ప‌ది. డా.డి.రామానాయుడు - దాస‌రి వంటి ప్ర‌ముఖులు బాలీవుడ్ స్టార్ల‌ను అవ‌స‌రం మేర టాలీవుడ్ కి ఇంపోర్ట్ చేశారు వారి సీజ‌న్ లో.

అయితే కాల‌క్ర‌మంలో హిందీ నుంచి వ‌చ్చే విల‌న్ల‌కు టాలీవుడ్ లో అసాధార‌ణ గిరాకీ పెరిగింది. ఆరున్నర అడుగుల స్ఫుర‌ద్రూపం.. క్రూర‌త్వం నిండిన లుక్ స‌ద‌రు స్టార్ల‌కు తెలుగులో అవ‌కాశాలు క‌ల్పించాయి. ఇప్ప‌టికీ బాలీవుడ్ స్టార్లు టాలీవుడ్ లో విల‌న్లుగా న‌టించేందుకు ఆసక్తి క‌న‌బ‌రుస్తున్నారు. కండ‌ల హీరో సోనూ సూద్ `హ్యాండ్స‌ప్` - అమ్మాయిలు అబ్బాయిలు చిత్రాల‌తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత‌ `సూప‌ర్` సినిమాతో విల‌న్ గా తెలుగు తెర‌పై దూసుకుపోయాడు. పూరి - త్రివిక్ర‌మ్ - శ్రీ‌నువైట్ల‌ - వినాయ‌క్ వంటి అగ్ర ద‌ర్శ‌కుల సినిమాల్లో విల‌నీ చేసి మెప్పించాడు.

అలాగే టాలీవుడ్ లో అమ్రిష్ పురి - ముఖేష్ రిషి - సాయాజీ షిండే వంటి వారు విల‌న్లుగా రాణించారు. స‌ల్మాన్ సోద‌రుడు ఆర్భాజ్ ఖాన్ విల‌నీ చేశాడు. ఇటీవ‌లే మిస్టీరియ‌స్ డెత్ కేసు న‌మోదైన మ‌హేష్ ఆనంద్ సైతం సూప‌ర్ స్టార్ కృష్ణ `నంబ‌ర్ 1` చిత్రంలో విల‌న్ గా న‌టించాడు. ఎంద‌రో బాలీవుడ్ నుంచి వ‌చ్చినా వీళ్ల పేర్లు మాత్రం ప్ర‌ముఖంగా వినిపించాయి. హిందీ సీనియ‌ర్ స్టార్ల బాట‌లోనే నీల్ నితిన్ ముఖేష్  శంక‌ర్- విక్ర‌మ్ ల‌ `ఐ` చిత్రంతో సౌత్ లో విల‌న్ గా అల‌రించాడు. ప్ర‌స్తుతం అత‌డు ప్ర‌భాస్ `సాహో` చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్నాడు. ఖైదీ నంబ‌ర్ 150 స‌హా ప‌లు తెలుగు చిత్రాల్లోనూ ఇప్ప‌టికే నీల్ నితిన్ న‌టించాడు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ 2.0 చిత్రానికి బాలీవుడ్ కిలాడీ అక్ష‌య్ కుమార్ సంత‌కం చేయ‌డ‌మే ఓ సెన్సేష‌న్. ఆ చిత్రంలో ప‌క్షి రాజు పాత్ర‌లో కిలాడీ న‌ట‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప్ర‌స్తుతం రామారావు- రాజ‌మౌళి- రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మ‌ల్టీస్టార‌ర్ ఆర్.ఆర్.ఆర్ లో అజ‌య్ దేవ‌గ‌న్ ఓ కీల‌క పాత్ర‌కు అంగీక‌రించాడు. ఇందులో ఆయ‌న ఓ విప్ల‌వ వీరుడిగా క‌నిపిస్తార‌న్న ముచ్చ‌టా సాగుతోంది. మ‌రో బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ - సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో న‌టిస్తున్నారు. నాగార్జున `ఖుదా గ‌వా` చిత్రంలో న‌టించిన అమితాబ్ ఇంత‌కాలానికి తిరిగి ఓ పూర్తి తెలుగు సినిమాలో న‌టించ‌డం ఆస‌క్తిక‌రం. ఆయ‌న పోర్ష‌న్ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికి పూర్త‌యింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోల్లో అమీర్ ఖాన్ - స‌ల్మాన్ ఖాన్ - హృతిక్ రోష‌న్ తెలుగులోనూ న‌టిస్తామ‌న్నారు కానీ న‌టించ‌లేదు. హైద‌రాబాద్ లో త‌మ చిత్రాల ప్ర‌మోష‌న్స్ లో అలా అనేసి వెళ్లిపోతుంటారు వీళ్లు.


Tags:    

Similar News