ఏజ్ లెస్ బ్ర‌హ్మీని ఏజ్ బార్ అన్న‌దెవ‌రు?

Update: 2021-11-13 08:54 GMT
బ్ర‌హ్మానందం ప‌నైపోయింది అంటూ ప్ర‌చారం చేసింది ఒక టీవీ చాన‌ల్. త‌న‌పై స‌ద‌రు చానెల్ ప్ర‌ద‌ర్శించిన‌ గ్ర‌డ్జ్ పై బ్ర‌హ్మీ కూడా ధీటుగానే స్పందించారు. నిజానికి బ్ర‌హ్మానందం యాటిట్యూడ్ చూసి అవ‌కాశాలు రావడం లేద‌ని స‌ద‌రు చానల్ ప్ర‌చారం చేసినా కానీ .. బ్ర‌హ్మీ మాత్రం త‌న‌ను ఎవ‌రూ నిర్ధేశించాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. త‌న‌కు న‌చ్చ‌ని పాత్రలు రావ‌డం వ‌ల్ల‌నే న‌టించ‌డం లేద‌ని కూడా ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో తుపాకీకి వెల్లడించారు. ప్ర‌తిసారీ చేసేసిన‌వే త‌న వ‌ద్ద‌కు తీసుకొస్తున్న ద‌ర్శ‌కుల‌కు నో చెబుతున్నాన‌ని ఏదైనా కొత్త‌ద‌నం త‌న‌వైపు వ‌స్తేనే చేస్తున్నాన‌ని కూడా ఆయ‌న విన‌మ్రంగా తెలిపారు.

సుమారు వెయ్యి పైగా చిత్రాల్లో న‌టించి గిన్నిస్ రికార్డ్ స్థాయిని చేరుకున్న త‌న‌కు ఏదో ఒక‌టి చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా అన్నారు. అందుకే హాస్య బ్రహ్మీ చాలా సెలెక్టివ్ గా మారారు. ఇప్పుడు విరామ స‌మ‌యాన్ని త‌న‌కు ఇష్టమైన విధానంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. డ్రాయింగ్ తనకు ఇష్టం. అందుకే ఎక్కువ స‌మ‌యం చిత్ర‌లేఖ‌నంతోనే గడుపుతున్నాడు. తాజాగా బ్రహ్మీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అత‌డు త‌ల నెరిసి క‌నిపించారు. ముఖంలో వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపిస్తున్నాయంటూ క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

నిజానికి హాస్యానికి కానీ హాస్య బ్ర‌హ్మీకి కానీ అస‌లు వృద్ధాప్యం అన్న‌దే లేదు. నటుడిగా ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరిన బ్ర‌హ్మీకి దేనిలోనూ కొద‌వేమీ లేదు. వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరి జీవ ప్రక్రియలో ఒక భాగమైనప్పటికీ దానిని చాలా కాలం వాయిదా వేసిన ఘ‌నుడిగానూ బ్ర‌హ్మీని చూడాల్సి ఉంటుంది.

త‌న‌దైన న‌ట‌న కామెడీ టైమింగ్ ఆహార్యంతో కోట్లాది మంది ప్ర‌జ‌ల్ని అల‌రించిన గొప్ప హాస్య న‌టుడు అత‌డు. చిర‌స్థాయిగా అంద‌రి గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచే ఉంటారు. కొన్ని దశాబ్దాల కెరీర్ లో బ్రహ్మీ విభిన్నమైన కామెడీ పాత్రలు చేస్తూ ఐకాన్ గా నిలిచారు. ఇప్ప‌టికీ న‌టిస్తూనే ఉన్నారు. లైఫ్ లో ఎలాంటి స్ట్ర‌గుల్ అన్న‌దే లేకుండా ఇలా ఇంత‌వ‌ర‌కూ సాఫీగా సాగించ‌డం ఈ రంగుల ప్ర‌పంచంలో త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైంద‌ని చెప్పాలి.


Tags:    

Similar News