'రాధేశ్యామ్‌'తో త‌మ‌న్ మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తాడా?

Update: 2022-03-02 07:30 GMT
టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఏ స్టార్ ని క‌దిలించినా.. ఏ ప్రేక్ష‌కుడిని ప‌ల‌క‌రించినా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు త‌మ‌న్ .. త‌మ‌న్‌.. `అల వైకుంఠ‌పుర‌ములో` ఇండ‌స్ట్రీ హిట్ నుంచి త‌మ‌న్ పేరు మారుమ్రోగుతూనే వుంది. టాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కి కేరాఫ్ అడ్ర‌స్ మ‌ణిశ‌ర్మ కానీ ఆ స్థానాన్ని గ‌త రెండు మూడేళ్లుగా త‌మ‌న్ ఆక్ర‌మించేశాడు.

 అంత‌లా అత‌ను అందించిన నేప‌థ్య సంగీతం రీసౌండింగ్ ఇచ్చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతోంది. గ‌త ఏడాది మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `క్రాక్‌` చిత్రానికి త‌మ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన బ‌లంగా నిలిచి ఆ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచేలా చేసింది.

అదే ఏడాది బాల‌కృష్ణ న‌టించిన `అఖండ‌` విజ‌యంలోనూ ప్ర‌ముఖ పాత్ర పోషించి ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహితుల్ని చేసింది. ఇక ఈ ఏడాది ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `భీమ్లానాయ‌క్‌` స‌క్సెస్ విష‌యంలో త‌మ‌న్ ప్ర‌ధాన పాత్ర పోషించాడ‌న్న‌ది తెలిసిందే. త‌ను అందించిన నేప‌థ్య సంగీతం సినిమాని ఓ రేంజ్ లో లేపి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా మార్చి ఫ్యాన్స్ లో పూన‌కాలు తెప్పించింది.

 అలాంటి త‌మ‌న్ కి `రాధేశ్యామ్‌` విష‌మ ప‌రీక్ష‌గా నిలిచింది. క్రాక్‌, అఖండ‌, భీమ్లానాయ‌క్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్ కానీ `రాధేశ్యామ్‌` అలా కాదు.

ఇదొక రొమాంటిక్ క్లాసిక్ ల‌వ్ స్టోరీ. ఆ చిత్రాల‌కు నేప‌థ్య సంగీతాన్ని అందించిన‌ట్టుగా `రాధేశ్యామ్‌`కు అందించ‌డం కుద‌ర‌దు. దీంతో త‌మ‌న్ కు ఈ మూవీ ఓ ఛాలెంజ్ గా మారింద‌ని చెబుతున్నారు. నేప‌థ్య సంగీతం రొమాంటిక్ ఫీల్ ని క‌లిగిస్తూనే ప్రేక్ష‌కుడిని క‌థ‌లో లీనం చేసేలా వుండాలి. అంతే కాకుండా సంగీతం కూడా క‌థ‌ని చెప్పేలా స్మూత్ గా వుండాలి. అయితే నేప‌థ్య సంగీతానికి మాస్ ని ఏ రేంజ్ లో ఆక‌ట్టుకునే వాయిద్యాల‌ని న‌మ్ముకునే త‌మ‌న్ ఫీల్ గుడ్ ల‌వ్ డ్రామాగా రూపొందిన `రాధేశ్యామ్‌`ని ఆశించిన స్థాయిలో త‌న నేప‌థ్య సంగీతంతో ఎలివేట్ చేయ‌గ‌ల‌డా అని ప‌లువురు అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే ఈ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణకుమార్ మాత్రం చిత్ర క‌థ‌ని, థీమ్ ని బాగా అర్థం చేసుకున్నార‌ని, ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట‌రై ఫ‌స్ట్ డే నుంచే ఈ ప్రాజెక్ట్ లో లీన‌మైపోయార‌ని, అద్భుత‌మైన, మ‌న‌సులు గెలుచుకునే స్థాయి నేప‌థ్య సంగీతాన్ని ఈ చిత్రానికి త‌మ‌న్ అందించార‌ని, త‌ను ఈ ప్రాజెక్ట్ కి తోడ‌వ్వ‌డం సినిమాకు మ‌రింత ప్ల‌స్ అయింద‌ని చెప్పుకొచ్చారు. ఇదిలా వుంటే రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా `రాధేశ్యామ్‌`కు రావాల్సినంత హైప్ మాత్రం క్రియేట్ కావ‌డం లేదు. మౌత్ ప‌బ్లిసిటీ కూడా అంతంత మాత్రంగానే వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో త‌మ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం `రాధేశ్యామ్‌` జాత‌కాన్ని మారుస్తుందా? .. త‌మ‌న్‌ గ‌త చిత్రాల‌కు తన నేప‌థ్య సంగీతంతో మ‌రింత బ‌లాన్ని చేకూర్చి న‌ట్టుగానే `రాధేశ్యామ్‌` విష‌యంలోనూ మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తాడా? అని ఫిల్మ్ సర్కిల్స్ లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప్రాజెక్ట్ విష‌యంలో త‌మ‌న్ ప్ల‌స్ అవుతాడా ? లేక మైన‌స్ అవుతాడా? అన్న‌ది తెలియాలంటే ఈ నెల 11 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

    
    
    

Tags:    

Similar News