సీఎం జగన్ కు చిరు - మహేష్ - రాజమౌళి స్పెషల్ థాంక్స్..!

Update: 2022-02-10 14:30 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో గురువారం క్యాంప్ కార్యాలయంలో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన ఈ సమావేశంలో చిరంజీవి - మహేశ్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ - ఆర్. నారాయణ మూర్తి - పోసాని కృష్ణ మురళి - అలీ తదితరులు పాల్గొన్నారు. భేటీ అనంతరం మీడియా ముందుకు వచ్చిన టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే క్రమంలో ట్విట్టర్ వేదికగా మరోసారి ఈ సమావేశంపై స్పందించారు.

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ''తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ అన్ని కోణాల్లో అర్థం చేసుకుని, పూర్తి అవగాహనతో, ఎంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, సమస్యలపై ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడమే కాక.. తెలుగు చిత్ర పరిశ్రమకు భవిష్యత్ కార్యక్రమాన్ని సూచిస్తూ, పరిశ్రమకి అన్ని రకాలుగా అండగా వుంటానని భరోసా ఇస్తూ ఎంతో సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరపున మరో మారు కృతజ్ఞతలు. త్వరలోనే అధికారికంగా పరిశ్రమకి శుభవార్త అందుతుందని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చిన భరోసాతో, మీరు చేసిన దిశానిర్దేశం తో తెలుగు పరిశ్రమ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళుతుందన్న నమ్మకంతో హృదయ పూర్వక ఆనందాన్ని తెలియచేస్తూ.. థాంక్యూ శ్రీ వైయస్ జగన్'' అని పేర్కొన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ''మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, తెలుగు సినిమా అభివృద్ధి చెందడానికి మాకు ఉత్తమంగా హామీ ఇచ్చినందుకు గౌరవనీయులైన సిఎం శ్రీ వైయస్ జగన్ గారికి ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం మరియు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ అవగాహన తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరు చక్కటి సమతుల్యతతో పరిష్కారాన్ని కనుగొంటారని మేము ఆశిస్తున్నాము. మమ్మల్ని నడిపించినందుకు చిరంజీవి సార్‌ కి.. ఇంతటి అవసరమైన సమావేశాన్ని సులభతరం చేసినందుకు మంత్రి పేర్ని నాని గారికి హృదయపూర్వక ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు.

అలానే రాజమౌళి ట్వీట్ చేస్తూ.. ''సినిమా పరిశ్రమ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి లోతైన అవగాహన చూసి ఆశ్చర్యపోయాను. పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సమస్యలపై ఓపికగా చర్చించారు. మా ప్రతిపాదనలన్నీ విన్న తర్వాత, ఆయన వాటిని కమిటీతో పంచుకున్నారు. జీవోని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. వీటన్నింటిని సులభతరం చేసినందుకు.. తన మద్దతును అందించినందుకు మంత్రి పేర్ని నాని గారికి ధన్యవాదాలు'' అని అన్నారు.

ఇకపోతే ఇండస్ట్రీలో ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్న సినీ ప్రముఖులకు నిర్మాత కె. ఎస్. రామారావు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నుండి ఏపీకి ప్రత్యేకంగా వెళ్ళి జగన్ మోహన్ రెడ్డిని కలిసి, చిరకాల సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టించిన చిరంజీవికి, ఇతర హీరోలు దర్శకులను అభినందించారు. అలానే చిత్ర పరిశ్రమలోని సమస్యలను అర్థం చేసుకుని.. సత్వరమే పరిష్కరించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పారు కేఎస్ రామారావు.
Tags:    

Similar News