వివాదాస్పద ట్వీట్.. టాలీవుడ్ కమెడియన్ పై నెటిజన్స్ ఫైర్..!

Update: 2022-10-04 03:50 GMT
టాలీవుడ్ లో ఇప్పుడు బిజీ కమెడియన్ కమ్ క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు రాహుల్ రామకృష్ణ. సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్.. తనకు నోటి దురుసు కూడా ఎక్కువే అని అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాహుల్ రామకృష్ణ.. అన్ని విషయాలపై మంచి అవగాహన కలిగి ఉంటాడు. కాకపోతే తన అభిప్రాయాలను నిర్భయంగా చెబుతూ వివాదాలు కొనితెచ్చుకుంటాడు. ఈ క్రమంలో వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు.

రీసెంట్ గా మహాత్మా గాంధీ మీద రాహుల్ పెట్టిన ఓ ట్వీట్ విమర్శలకు దారి తీసింది. తాను గాంధీని గొప్పవాడిగా పరిగణించట్లేదని ట్వీట్ లో పేర్కొన్నాడతను. గాంధీ జయంతి సందర్భంగా అందరూ ఆయన గురించి గొప్పగా మాట్లాడుతుంటే.. గాంధీ గౌరవాన్ని తగ్గించేలా రాహుల్ చేసిన ట్వీట్ దుమారం రేపింది.

గాంధీ గౌరవాన్ని తగ్గించేలా కామెంట్స్ చేస్తున్న వారిపై రాహుల్ వ్యంగ్యంగా స్పందించారని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరికి మాత్రం అతని వ్యాఖ్యలు రుచించలేదు. గాంధీని అనే స్థాయి లేదంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు. ఒక్కసారిగా అందరూ విరుచుకు పడటంతో రాహుల్ ఆ ట్వీట్‌ ను డెలీట్ చేసాడు.

అప్పట్లో రాహుల్ ప్రధాన పాత్ర పోషించిన 'నెట్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ సమయంలో ఓ బూతు పదాన్ని వాడి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల "G** లో దమ్ముంటే సినిమా తీయండి ఇడియట్స్" అని ట్వీట్ చేసి ట్రోలింగ్ కు గురయ్యాడు. ఎప్పటిలాగే కాసేపటికే ఆ ట్వీట్ ని డిలీట్ చేసాడు.

అలానే తాను 2022 తర్వాత సినిమాలు చేయనని.. రిటైరవుతున్నానని ప్రకటించి ట్వీట్ పెట్టాడు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత తాను జోక్ చేశానంటూ ఫ్లేటు ఫిరాయించి నెటిజన్ల కామెంట్స్ కు బలయ్యాడు. ఇప్పుడు గాంధీ గురించి ట్వీట్ పెట్టి.. అభ్యంతరం వ్యక్తం చేయడంతో డిలీట్ చేసాడు. దీనికి అతను వివరణ కూడా ఇవ్వలేదు.

కాగా, 'సైన్మా' అనే షార్ట్ ఫిలిం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ.. 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే సినిమాతో వెండితెరపై కనిపించాడు. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి రాహుల్ కు మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో కీలక పాత్రలు చేస్తూ ఏడాది పొడవునా బిజీగా ఉంటున్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News