కాపీ ఆరోపణలపై దశరథ్ స్పందించాడు

Update: 2017-09-18 10:43 GMT
ఏదైనా అప్పుడే రిలీజైన.. కాబోతున్న సినిమాలపై కాపీ ఆరోపణలు రావడం మామూలే. కానీ ఎప్పుడో ఆరేళ్ల కిందట విడుదలైన సినిమా గురించి ఇప్పుడు కాపీ ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ హీరోగా దశరథ్ రూపొందించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ విషయంలో అదే జరుగుతోంది. ఈ చిత్రం తాను రాసిన ‘నా మనసు కోరింది నిన్నే’ అనే నవలను కాపీ కొట్టి తీశారంటూ శ్యామలా రాణి అనే రచయిత్రి ఇటీవలే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ టీం మీద కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై దిల్ రాజు ఏమీ స్పందించలేదు. ఐతే దర్శకుడు దశరథ్ దీనిపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు.

శ్యామలా రాణి చెబుతున్న నవల.. 2010 ఆగస్టులో తొలిసారి ప్రచురితమైందని.. ఐతే దానికి 18 నెలల కిందటే తాను రైటర్స్ అసోసియేషన్లో ‘నవ్వుతూ..’ పేరుతో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కథను రిజిస్టర్ చేయించానని దశరథ్ చెప్పాడు. దాని కంటే ముందే తాను.. నిర్మాత దిల్ రాజు కలిసి ‘బిల్లా’ షూటింగులో ఉన్న ప్రభాస్ ను కలిసి ఈ కథ చెప్పామని వివరించాడు. ఈ విషయాలన్నీ ఆరు నెలల కిందటే రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ.. శ్యామలా రాణికి వివరించే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదని దశరథ్ చెప్పాడు. ఇప్పటికైనా ఆమె విషయం అర్థం చేసుకుని ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని అతను కోరాడు. మరి శ్యామలా రాణి ఈ వివరణపై ఏం స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News