ఆ సినిమా చూసి ఆ నిర్మాత అలా అంటాడని ఊహించలేదు: దిల్ రాజు

Update: 2022-07-29 09:30 GMT
దిల్ రాజు  సినిమా రంగంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి సినిమా గురించి మాత్రమే ఆలోచించారు. ఏ హీరోకి ఎలాంటి ఇమేజ్ ఉంది? .. ఏ హీరోను ఎలా చూడటానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు? ఏ హీరోకి ఎలాంటి కథలు నప్పుతాయి? అనే విషయంలో ఆయనకీ మంచి అవగాహన ఉంది. ఏ సినిమా విషయంలోనైనా ఆయన జడ్జిమెంట్ పెర్ఫెక్ట్ గా ఉంటుందని అంతా భావిస్తుంటారు. చాలామంది తమ సినిమాలను కూడా రిలీజ్ కి ముందు ఆయనకి చూపించి అభిప్రాయాన్ని తీసుకుంటూ ఉంటారు. తన బ్యానర్ పై ఆయన ఇంతవరకూ 50 సినిమాలను నిర్మించారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాను గురించి ప్రస్తావించారు.'కొత్త బంగారు లోకం' సినిమా తరువాత శ్రీకాంత్ అడ్డాల నాకు ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన కథ చెప్పాడు. అన్న రోల్ చేయడానికి వెంకటేశ్ రెడీగా ఉన్నారనీ .. మరో హీరోగా ఎవరిని ఒప్పించగలమని అన్నాడు. 'దూకుడు' సెట్లో మహేశ్  బాబుగారిని కలిసినప్పుడు అన్నదమ్ముల కథకి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చాను.

లైన్ వింటానని మహేశ్ గారు అనగానే, ఆ మరుసటి రోజే  శ్రీకాంత్ అడ్డాలతో చెప్పించాను. లైన్ వినగానే ఈ ప్రాజెక్టును చేద్దామని మహేశ్ చెప్పేశారు .. అదే  'సీతమ్మవాకిట్లో  సిరిమల్లె చెట్టు'.  

ఒక జనరేషన్ గ్యాప్ తరువాత వచ్చిన ఆ సినిమా ల్యాండ్ మార్క్ గా నిలిచింది. డబ్బుతో పాటు మంచి పేరును కూడా తీసుకొచ్చింది. అన్నదమ్ములు ఉన్న ప్రతి ఫ్యామిలీ ఆ సినిమాకి కనెక్ట్ అయింది. సంక్రాంతికి ఆ సినిమాను రిలీజ్ చేయడం కూడా కలిసొచ్చింది. ఆ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే అభిప్రాయం కూడా మహేశ్ గారిదే. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఒక ఛారిటీ కోసం ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ షో వేశాను. ఆ సమయంలోనే నా ఆఫీసులో ఇన్ కమ్ టాక్స్ వాళ్ల సెర్చ్ జరుగుతోంది. నేను ఆఫీసులోనే  ఉన్నాను.

 అంతకుముందు నేను ఆ సినిమా చూసుకుని 'డౌట్ లేదు సూపర్ హిట్' అని  వెంకటేశ్ గారికీ .. మహేశ్ బాబుగారికి కూడా చెప్పాను. స్పెషల్  చూసిన నల్లమలుపు బుజ్జి మా ఆఫీసుకి వచ్చేశాడు. "ఏందన్నా ఇద్దరు హీరోలను పెట్టుకుని సినిమా అలా తీశావు.

నాకు అస్సలు ఎక్కలేదన్నా" అన్నాడు. 'బొమ్మరిల్లు' చూసి హిట్ ఖాయమని చెప్పిన బుజ్జి, ఈ సినిమా చూసి ఈ మాట చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. "లేదు బుజ్జి సినిమా సూపర్ హిట్ అవుతుంది" అని నేను చెప్పాను. మర్నాడు మార్నింగ్  షో టాక్ వచ్చిన తరువాత నాకు బుజ్జి నాకు కాల్ చేసి 'అన్నా నీ జడ్జిమెంట్  రైట్' అన్నాడు" అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News