షాక్: దర్శకురాలు బి.జయ కన్నుమూత

Update: 2018-08-31 03:51 GMT
నందమూరి హరికృష్ణ మరణం నుంచి తేరుకోకముందే.. తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకురాలు బి.జయ గురువారం రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జయ గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. తెలుగులో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్ది మంది మహిళా దర్శకుల్లో జయ ఒకరు. ఒకప్పుడు కాలమిస్టుగా - పీఆర్వోగా పని చేసిన జయ తర్వాత నిర్మాతగా.. దర్శకురాలిగా సత్తా చాటుకున్నారు. టాలీవుడ్ లెజెండరీ పీఆర్వో బి.ఎ.రాజుకు జయ సతీమణి. భర్తతో కలిసి సూపర్ హిట్ మ్యాగజైన్ నడపడంతో పాటు ‘సూపర్ హిట్ ఫ్రెండ్స్’ బేనర్ లో సినిమాలు కూడా నిర్మించారు. ఆ తర్వాత సొంత బేనర్లో ‘చంటిగాడు’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు జయ.

ఈ చిత్రం అప్పట్లో ఓ మోస్తరుగా ఆడింది. ఆపై ‘ప్రేమికులు’.. ‘గుండమ్మగారి మనవడు’.. సవాల్ - లవ్ లీ - వైశాఖం సినిమాలు రూపొందించారామె. వీటిలో ‘లవ్ లీ’ జయకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆమెకు దర్శకురాలిగా ఇదే అత్యుత్తమ చిత్రం అనొచ్చు. ఈ సినిమా చూసి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున జయ దర్శకత్వంలో నటించడానికి కూడా ఆసక్తి చూపించడం విశేషం. ఆయన కోసం కథ తయారు చేయడానికి కూడా జయ ప్రయత్నించారు. ఐతే వీరి కాంబినేషన్ సాధ్యపడలేదు. చివరగా ఆమె తీసిన ‘వైశాఖం’ ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా.. మరో సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకున్నారు. కానీ ఇంతలో అనారోగ్యం బారిన పడి హఠాత్తుగా కన్నుమూశారు. ఇండస్ట్రీకి తలలో నాలుకలా ఉండే బి.ఎ.రాజుకు అన్ని రకాలుగా అండగా నిలిచే జయ మరణం ఆయనకు తీరని లోటే.
Tags:    

Similar News