మూవీ రివ్యూ : 'డిస్కో రాజా'

Update: 2020-01-24 08:23 GMT
చిత్రం : 'డిస్కో రాజా'

నటీనటులు: రవితేజ - పాయల్ రాజ్‌ పుత్ - నభా నటేష్ - తన్య హోప్ - బాబీ సింహా - వెన్నెల కిషోర్ - సునీల్ -  గిరిబాబు - నరేష్ - సత్య - జీవా తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: రామ్ తాళ్లూరి
రచన - దర్శకత్వం: వీఐ ఆనంద్

మూస మాస్ కథలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్న మాస్ రాజా రవితేజ.. విభిన్నమైన సినిమాలకు పేరుబడ్డ వీఐ ఆనంద్ తో కలిసి చేసిన ప్రయత్నం ‘డిస్కో రాజా’. స్టైలిష్ టీజర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి మాస్ రాజా ఫ్లాప్ స్ట్రీక్ కు ఈ సినిమా తెరదించేలా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

కొందరు యువకులతో కూడిన ఓ బృందం లద్దాఖ్ లో పర్వతారోహణకు వెళ్తే అక్కడ చాలా ఏళ్ల కిందట చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహం దొరుకుతుంది. దాన్ని ఓ శాస్త్రవేత్తల బృందం తమ చేతికి తీసుకుని.. చనిపోయిన వ్యక్తులకు ప్రాణం పోసే ఓ ప్రయోగానికి శ్రీకారం చుడుతుంది. అనేక ప్రయత్నాల తర్వాత ఆ మనిషికి ప్రాణం పోయగలుగుతుంది ఈ బృందం. ఐతే ఆ వ్యక్తికి తానెవరో.. ఎలా చనిపోయానో.. తననెవరు చంపారో ఏమీ గుర్తుండదు. ఈ స్థితిలో అతడికి మళ్లీ అన్నీ ఎలా గుర్తుకొచ్చాయి.. అతడి గతమేంటి.. తనను చంపిన వాళ్లెవరో తెలుసుకుని అతనెలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన దర్శకుడు వీఐ ఆనంద్. దర్శకుడిగా అతడి ప్రయాణాన్ని గమనిస్తే సైన్స్ ఫిక్షన్ జానర్ మీద ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లనిపిస్తుంది. అతడి ఐడియాలు చాలా కొత్తగా.. ఎగ్జైటింగ్ గా ఉంటాయి. కానీ అతను అన్నిసార్లూ ఆ ఐడియాల్ని తెరమీద ఆసక్తికర రీతిలో ప్రెజెంట్ చేయలేకపోయాడు. అతను చివరగా తీసిన ‘ఒక్క క్షణం’ సంగతి చూస్తే.. అందులో ప్లాట్ పాయింట్ వింటుంటేనే ఒక రకమైన క్యూరియాసిటీ ఏర్పడుతుంది. ఆ సినిమా ప్రోమోలు చూసి వావ్ అనుకున్నారు ప్రేక్షకులు. కానీ తీరా తెరమీద మొత్తం సినిమా చూస్తే ఈ ఐడియాకు తగ్గ స్థాయిలో ఎంతమాత్రం లేకపోయింది. ప్లాట్ పాయింట్లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలో లేకపోయింది. ఇప్పుడు ఆనంద్ నుంచి వచ్చిన ‘డిస్కో రాజా’ కూడా ఇదే కోవకు చెందుతుంది. 35 ఏళ్ల కిందట చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోస్తే అతను మళ్లీ ఈ లోకంలోకి వచ్చి స్పందించే వైనం ఎలా ఉంటుందన్న ఉత్సుకత ప్రేక్షకుడిలో ఉంటుంది. కానీ ఆ క్యూరియాసిటీని నిలబెట్టే కథనం ‘డిస్కో రాజా’లో లేకపోయింది. ఒక దశ వరకు పరవాలేదనిపించినా.. ఆ తర్వాత సగటు ప్రతీకార కథగా మారిన ‘డిస్కో రాజా’ చివరికి సాధారణమైన సినిమాగా ముగుస్తుంది. అక్కడక్కడా కొన్ని మూమెంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగల్చడంలో ‘డిస్కో రాజా’ విఫలమైంది.

35 ఏళ్ల కిందట చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోయడం అన్నది తర్కానికి అందని విషయం. ఐతే ఊహకు అందని విషయాలతో విన్యాసాలు చేయించే అవకాశం సినిమా ఇస్తుంది. సినిమా అంటేనే ఒక అబద్ధాన్ని నిజంలా చెప్పే వ్యవహారం కాబట్టి.. ఆ చెప్పే పద్ధతి ఆసక్తికరంగా ఉంటే ప్రేక్షకులు ఏదైనా చూస్తారు. ‘డిస్కో రాజా’ ఆరంభమైన తీరు చూస్తే ఒక ఎగ్జైటింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ చూడబోతున్న అనుభూతికి లోనవుతాం. అసలే కొత్త కథ.. పైగా ఇలాంటి కథలో రవితేజను చూడటం ఇంకా కొత్తగా అనిపిస్తుంది. కానీ కాసేపటికే మనకు అలవాటైన రవితేజతో అల్లరి వేషాలు వేయించడం ద్వారా ఆ కథలోని ఇంటెన్సిటీని తగ్గించేశాడు దర్శకుడు. మూడున్నర దశాబ్దాల పాటు ఈ లోకానికి దూరంగా ఉండి.. ఉన్నట్లుండి ఈ ప్రపంచంలోకి వచ్చే వ్యక్తి పాత్రతో ఆసక్తికర ఎపిసోడ్లు, సన్నివేశాలు రాసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు ఆ దిశగా ప్రయత్నమే చేయలేదు. ఐతే కథలో అనేక లేయర్లు.. మలుపులు ఉండటంతో తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ప్రేక్షకుడిని ముందుకు నడిపిస్తుంది. డిస్కో రాజాకు తానెవరో గుర్తుకొచ్చి విలన్ గ్యాంగ్ మీద వీర విహారం చేసే ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా పేలడంతో ప్రథమార్ధం వరకు ‘డిస్కో రాజా’ ఓకే అనిపిస్తుంది.

కానీ ‘డిస్కో రాజా’కు ద్వితీయార్ధమే పెద్ద బలహీనతగా మారింది. ఈ కథ మొదలైన తీరుకు.. ద్వితీయార్ధం నడిచే తీరుకు అసలు పొంతనే ఉండదు. 80ల నేపథ్యంలో రెట్రో స్టయిల్లో సాగే ఫ్లాష్ బ్యాక్ ఓ మోస్తరుగా వినోదాన్ని పంచినా.. కథ నడిచే తీరు మాత్రం మామూలుగా అనిపిస్తుంది. తనపై ఆధిపత్యం చలాయించిన విలన్ మీద డిస్కో రాజా కౌంటర్ ఎటాక్ చేసే ఎపిసోడ్ సినిమాలో ‘బెస్ట్’గా చెప్పొచ్చు. ఇక్కడ హీరో ఎలివేషన్ మాస్ ను అలరిస్తుంది. ఐతే ఎనర్జిటిగ్గా సాగే ఈ ఎపిసోడ్ తర్వాత మొదలయ్యే రొమాంటిక్ ట్రాక్ మళ్లీ సినిమాను సాధారణ స్థాయికి తీసుకెళ్తుంది. మళ్లీ వర్తమానంలోకి వచ్చాక ‘డిస్కో రాజా’ ఏమీ పైకి లేవదు. చివర్లో వచ్చే ట్విస్టు కచ్చితంగా ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. కానీ అది ఏ రకమైన ‘మైండ్ బ్లాంక్’ అనేది తెరమీదే చూడాలి. ఇలాంటి ట్విస్టులు చాలా సినిమాల్లో చూశాం కానీ.. ఆ ట్విస్టుతో ముడిపడ్డ పాత్రకు ఎంచుకున్న నటుడెవరో తెలిస్తే మాత్రం ప్రేక్షకులు తలలు పట్టుకోవడం ఖాయం. ఇలాంటి వైల్డ్ థాట్ దర్శకుడికి ఎలా వచ్చిందన్నది అర్థం కాని విషయం. సినిమా ఆరంభమైనపుడు ఉన్న ఇంటెన్సిటీ.. క్యూరియాసిటీ అప్పటికే బాగా తగ్గిపోయి ఉంటే.. ఈ ట్విస్టు పుణ్యమా అని అవి పూర్తిగా చచ్చిపోతాయి. ఓవరాల్ గా చెప్పాలంటే.. స్టోరీ లైన్ వరకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించినా.. దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడి వైఫల్యం ‘డిస్కో రాజా’ను సాధారణమైన సినిమాగా నిలబెట్టింది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్.. తమన్ సంగీతం.. సాంకేతిక ఆకర్షణలు.. కొన్ని మూమెంట్స్ బాగున్నప్పటికీ.. ‘డిస్కో రాజా’ మిశ్రమ అనుభూతినే మిగులుస్తుంది.

నటీనటులు:

డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ మెరిశాడు. డిస్కో రాజాగా ఫ్లాష్ బ్యాక్ లో మాస్ రాజా ఎనర్జీకి ఆయన అభిమానులు ఫిదా అయిపోతారు. ఆ పాత్రకు లుక్ కూడా బాగా సెట్టయింది. వర్తమానంలో మాత్రం రవితేజ మామూలుగా కనిపిస్తాడు. పాయల్ రాజ్ పుత్ గత సినిమాలతో పోలిస్తే ఇందులో బాగానే కనిపించింది. నభా నటేష్.. తన్య హోప్ ల గురించి చెప్పడానికేమీ లేదు. విలన్ పాత్రలో బాబీ సింహా ఆకట్టుకున్నాడు కానీ.. అతడి పాత్రలో ఇంకా బలం ఉండాల్సిందనిపిస్తుంది. తమిళంలో చేసే పాత్రలతో పోలిస్తే బాబీ స్థాయికి తగ్గ క్యారెక్టర్  కాదిది. వెన్నెల కిషోర్ హీరో పక్కనే ఉంటూ కొంత మేర వినోదం పంచాడు. సునీల్ ఏదో కొత్తగా ట్రై చేశాడు కానీ వర్కవుట్ కాలేదు. సత్య, నరేష్, సత్యం రాజేష్ పర్వాలేదు. శిశిర్ శర్మ నటన అతిగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

సినిమాలో అతి పెద్ద ఆకర్షణ అంటే తమన్ సంగీతమే. ఫ్రీకౌట్ సాంగ్ తో అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రంపంపం అంటూ ఈ పాట థీమ్ ను హీరో పాత్రను ఎలివేట్ చేయడానికి అతను చక్కగా వాడుకున్నాడు. ‘నువ్ నాతో ఏమన్నావో’ పాట కూడా చాలా బాగుంది. నేపథ్య సంగీతం సినిమా అంతటా బాగుంది. తమన్ టాప్ ఫామ్ ఈ సినిమాలోనూ కంటిన్యూ అయింది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం కూడా సినిమాకు మరో ఆకర్షణ. 80ల నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్ లో అతను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ సన్నివేశాల్లో ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. రామ్ తాళ్లూరి ఏమాత్రం రాజీ లేకుండా సినిమాను నిర్మించాడు. దర్శకుడు వీఐ ఆనంద్‌ మంచి కథను ఎంచుకున్నా.. అతడికి అన్ని వనరులూ బాగా సమకూరినా.. ఉపయోగించుకోలేకపోయాడు. సాధారణమైన కథనంతో ‘డిస్కో రాజా’ స్థాయిని తగ్గిస్తూ వెళ్లాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో పనితనం కనబరిచినా.. ఓవరాల్ గా అతను దర్శకుడిగా విఫలమయ్యాడు.

చివరగా: డిస్కో రాజా..  ఐడియా బాగుంది కానీ!

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre


Tags:    

Similar News