'దోస్తీ' వీడియో: ఇది రామరాజు - భీమ్ ల స్నేహగీతం..!

Update: 2022-04-21 11:31 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పిరియాడికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. మార్చి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో RRR సినిమా నుంచి ఒక్కటొక్కటిగా ఫుల్ వీడియో సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 'దోస్తీ' పాటను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయగా.. ఐదు ప్రధాన భారతీయ భాషల్లో ఐదుగురు ప్రముఖ గాయకులు ఈ పాట పాడటం విశేషం.

'పులికి విలుకాడికి.. తలకి ఉరి తాడుకి.. కదిలే కార్చిచ్చుకి.. కసిరే ఒడగళ్ళకి.. రవికీ మేఘానికీ.. దోస్తీ..' అంటూ సాగిన ఈ గీతం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ ను నిప్పుకి.. ఎన్టీఆర్ ను నీటికి ప్రతీకగా చూపిస్తూ ఓకే స్క్రీన్ మీద వారిని చూపించిన విధానం అందరినీ ఆకర్షిస్తోంది.

వేర్వేరు లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఇద్దరు వ్యక్తులు.. రెండు విభిన్న ధృవాల మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందనేది 'దోస్తీ' పాటలో వివరించారు. తెలుగు వెర్సన్ కు దివంగత లెజండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. సింగర్ హేమచంద్ర తనదైన శైలిలో ఆలపించారు.

ఇతర భాషల్లో అనిరుధ్ రవిచంద్రన్ - అమిత్ త్రివేది - విజయ్ ఏసుదాసు - యాజిన్ నజీర్ RRR ఫ్రెండ్ షిప్ సాంగ్ ని పాడారు. ఇప్పటికే విడుదలైన 'నాటు నాటు' 'కొమ్మా ఉయ్యాల' పాటలు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా వచ్చిన 'దోస్తీ' గీతం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటన యావత్ సినీ అభిమానుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ఆలియా భట్‌ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్‌ దేవగణ్‌ - శ్రియ - సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.


Full View

Tags:    

Similar News