'డైనమైట్' మూవీ రివ్యూ

Update: 2015-09-04 08:17 GMT
'డైనమైట్' రివ్యూ

నటీనటులు - మంచు విష్ణు - ప్రణీత - జేడీ చక్రవర్తి - పరుచూరి వెంకటేశ్వరరావు - ప్రవీణ్ - యోగ్ - నాగినీడు   తదితరులు
సంగీతం - అచ్చు రాజమణి
ఛాయాగ్రహణం - సతీష్ ముత్యాల
కథ - 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
మాటలు - బి.వి.ఎస్.రవి
ఫైట్స్- విజయన్
నిర్మాత - మంచు విష్ణు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం -  దేవా కట్టా

రీమేక్.. ఈ మధ్య మంచు ఫ్యామిలీ హీరోల సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది. మనోజ్ నటించిన పోటుగాడు - కరెంటు తీగ.. విష్ణు నటించిన దేనికైనా రెడీ.. రీమేక్ సినిమాలే. ఇప్పుడా ఫ్యామిలీ హీరో విష్ణు మరో రీమేక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళంలో విజయవంతమైన 'అరిమానంబి'ని దేవా కట్టా దర్శకత్వంలో 'డైనమైట్'గా రీమేక్ చేశాడు. మరి ఈ ప్రయత్నం ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:

శివాజీ కృష్ణ (మంచు విష్ణు) చదువు పూర్తి చేసి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ చూసుకున్న కుర్రాడు. అతడికి అనుకోకుండా అనామిక (ప్రణీత) అనే పెద్దింటి అమ్మాయి పరిచయమవుతుంది. తనను ఓ ప్రమాదం నుంచి కాపాడిన శివాజీ అంటే నచ్చి.. అతడితో డిన్నర్ కు వెళ్తుంది అనామిక. తర్వాత ఇద్దరూ కలిసి అనామిక ఫ్లాట్ కి వస్తారు. ఇంతలో కొంతమంది రౌడీలొచ్చి అనామికను కిడ్నాప్ చేస్తారు. శివాజీ కిడ్నాపర్లను వెంటాడినా ఫలితముండదు. పోలీసులకు చెప్పినా ప్రయోజనముండదు. ఆ తర్వాత శివాజీ నేరుగా తనే స్వయంగా అనామికను కాపాడ్డానికి బయల్దేరతాడు. ఆ క్రమంలో అతడికి విస్మయపరిచే విషయాలు తెలుస్తాయి. దీని వెనుక సెంట్రల్ మినిష్టర్ రిషి దేవ్ (జేడీ చక్రవర్తి) హస్తముందని తెలుస్తుంది. ఇంతకీ రిషి దేవ్ మనుషులు అనామికను ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు రిషిదేవ్ ఏం చేశాడు? శివాజీ.. అనామికను కాపాడి రిషి దేవ్ ఆట ఎలా కట్టించాడన్నది తెర మీదే చూడాలి.

కథనం, విశ్లేషణ:

ఓ సినిమాను రీమేక్ చేస్తున్నారంటే అందులో ఏదో ప్రత్యేకమైన విషయం ఉంటుందని ఆశిస్తాం. ఆ క్రమంలో అంచనాలు పెంచుకుంటాం. ఐతే 'డైనమైట్' చూసే ముందు అలాంటి అంచనాలేమీ పెట్టుకోకుంటే బెటర్. ఎందుకంటే ఇది చాలా సింపుల్ గా సాగిపోయే యాక్షన్ థ్రిల్లర్. మెస్మరైజ్ అయిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు కానీ..  తర్వాత ఏం జరుగుతుందని చివరిదాకా ఆసక్తి రేపడంలో మాత్రం 'డైనమైట్' విజయవంతమైంది. ఆఖరి వరకు ట్విస్టు రివీల్ చేయకుండా.. సస్పెన్స్ కొనసాగించేలా.. ఆడియన్స్ ని గెస్సింగ్ లో ఉంచేలా రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్.

అయితే 'డైనమైట్'తో వచ్చిన అతి పెద్ద సమస్య ఏంటంటే.. కథనానికి ఏమాత్రం బలం కాని యాక్షన్ సన్నివేశాలపై, పాటలపై దృష్టిపెట్టడం. హీరో విలన్ పై గెలిచేది బుద్ధి బలంతోనే. అలాంటపుడు అతడితో మరీ అతిగా వీరోచిత విన్యాసాలు చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఏంటో మరి. తర్వాత ఏం జరుగుతుందా అని ఉత్కంఠ కలుగుతున్న సమయంలో అనవసరం అనిపించే లెంగ్తీ ఫైట్ల కారణంగా ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఇక పాటల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఒక్క పాట కూడా సినిమాకు అవసరం లేదనిపిస్తుంది.

సినిమా థ్రిల్లర్ మోడ్ లోకి మారడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదు. అయినప్పటికీ ఆ కొద్ది సమయం కూడా భారంగానే గడుస్తుంది. హీరోహీరోయిన్ల పరిచయ సన్నివేశాలు ​అంత ఎఫెక్టివ్ గా లేవు. ఇక అసలు కథ మొదలయ్యాక.. మాత్రం ప్రేక్షకుడు ఎంగేజ్ అయిపోతాడు. పాటలు, ఫైట్లు మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టడం వల్ల బండి కొంచెం నెమ్మదిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కానీ.. వాటిని మినహాయిస్తే కథనం ఆసక్తికరంగానే సాగుతుంది. విలన్ నేరుగా రంగంలోకి దిగాక చివరి అరగంట ఉత్కంఠ రేపుతుంది. చివర్లో రైల్వే స్టేషన్ సీన్ కు సంబంధించి సన్నివేశాలు కన్ఫ్యూజ్ చేస్తాయి. పోలీసుల్ని హీరో తప్పుదోవ పట్టించి విలన్ ను తీసుకెళ్లే సన్నివేశం​ కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఓకే.​ ​

'డైనమైట్'లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ.. సినిమా​లో​ కొంచెం ​యాక్షన్ పాళ్లు తగ్గి ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎంత మినిస్టర్ అయినప్పటికీ మొత్తం వ్యవస్థను గుప్పెట్లో పెట్టేసుకుని తన ఇష్టానుసారం ఆపరేట్ చేయడం.. కంట్రోల్ రూంలోనే హత్య చేయడం.. చివర్లో అంతమంది పోలీసుల ముందే హత్య చేశాను.. ఏం చేస్తావు అని హీరోను చూసి అరవడం అతిగా అనిపిస్తుంది. హీరో విన్యాసాలు​ ఏ క్లాసు థియేటర్లలో బోర్ అనిపించినా బీ-సీ సెంటర్లకు బానే అనిపిస్తాయి. . ట్రాఫిక్ పోలీసులు లాక్ చేసిన కారుని అతడెలా వేసుకెళ్లిపోతాడో.. యమస్పీడు మీదున్న ట్రైన్లోకి విలన్ తో సహా ఎలా వెళ్లిపోతాడో.. అర్థం కాదు. ప్రేక్షకుడి బుర్రకు అనుక్షణం పరీక్ష పెట్టడం థ్రిల్లర్ సినిమాల లక్షణం. అలాంటి సినిమాల్లో ఇలాంటి ​అదనపు హంగులు కొంచెం ఇబ్బంది పెట్టాయి.  నిజానికి ఈ సినిమాకు పాటలు అవసరమయ్యే సన్నివేశాలే లేవు. కాకపోతే పాటలు తెలుగు సినిమా లక్షణం కాబట్టి క్షమించేయొచ్చు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పండకపోవడం కూడా సినిమాలో చెప్పుకోవాల్సిన మైనస్. ​ఇంకా కరెక్టుగా చెప్పాలంటే ఆ సన్నివేశాలు ఈ సినిమాలో సింక్ అవలేదు.  సినిమాలో హీరోయిన్ కోసం హీరో అంత కష్టపడటం​ ప్రేక్షకుడికి బానే ఉంది కానీ... ఆమె కిడ్నాప్ కు ముందే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఉంటే ఇంకా బాగా కనెక్టయ్యేది.   తమిళ వెర్షన్ లోనూ లాజిక్ కి అందని, అతిగా అనిపించే అంశాలు​ ఉన్నాయి. ఐతే తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి హీరోయిజం బాగా ఎలివేటవ్వాలన్న ఉద్దేశంతో ఈ అవసరం లేని హంగుల మీద ఎక్కువ దృష్టిపె​ట్టారు.​

నటీనటుల:

 శివాజీ పాత్ర కోసం విష్ణు చాలా కష్టపడ్డ సంగతి సినిమా అంతటా కనిపిస్తూనే ఉంటుంది. లుక్ మార్చాడు, బాడీ పెంచాడు, యాక్షన్ సన్నివేశాల్లో బాగా కష్టపడ్డాడు. విష్ణు ఇందులో కొంచెం కొత్తగా కనిపించాడు, అతడి నటన కూడా కాస్త భిన్నంగా సాగింది. క్లోజప్ షాట్స్ లో మునుపటితో పోలిస్తే పరిణతి చూపించాడు. ​ప్రణీత  అందం, అభినయం ​ఓ మాదిరిగా అనిపిస్తాయి. నిజానికి ఆమెది కథలో కీలకమైన పాత్రే కానీ.. దాన్ని పేలవంగా తయారు చేశారు. హీరో పక్కన ఉందంటే ఉందన్నట్లు చూపించారు. సినిమాలో అందర్లోకి ఎక్కువ ఆకట్టుకునేది జేడీ చక్రవర్తి. చాలా సింపుల్ గా క్యారెక్టర్లోని కన్నింగ్ నెస్ ని కన్వే చేశాడు జేడీ. సరిగ్గా వాడుకోవాలే కానీ.. నెగెటివ్ క్యారెక్టర్లలో చితక్కొట్టేస్తానని చాటి చెప్పాడు జేడీ. సినిమాలో మిగతావన్నీ చిన్నా చితకా పాత్రలే.

సాంకేతిక వర్గం:

ఉన్నవే మూడు పాటలు. అవీ కథనానికి అడ్డం పడ్డాయి. పోనీ అవేమైనా వినసొంపుగా ఉన్నాయా అంటే అదీ లేదు. అచ్చు ఇంత పేలవమైన పాటలు ఇంతవరకు ఎప్పుడూ ఇచ్చినట్లు లేడు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఓకే అనిపిస్తుంది. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం బాగుంది. ప్రథమార్ధంలో వచ్చే ఛేజ్ సీన్స్ అంత ఎఫెక్టివ్ గా లేవు కానీ.. ద్వితీయార్ధంలో కెమెరా పనితనం కనిపిస్తుంది. బి.వి.ఎస్.రవి రాసిన మాటల్లో మెరుపులేం లేవు. రీమేక్ కావడం వల్లో ఏమో.. దర్శకుడిగా దేవా కట్టా తన ముద్ర చూపించే ప్రయత్నమేమీ చేయలేదు. మూల కథలో జోక్యం చేసుకోలేదు. విష్ణు టీంతో కలిసి స్క్రీన్ ప్లేలో అక్కడక్కడా మార్పులు చేశాడు కానీ అవేమంత ఎఫెక్టివ్ గా లేవు.

చివరగా : డైనమైట్ పేలింది... ఓ మోస్తరు సౌండుతో​ !​

రేటింగ్ -  2.​7​5/5

Disclaimer :
This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre
Tags:    

Similar News