మూవీ రివ్యూ : 'ఎఫ్ఐఆర్'

Update: 2022-02-11 16:52 GMT
చిత్రం : 'ఎఫ్ఐఆర్'

నటీనటులు: విష్ణు విశాల్-రెబా మోనికా జోస్-మాంజిమా మోహన్-గౌతమ్ మీనన్ తదితరులు
సంగీతం: అశ్వత్
ఛాయాగ్రహణం: అరుల్ విన్సెంట్
నిర్మాతలు: శుభ్ర-ఆర్యన్ రమేష్-విష్ణు విశాల్
రచన-దర్శకత్వం: మను ఆనంద్

తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్న తమిళ కథానాయకుల్లో విష్ణు విశాల్ కూడా చేరాడు. ‘అరణ్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ యువ నటుడు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఎఫ్ఐఆర్’ తెలుగులోనూ పెద్ద స్థాయిలో విడుదలైంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఇర్ఫాన్ అహ్మద్ (విష్ణు విశాల్) ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీ గోల్డ్ మెడల్ సంపాదించి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న కుర్రాడు. మూడేళ్లు కష్టపడ్డా అతడికి ఉద్యోగం రాదు. దీంతో చిన్న ల్యాబులో కెమికల్ ఇంజినీర్ గా చేరతాడు. తన ప్రతిభకు తగ్గ ఉద్యోగం రాలేదని బాధ పడుతూ జీవనం సాగిస్తున్న అతడిపై ఊహించని విధంగా ఉగ్రవాదిగా ముద్ర పడుతుంది. ఐసిస్ నేతృత్వంలో జరిగిన ఉగ్ర దాడి వెనుక కీలక సూత్రధారి అతనే అని పోలీసులు నమ్మి అరెస్ట్ చేస్తారు. ఆధారాలన్నీ అతడికి వ్యతిరేకంగానే కనిపిస్తాయి. మరి ఈ ఉగ్రదాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు.. ఈ కేసు నుంచి ఇర్ఫాన్ బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

కేవ‌లం ముస్లిం అన్న కార‌ణంతో అనుమానంగా చూసి.. ఉగ్ర‌వాది అన్న ముద్ర వేసి పోలీసులు చిత్ర హింస‌లు పెట్టిన ఉదంతాలు అప్పుడ‌ప్పుడూ కొన్ని బ‌య‌టికి వ‌స్తుంటాయి. చాలా సినిమాల్లోనూ ఇలాంటి ఎపిసోడ్లు చూశాం. అదే స‌మ‌యంలో ఉగ్ర‌వాదానికి మ‌తంతో సంబంధం లేద‌ని.. వేరే మ‌తాల‌కు చెందిన వ్య‌క్తులు కూడా ఉగ్ర‌వాదుల‌వుతుంటార‌నే కోణంలోనూ అప్పుడ‌ప్పుడూ కొన్ని చిత్రాల్లో చ‌ర్చ జ‌రుగుతుంటుంది. ఈ అంశాల‌నే స్పృశిస్తూ.. చాలాసార్లు చూసిన క‌థ‌లాగే మొద‌లై.. చివ‌రికి ఊహించ‌ని ముగింపుతో ఆశ్చ‌ర్య‌ప‌రిచే సినిమా ఎఫ్ఐఆర్. అమాయ‌కుల‌పై పోలీసులు ఉగ్ర‌వాదుల ముద్ర వేసే వైనాన్ని.. అలాగే ముస్లిమేత‌రుడు ఉగ్ర‌వాదిగా మారే క్ర‌మాన్ని ఎఫ్ఐఆర్ సినిమాలో చూపించిన తీరుపై కొంత అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌చ్చు గాక‌.. ఒక సినిమాగా ఎఫ్ఐఆర్ మంచి ప్ర‌య‌త్నం అన‌డంలో సందేహం లేదు. ఒక ద‌శ వ‌ర‌కు మ‌న‌ మ‌నోహ‌రం సినిమాను త‌ల‌పిస్తూనే.. ఆ త‌ర్వాత కొత్త మ‌లుపు తీసుకుని ఆశ్చ‌ర్యానికి గురి చేసే ఈ సినిమా.. ఉగ్ర‌వాదం చుట్టూ తిరిగే సీరియస్ థ్రిల్ల‌ర్ల‌ను ఇష్ట‌ప‌డేవారిని మెప్పిస్తుంది.

ఒక దృష్టి కోణంతో క‌థ‌ను న‌డిపించి.. ఆ త‌ర్వాత మ‌నం చూసిన కోణ‌మే త‌ప్పు అన్న‌ట్లుగా మొత్తం క‌థ‌ను మ‌రో కోణంలో మార్చి చూపించ‌డం ఒక‌ స్క్రీన్ ప్లే టెక్నిక్. ఒక‌ప్పుడు కొత్త‌గా అనిపించినా.. ఈ త‌ర‌హాలో చాలా క‌థ‌లు వ‌చ్చేయ‌డంతో మామూలుగానే అనిపిస్తుంటాయి ఈ క‌థ‌లు. ఎఫ్ఐఆర్ ఈ త‌ర‌హా సినిమానే అయిన‌ప్ప‌టికీ.. ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది ముందే ఒక అంచ‌నాకు అయితే రాలేం. రెండున్న‌ర గంట‌ల సినిమాలో రెండు గంట‌ల వ‌ర‌కు ఒక త‌ర‌హాలో.. ఫ్లాట్ గా సాగిపోతుందీ సినిమా. అందులో మ‌రీ కొత్త‌ద‌నం ఏమీ క‌నిపించ‌దు. కానీ క‌థ‌నం మాత్రం చాలా వ‌ర‌కు ఎంగేజ్ చేస్తుంది. మంచి చ‌దువు చ‌దివినా కోరుకున్న ఉద్యోగం రాక ఫ్ర‌స్టేష‌న్లో ఉన్న ముస్లిం కుర్రాడు త‌న‌కు తెలియ‌కుండానే ఉగ్ర‌వాద కేసులో చిక్కుకుపోయే క్ర‌మాన్ని ప‌క‌డ్బందీగానే చూపించాడు దర్శ‌కుడు మ‌ను కుమార్. హీరోపై ఉగ్ర‌వాది ముద్ర ప‌డ‌టానికి దారి తీసే ప‌రిస్థితుల‌ను చూపించ‌డంతో తొలి గంట క‌థ‌నం న‌డుస్తుంది. ఇందులో కొన్ని స‌న్నివేశాలు మనోహ‌రం సినిమాను గుర్తు చేస్తాయి. అందులో పోలీసులు హీరోను ఉద్దేశ‌పూర్వ‌కంగా ఇరికిస్తే.. ఇక్క‌డ పోలీసుల‌కు ఆ ఉద్దేశం ఏమీ లేక‌పోయినా.. ప‌రిస్థితులు అత‌డు ఇరుక్కునేలా చేస్తాయి. అంతే తేడా.

హీరో పోలీసుల చేతికి చిక్కాక ఉగ్ర‌వాది అని అత‌ణ్ని ఒప్పించ‌డానికి జ‌రిగే ప్ర‌య‌త్నం.. అత‌డి కుటుంబం ఎదుర్కొనే అవ‌మానాల నేప‌థ్యంలో స‌న్నివేశాలు భారంగా గ‌డుస్తాయి. ఈ ఎపిసోడ్ వ‌ర‌కు హింస‌ని.. బాధ‌ని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. సినిమా సాధార‌ణంగా మారిపోతున్న భావ‌న కూడా క‌లుగుతుంది ఈ ద‌శ‌లో. ఐతే హీరో పోలీసుల నుంచి త‌ప్పించుకున్నాక ఏం చేస్తాడ‌నే విష‌యంలో ఆస‌క్తి రేకెత్తుతుంది. ఇక్కడి నుంచి ఎఫ్ఐఆర్ సినిమా ప్ర‌త్యేక‌త క‌నిపిస్తుంది. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు భిన్నంగా హీరో పాత్ర‌కు సంబంధించిన ట్విస్టు.. ఉత్కంఠ రేకెత్తించే ప‌తాక స‌న్నివేశాల‌తో సినిమాకు మంచి ముగింపు ల‌భిస్తుంది. ఆరంభం నుంచి చివ‌రి దాకా ఎక్క‌డా క‌థాక‌థ‌నాలు ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా సాగే ఈ సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ అంశాలు పెద్ద‌గా ఆశించ‌కూడ‌దు. సినిమా మ‌రీ సీరియ‌స్‌గా సాగ‌డం వ‌ల్ల‌.. ఎంట‌ర్టైన్మెంట్ ఆశించే వారికి ఎఫ్ఐఆర్ రుచించ‌క‌పోవ‌చ్చు. అలా కాకుండా సీరియ‌స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ల‌ను ఇష్ట‌ప‌డేట్ల‌యితే ఎఫ్ఐఆర్ మెప్పిస్తుంది.

నటీనటులు:

తమిళంలో మంచి మంచి సినిమాల‌తో త‌న అభిరుచిని చాటుకున్న‌ విష్ణు విశాల్.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకూ త‌న ప్ర‌తిభ‌ను ప‌రిచ‌యం చేశాడు. ఇర్ఫాన్ అహ్మ‌ద్ పాత్ర కోసం అత‌నెంత క‌ష్ట‌ప‌డ్డాడో తెర‌మీద క‌నిపిస్తూనే ఉంటుంది. పాత్ర కోసం ఆహార్యాన్ని మార్చుకోవ‌డ‌మే కాదు.. న‌ట‌న ప‌రంగా సిన్సియ‌ర్ ఎఫ‌ర్ట్ పెట్టాడు విష్ణు. పాత్ర‌కు త‌గ్గ‌ట్లు అత‌ను చూపించిన ఇంటెన్సిటీ సినిమాలో మేజ‌ర్ హైలైట్ల‌లో ఒక‌టి. క‌థానాయిక‌గా న‌టించిన రెబా మోనికా త‌క్కువ నిడివిలోనే త‌న ప్ర‌భావాన్ని చూపించింది. ప్ర‌త్యేక పాత్ర‌లో మాంజిమా మోహ‌న్ కూడా ఓకే. ఎన్ఐఏ అధికారిగా ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ చ‌క్క‌గా న‌టించాడు. ఆ పాత్ర‌కు వైవిధ్యం తీసుకొచ్చాడు. మిగ‌తా న‌టీన‌టులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

టెక్నిక‌ల్ గా ఎఫ్ఐఆర్ ఉన్నతంగా క‌నిపిస్తుంది. అశ్వ‌త్ నేప‌థ్య సంగీతం ఆద్యంతం ఉత్కంఠ రేపేలా.. భావోద్వేగాలు రేకెత్తించేలా సాగింది. పాట‌లు జ‌స్ట్ ఓకే అనిపిస్తాయి. అరుల్ విన్సెంట్ ఛాయాగ్ర‌హ‌ణం సినిమా మూడ్ కు త‌గ్గ‌ట్లుగా సాగింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ మ‌ను కుమార్ ర‌చ‌యిత‌గా.. ద‌ర్శ‌కుడిగా సిన్సియారిటీ చూపించాడు. క‌మ‌ర్షియ‌ల్ హంగుల పేరుతో లెక్క‌లేసుకోకుండా సీరియ‌స్‌గా.. ప‌క‌డ్బందీగా ఒక క‌థ‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. మ‌ధ్య‌లో కొంత త‌డ‌బ‌డ్డ‌ప్ప‌టికీ.. ఓవ‌రాల్ గా అత‌ను ద‌ర్శ‌కుడిగా ఆక‌ట్టుకున్నాడు.

చివరగా: ఎఫ్ఐఆర్.. ఇంటెన్స్ థ్రిల్ల‌ర్

రేటింగ్-2.75/5
Tags:    

Similar News