గ్రాఫిక్స్ కు బదులుగా కథ పై దృష్టి పెట్టండి సార్..!!

Update: 2022-04-01 02:30 GMT
ఒకప్పుడు ఫిలిం మేకర్స్ అందరూ కథకు అవసరమైతేనే గ్రాఫిక్స్ లేదా VFX వర్క్స్ వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉండటంతో గ్రాఫిక్స్ కోసమే సినిమాలు తీసే రోజులు వచ్చాయి. అవసరం లేకపోయినా అదనపు హంగులు అద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక పాన్ ఇండియా సినిమాల హడావిడి మొదలైన తర్వాత ఇప్పుడు ప్రతీ ఫిలిం మేకర్ కూడా గ్రాండియర్ గా సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద పెద్ద సెట్ల నిర్మాణం చేపట్టి లార్జ్ స్కేల్ లో సినిమాలను రూపొందిస్తున్నారు.

ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి విజువల్ గ్రాండియర్ గా సినిమా తీయాలని అనుకోవడంలో తప్పులేదు.. కానీ దానికి తగ్గట్టుగా ఒక కథను చెప్పకపోతేనే అసలు సమస్య వస్తుంది. భారీ తనం ఉంటే చాలు జనం మైమరిచిపోతారనే భావన చాలా మంది మేకర్స్ లో ఉన్నట్లు అర్థం అవుతోంది.

కథ మీద పెద్దగా కసరత్తు చేయకుండా విజువల్ గ్రాండియర్ అందించడమే లక్ష్యంగా ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ స్థాయిలో బ్రహ్మాండంగా తీశారు.. విజువల్స్ - గ్రాఫిక్స్ అదిరిపోయాయి అని ప్రశంసలు అందుకున్నాయి. కానీ సినిమా కథేంటి? బేసిక్‌ గా ఏం చెప్పాలనుకున్నారు? అనేది మాత్రం ప్రేక్షకులకు అర్థం కాలేదు.

దీంతో కథ మీద దృష్టి పెట్టకుండా.. కేవలం గ్రాఫిక్స్ - వీఎఫ్ఎక్స్ వర్క్స్ - భారీ సెట్స్ ను నమ్ముకున్నారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో విజువల్ గ్రాండియర్ గా ఉంటే చాలు.. జనాలు అసలు స్టోరీ గురించి పట్టించుకోరని మేకర్స్ ఆలోచిస్తున్నారేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల విడుదలైన 'రాధేశ్యామ్'.. లేటెస్టుగా వచ్చిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలపై ఇలాంటి కంప్లయింట్స్ వచ్చాయి. పాన్ ఇండియా మోజులో ఇప్పటి ఫిలిం మేకర్స్ భారీ తనంతో సినిమాలని రూపొందించాలని చూస్తున్నారేమో అనే కామెంట్స్ వచ్చాయి.

'రాధేశ్యామ్' మరియు 'RRR' అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ మేకర్స్ అందరూ గ్రాఫిక్స్ మరియు VFX కి బదులుగా కథపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో 'సలార్' 'ప్రాజెక్ట్ కె' 'RC15' 'పుష్ప 2' వంటి పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

అయితే ఈ పాన్ ఇండియా చిత్ర బృందాలు ఇప్పుడు గ్రాఫిక్స్ - వీఎఫ్ఎక్స్ మరియు సెట్ వర్క్‌ లకు బదులుగా స్క్రిప్ట్ విభాగంలో మరింత కష్టపడి పని చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కాస్త ఆలస్యమైనా స్క్రిప్టు పగడ్బంధీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పాన్ ఇండియా రేంజుకు తీసుకెళ్లాలంటే గ్రాఫిక్స్ - పెద్ద సీట్లు - భారీ తనం మాత్రమే కాదు.. సరైన కథ కూడా ఉండాలని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం.
Tags:    

Similar News